Share News

ఏపీకేకి ఫార్మాట్‌ మంత్రం..!

ABN , Publish Date - Jun 09 , 2026 | 06:00 AM

గుర్తుతెలియని నంబర్ల నుంచి వాట్సాప్‌ ద్వారా వస్తున్న ఏపీకే ఫైల్స్‌ సాధారణ ప్రజలను గుల్లచేస్తున్నాయి. సైబర్‌ పోలీసు స్టేషన్‌కు వస్తున్న బాధితుల్లో ఏపీకే ఫైల్స్‌ వల్ల మోసపోయినవారే సగం మంది ఉంటున్నారు

ఏపీకేకి ఫార్మాట్‌ మంత్రం..!

  • మొబైల్‌ వినియోగదారులకు నకిలీ ఫైల్స్‌ దడ

  • ఏపీకే ఫైల్స్‌ పంపి దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు

  • అంతా ఊడ్చేశాక లబోదిబోమంటున్న బాధితులు

  • పొరపాటున ఏపీకే ఫైల్స్‌, లింకులు క్లిక్‌ చేసినా పర్లేదు

  • వెంటనే ఇంటర్నెట్‌ ఆఫ్‌ చేసి.. ఫోన్‌ ఫార్మాట్‌ చేస్తే సరి

  • హానికర మాల్వేర్‌, యాప్‌లు, డేటా మొత్తం డిలీట్‌

  • సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ యాక్సెస్‌ చేయకుండా కట్టడి

  • కేటుగాళ్లకు చిక్కకుండా ఉండేందుకు నిపుణుల సూచన

కొద్దిరోజుల క్రితం ఇంటెలిజెన్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సెల్‌ఫోన్‌ నుంచి ఆయన వాట్సాప్‌ కాంటాక్ట్‌ జాబితాలో ఉన్న వారికి ఏపీకే (ఆండ్రాయిడ్‌ ప్యాకేజ్‌ కిట్‌) ఫైల్‌ వెళ్లింది. దానిపై ట్రాఫిక్‌ చలాన్‌ అని రాసి ఉంది. ఇది చూసిన వారు ట్రాఫిక్‌ చలాన్‌ ఏపీకే ఫైల్‌లో వచ్చిందేమిటని ఆయనను ప్రశ్నించారు. ఆయన తన వాట్సాప్‌ హ్యాక్‌ అయిందని... దాన్ని వెంటనే డిలీట్‌ చేయాలని సూచించారు.

ఓ సీనియర్‌ సిటిజన్‌కు ప్రైవేటు బ్యాంక్‌లో ఖాతా ఉంది. ఆ బ్యాంక్‌ యాప్‌ను ఆయన తన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కానీ, దాని ద్వారా లావాదేవీలు నిర్వహించడానికి రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదు. ఆయనకు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయం కూడా లేదు. కొద్దిరోజుల క్రితం ఆయనకు గుర్తుతెలియని నంబరు నుంచి వాట్సాప్‌ ద్వారా ఏపీకే ఫైల్‌ వచ్చింది. డౌన్‌లోడ్‌ చేసి దాన్ని ఓపెన్‌ చేయగానే.. సైబర్‌ నేరగాళ్లు ఆయన ఫోన్‌ను ఆధీనంలోకి తీసుకున్నారు. బ్యాంక్‌ యాప్‌ ద్వారా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సదుపాయాన్ని యాక్టివేట్‌ చేసుకుని ఆ ఖాతా నుంచి దశలవారీగా రూ.30 లక్షలు కొట్టేశారు.

పొరపాటున చేసినా.. పర్లేదు..

గుర్తుతెలియని నంబర్ల నుంచి వాట్సాప్‌ ద్వారా వస్తున్న ఏపీకే ఫైల్స్‌ సాధారణ ప్రజలను గుల్లచేస్తున్నాయి. సైబర్‌ పోలీసు స్టేషన్‌కు వస్తున్న బాధితుల్లో ఏపీకే ఫైల్స్‌ వల్ల మోసపోయినవారే సగం మంది ఉంటున్నారు. వాటిని క్లిక్‌ చేసి లక్షల్లో నష్టపోయిన వారు లబోదిబోమంటున్నారు. వాట్సాప్‌లో వచ్చిన ఏపీకే ఫైల్స్‌, లింకులను చూసి భయపడిపోతున్నారు.


అయితే.. వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా వచ్చిన లింక్‌లను క్లిక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసినా సైబర్‌ నేరగాళ్ల ఎత్తుల నుంచి తప్పించుకునే మార్గం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్టు గుర్తిస్తే... వెంటనే ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఆగిపోయేలా ఫోన్‌లో నుంచి సిమ్‌ కార్డును తొలగించి.. ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ (ఫార్మాట్‌) చేస్తే.. ఏపీకే ఫైల్స్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు చేసే హ్యాకింగ్‌ నుంచి సంపూర్ణ రక్షణ లభిస్తుందని సూచిస్తున్నారు. ఫోన్‌ను ఫార్మాట్‌ చేయడం వల్ల ఆ ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ అయిన హానికరమైన మాల్వేర్‌, యాప్‌లు, డేటా.. శాశ్వతంగా డిలీట్‌ అవుతాయని సైబర్‌ క్రైం పోలీసులు స్పష్టం చేస్తున్నారు.


‘ఈ’ నేరాల్లో ఏపీకేదే అగ్రభాగం

ప్రస్తుతం జరుగుతున్న సైబర్‌ నేరాల్లో ఏపీకే ఫైళ్ల ద్వారా జరుగుతున్న మోసాలు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. నేరగాళ్లు ముందుగా ఒక వాట్సాప్‌ గ్రూపును సృష్టిస్తున్నారు. ఒక గ్రూపులో గరిష్ఠంగా 1024 మంది సభ్యులను చేర్చుకునే అవకాశం ఉంది కాబట్టి.. నేరగాళ్లు ఈ పరిమితిని వాడుకుని పెద్దఎత్తున గ్రూపులు క్రియేట్‌ చేస్తారు. ఈ గ్రూపులో చాలామంది సైబర్‌ నేరగాళ్లే ఉంటారు. స్టాక్‌ మార్కెట్‌ టిప్స్‌, పార్ట్‌-టైమ్‌ జాబ్స్‌, క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు, అధిక లాభాలు ఆశచూపేలా పోస్టులు పెడతారు. అదే గ్రూపులో సభ్యులుగా ఉండే మరికొందరు సైబర్‌ నేరగాళ్లు.. ‘ఇది నిజమే మాకు కూడా డబ్బులు వచ్చాయి’ అంటూ స్ర్కీన్‌ షాట్లు పెట్టి నమ్మిస్తారు. ఆ తర్వాత గ్రూపులో కొన్ని లింకులు పోస్టు చేసి.. వాటిపై క్లిక్‌ చేసి మీరు కూడా సులువుగా లాభాలు పొందవచ్చని ఆశపెడతారు. పొరపాటున ఎవరైనా ఆ లింకులపై క్లిక్‌ చేసి.. వివరాలు నమోదు చేస్తే వారి ఫోన్‌ను అధీనంలోకి తీసుకుని ఖాతాల్లోని సొమ్ము కొల్లగొట్టేస్తారు.


ఇలా చేస్తే సైబర్‌ నేరగాళ్ల ఆటకట్టు..!

ప్రస్తుతం తెలియని నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్‌, వాట్సా్‌పలో సందేశాలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఏపీకే ఫైళ్లు చేరుతున్నాయి. తెలియక కొందరు, హడావుడిలో మరికొందరు వాటిని తెరచి చిక్కుల్లో పడుతున్నారు. అయితే పొరపాటున గానీ, తెలిసో తెలియక గానీ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసిన వారు.. తమ తప్పును గుర్తించిన వెంటనే కొన్ని టిప్స్‌ పాటించడం ద్వార్‌ సైబర్‌ నేరగాళ్ల వలకు చిక్కకుండా ఉండొచ్చని సైబర్‌ పోలీసులు చెబుతున్నారు.

  • ఏపీకే ఫైల్స్‌ను డౌన్‌లోడ్‌ చేశామని గుర్తించిన వెంటనే ఆఫ్‌లైన్‌ మోడ్‌లోకి వెళ్లిపోవాలి. అంటే ఫోన్‌ నుంచి సిమ్‌ కార్డు తొలగించడం కానీ, లేదంటే మొబైల్‌ డేటా, వై ఫై కనెక్షన్‌ను ఆఫ్‌ చేయడం గానీ చేయాలి. లేదంటే ఫోన్‌ను ఏరోప్లేన్‌ మోడ్‌లో పెట్టుకోవాలి. ఫోన్‌కు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఆగిపోతే సైబర్‌ నేరగాళ్లకు యాక్సెస్‌ చేయడం కష్టమవుతుంది.

  • ఫోన్‌ను వెంటనే ఫార్మాట్‌ చేయాలి. దీనివల్ల ఫోన్‌లో డౌన్‌లోడ్‌ అయిన హానికరమైన మాల్వేర్‌, యాప్‌లు డిలీట్‌ అయిపోతాయి. మన ఫోన్‌లో ఆ ఫైల్స్‌, యాప్‌లు ఉండవు కాబట్టి సైబర్‌ నేరగాళ్లు మన ఫోన్‌లోని సున్నితమైన సమాచారాన్ని టచ్‌ కూడా చేయలేరని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు.


ప్రత్యేక టెక్నికల్‌ టీం

ఏపీకే ఫైళ్లను తయారు చేయడానికి సైబర్‌ నేరగాళ్ల టీంలో కొంతమంది టెకీలు ఉంటారు. వాళ్లే ప్రోగ్రామ్‌ రాస్తారు. వాటిని మొబైల్‌ యూజర్లకు పంపడానికి ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. వివిధ మార్గాల ద్వారా సేకరించిన ఫోన్‌ నంబర్లకు వాట్సా్‌పల ద్వారా ఈ ఫైళ్లను పంపుతారు. మొబైల్‌ యూజర్లకు అనుమానం రాకుండా ఆసక్తి, ఆశ కలిగించే పేర్లను వాటికి పెడతారు. అధిక లాభాలు వచ్చే పెట్టుబడులంటూ ఆఫర్‌ ఇస్తారు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని ఓపెన్‌ చేసిన తర్వాత ఉన్నది మొత్తం ఊడ్చేస్తారు. మరికొంతమంది అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెడతారు. లాభాలు శూన్యమని గ్రహించాక సైబర్‌ పోలీసులను ఆశ్రయిస్తుంటారు. గతంలో ఏపీకే ఫైల్‌, లింక్‌లు పంపితే అది ఆ సెల్‌ఫోన్‌ వినియోగదారుడికి మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు వచ్చిన ఏపీకే ఫైల్‌ను తెరిస్తే చాలు అది అతని కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్న అన్ని నంబర్లకూ వెళ్తుంది. దీన్ని బ్యాక్‌ ఎండ్‌ ప్రోగ్రామ్‌గా సైబర్‌ పోలీసులు విశ్లేషిస్తున్నారు.

Updated Date - Jun 09 , 2026 | 06:01 AM