ఆటోడ్రైవర్ అమానుషం
ABN , Publish Date - Feb 13 , 2026 | 03:38 AM
ఆటోలో స్కూలుకు వెళుతున్న ఉపాధ్యాయురాలిపై ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం జరిగింది.
వాహనం ఆపి టీచర్‌పై కత్తితో దాడి.. గొలుసు లాక్కుని పరార్
చికిత్స పొందుతున్న బాధితురాలు
పోలీసుల అదుపులో నిందితుడు
నెల్లూరు జిల్లా గూడూరులో ఘటన
గూడూరు, ఫిబ్రవరి 12(ఆంధ్రజ్యోతి): ఆటోలో స్కూలుకు వెళుతున్న ఉపాధ్యాయురాలిపై ఆటోడ్రైవర్ కత్తితో దాడి చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. స్థానిక అశోక్‌నగర్ ప్రాంతానికి చెందిన హరిత అనే ఉపాధ్యాయురాలు బాలాయపల్లి మండలం (తిరుపతి జిల్లా) గొట్టికాడు ప్రభుత్వ ప్రాథమికపాఠశాలలో పని చేస్తున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లేందుకు అశోక్‌నగర్ వాటర్‌ట్యాంక్ సమీపంలో ప్యాసింజర్ ఆటో ఎక్కారు. చెన్నూరు, తిప్పవరప్పాడులో తోటి ప్రయాణికులు దిగిపోయారు. ఆమె ఒంటరిగా ఉండటంతో డ్రైవర్ ఆటోను తిరువెంగళాయపల్లి సమీపంలో నిలిపి, చక్రంలో గాలి తగ్గిందని నటిస్తూ.. హరితపై కత్తితో దాడికి పాల్పడి, ఆమె మెడలోని గొలుసు లాక్కొన్నాడు. ఆటో నుంచి కింద పడిన ఆమె.. అతడిని ప్రతిఘటించి కేకలు వేసింది. దీంతో ఆటో డ్రైవర్ పరారయ్యాడు. గాయాలతో రోడ్డుపై పడి ఉన్న హరితను స్థానికులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమెను డీఎస్పీ గీతాకుమారి పరామర్శించి, వివరాలు తెలుసుకున్నారు. తన మెడలోని ఒకటిన్నర సవర బంగారు ఆభరణాన్ని ఆటో డ్రైవర్ ఎత్తుకెళ్లాడని బాధితురాలు డీఎస్పీకి చెప్పారు. అనంతరం బాధితురాలిని నెల్లూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని అదనపు ఎస్పీ సౌజన్య చెప్పారు. నిందితుడు గూడూరు మండలం చెన్నూరుకు చెందిన ఆటోడ్రైవర్ వెంకటరమణ అలియాస్ చిన్నా అని, అతడిని గూడూరు రూరల్ ఎస్‌ఐ తిరుపతయ్య విచారిస్తున్నారని తెలిపారు.