బిడ్డా... మమ్మల్ని క్షమించు!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:24 AM
బిడ్డా... మమ్మల్ని క్షమించు. 19 ఏళ్లయినా నీకు న్యాయం చేయలేకపోయాం. పోలీసు, సీబీఐ, న్యాయవ్యవస్థల్లో ఏ ఒక్కటి నీకు న్యాయం చేయలేదు...
19 ఏళ్లయినా నీకు న్యాయం చేయలేకపోయాం.. మా పోరాటం అరణ్య రోదనగా మిగిలిపోయింది
ఆయేషా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం
కుమార్తె అవశేషాలను అప్పగించిన బెజవాడ సీబీఐ కోర్టు
విజయవాడ/తెనాలి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘బిడ్డా... మమ్మల్ని క్షమించు. 19 ఏళ్లయినా నీకు న్యాయం చేయలేకపోయాం. పోలీసు, సీబీఐ, న్యాయవ్యవస్థల్లో ఏ ఒక్కటి నీకు న్యాయం చేయలేదు’.. అంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు కోర్టులో కన్నీళ్లు మున్నీ రయ్యారు. బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా హత్యాచారం కేసును విజయవాడలోని సీబీఐ కోర్టు ఇటీవల కొట్టివేసిన విషయం తెలిసిందే. రీపోస్టుమార్టం కోసం సీబీఐ సేకరించిన బాధితురాలి అవశేషాలను తీసుకొనేందుకు ఆయే షా తల్లిదండ్రులు ఇక్బాల్, సంషాద్ బేగం, ముస్లిం మత పెద్దలు శుక్రవారం తెనాలి నుంచి విజయవాడ వచ్చారు. బెజవాడ బార్ అసోసియేషన్ కార్యాలయం నుంచి న్యాయవాదులు, మహిళా సంఘాలతో కలిసి ఆయేషాకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. సీబీఐ కోర్టు వరకు ర్యాలీ చేశారు. ఆయేషా తల్లిదండ్రులు తమ ఆవేదనను న్యాయాధికారి అన్నపూర్ణకు విన్నవించుకున్నారు. ‘‘ఈ కేసులో బాధితులను నిందితులు చేశారు. నిందితులను సాక్షులు చేశారు. మా పోరాటం ఒక అరణ్య రోదనగా మిగిలింది. మాకు న్యాయం కావాలి’’ అని విలపించారు. సంతకాలు చేసే క్రమంలో ‘‘బిడ్డా... మమ్మల్ని క్షమించు. నీకు న్యాయం చేయలేకపోయాం’’ అంటూ బోరున విలపించారు. అనంతరం కోర్టు నుంచి ఎంజీ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి అవశేషాలను సీల్డ్ బాక్స్‌లో గుంటూరు జిల్లా తెనాలికి అంబులెన్స్ ద్వారా తీసుకెళ్లారు. ఆయేషా శరీర భాగాలను తెనాలి చెంచుపేట ముస్లిం శ్మశానవాటికలో తిరిగి ఖననం చేశారు. ముస్లిం యువకులు, కూటమి నాయకులు ర్యాలీగా వచ్చి వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేశారు.
హైకోర్టు జడ్జితో విచారణ చేయాలి
దోషులకు శిక్ష పడిన రోజే ఈ కేసు మూతపడినట్టవుతుందని ఇక్బాల్ అన్నా రు. ఖననం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని.. హైకోర్టు సిటింగ్ జడ్జితో జ్యుడీషియల్ విచారణ జరిపించేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీబీఐ తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రాణాలతో ఉన్నంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలో తల్లి సంషాద్ మాట్లాడుతూ.. సామాన్యులకు న్యాయం జరగదని తమ కేసు ద్వారా తేలిందన్నారు.