ప్రియుడితో కలిసి భర్తను చంపేసి..
ABN , Publish Date - May 08 , 2026 | 04:14 AM
ఒక యువకుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ.. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. దీంతో తన భర్తను అంతం చేయాలని ప్రియుడిని కోరగా..
రూ.12 లక్షలతో అడ్డుతొలగించుకున్న భార్య
మెడకు చార్జింగ్ వైరు బిగించి చంపేసిన కిరాయి హంతకులు
భార్య సహా ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
ఏలూరు క్రైం, మే 7(ఆంధ్రజ్యోతి): ఒక యువకుడితో వివాహేతర సంబంధం సాగిస్తున్న మహిళ.. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. దీంతో తన భర్తను అంతం చేయాలని ప్రియుడిని కోరగా.. అతను రూ.12 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఈ కేసుకు సంబంధించి ఏలూరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కేపీఎస్ కిశోర్ గురువారం విలేకరులకు తెలిపిన వివరాలివి.. ఆగిరిపల్లి మండలం వడ్లమానుకు చెందిన రెడ్డి సులోమాన్‌రాజు (41) భార్య దుర్గామణికి ఆ గ్రామ సచివాలయంలో పనిచేసే కృష్ణా జిల్లా గన్నవరం మండలం గొల్లనపల్లికి చెందిన పలగాని వెంకన్నబాబుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను తరచుగా వేధిస్తున్నాడు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన దుర్గామణి.. వెంకన్నబాబుకు చెప్పింది. అతడు బాపులపాడు మండలం బండారుగూడెంకు చెందిన కలతోటి మణికంఠ, కలతోటి సాయిశ్రీనివా్‌సతో మాట్లాడి, సులోమాన్‌రాజు హత్యకు రూ.12 లక్షలు సుపారీ ఇచ్చాడు. సాయి శ్రీనివాస్, తన స్నేహితుడైన ఇబ్రహీంపట్నం మండలం భీమరాజుగుట్టకు చెందిన మద్దాలి జశ్వంత్‌రాయ్ కలిసి.. గత నెల 17వ తేదీ రాత్రి సులేమాన్‌రాజును కారులో ఎక్కించుకుని కొండపావులూరు సమీపంలోని జగనన్న ఇళ్ల సముదాయం వద్ద ఎన్డీఆర్‌ఎఫ్ గేటు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ సులేమాన్ మెడకు చార్జింగ్ వైరు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే పడేసి, కారులో పరారయ్యారు. ఈ ఘటనపై ఆగిరిపల్లి ఎస్‌ఐ కె.శుభశేఖర్ కేసు నమోదు చేశారు.
కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితులైన కలతోటి సాయిశ్రీనివాస్, మద్దాలి జశ్వంత్‌రాయ్, కలతోటి మణికంఠ, పలగాని వెంకన్నబాబు, రెడ్డి దుర్గామణిలను గన్నవరం వద్ద గురువారం అరెస్టు చేశారు. కారు, 5 సెల్‌ఫోన్లు, 5 బీరు సీసాలు, సెల్‌ఫోన్ పవర్‌బ్యాంక్ చార్జింగ్ కేబుల్ వైరు, రూ.75 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు హాజరుపర్చనున్నట్లు చెప్పారు. సులేమాన్‌రాజును హత్య చేయమని సలహా ఇచ్చిన దుర్గామణి స్నేహితుడి కోసం గాలిస్తున్నారు.