నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం
ABN , Publish Date - Feb 20 , 2026 | 03:07 AM
మదనపల్లెలో ఓ మానవ మృగం చేతిలో ఏడేళ్ల చిన్నారి బలైన ఘటనను మరువక ముందే అన్నమయ్య జిల్లా పీలేరులో నాలుగేళ్ల చిన్నారిపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడి...
పీలేరులో బాలుడికి స్థానికుల దేహశుద్ధి
పోలీసుల అదుపులో నిందితుడు
పీలేరు, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): మదనపల్లెలో ఓ మానవ మృగం చేతిలో ఏడేళ్ల చిన్నారి బలైన ఘటనను మరువక ముందే అన్నమయ్య జిల్లా పీలేరులో నాలుగేళ్ల చిన్నారిపై పదహారేళ్ల బాలుడు లైంగిక దాడి యత్నానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పీలేరు-మదనపల్లె మార్గంలో ఉన్న కాలనీకి చెందిన 16 ఏళ్ల ఓ బాలుడు ఇంటి వద్దే ఉంటూ కూలీ పనులకు వెళ్తుంటాడు. గురువారం అతను ఆ కాలనీలోనే ఓ ఇంటి నిర్మాణం పనికి వెళ్లాడు. మధ్యాహ్నం నాలుగు గంటల ప్రాంతంలో అటుగా వచ్చిన నాలుగేళ్ల చిన్నారిని మరుగుకు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ మహిళ ఈ ఘటనను చూసి గట్టిగా కేకలు వేయడంతో పాటు ఆ బాలుడిని పట్టుకుంది. దీంతో గుమిగూడిన ప్రజలు అక్కడే ఆ బాలుడికి దేహశుద్ధి చేశారు. దీంతో భయపడిన అతను అక్కడి నుంచి పరారయ్యాడు. పీలేరు పోలీసులు గురువారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల దాడిలో గాయపడ్డ అతడికి పీలేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చిన్నారిపై లైంగిక దాడికి యత్నానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పలు విద్యార్థి, ప్రజాసంఘాల నేతలు అక్కడ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి బాధిత చిన్నారి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడారు.