షేర్ మార్కెట్ పేరుతో రూ.85 లక్షలకు బురిడీ
ABN , Publish Date - May 30 , 2026 | 05:19 AM
షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశజూపి దంపతుల నుంచి ఏకంగా రూ.85లక్షలు కాజేసిన ఆన్‌లైన్ మోసం కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది.
పెద్దాపురంలో దంపతులను ముంచేసిన కేటుగాడు
పెద్దాపురం, మే 29 (ఆంధ్రజ్యోతి): షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు ఆశజూపి దంపతుల నుంచి ఏకంగా రూ.85లక్షలు కాజేసిన ఆన్‌లైన్ మోసం కాకినాడ జిల్లా పెద్దాపురంలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం... పెద్దాపురం వర్జుల వారి వీధికి చెందిన సూరే వేణు, మహాలక్ష్మి దంపతులకు ఇటీవల ఒక వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమయ్యాడు. తాను ప్రముఖ దేశీయ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ లిమిటెడ్ మేనేజర్‌నని పరిచయం చేసుకున్నాడు. తమ సంస్థలో మూడు నెలల కాలానికి డిపాజిట్ చేస్తే 300 శాతం లాభాలు వస్తాయంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన దంపతులు నిందితుడు సూచించిన ఖాతాల్లోకి విడతల వారీగా రూ.85 లక్షలు బదిలీ చేశారు. కొంతకాలం తర్వాత పెట్టుబడి సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాంకేతిక సమస్యలంటూ నిలిపివేశారు. ఆ తర్వాత సదరు వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు గురువారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో దర్యాప్తు చేస్తున్నట్టు పెద్దాపురం ఎస్‌ఐ మౌనిక తెలిపారు. ప్రజలు ఇటువంటి నకిలీ వాట్సాప్ సందేశాలను నమ్మి మోసపోవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.