సీఐ చినమల్లయ్య డిస్మిస్
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:04 AM
మహిళపై అత్యాచారం సంఘటనలో పల్నాడు జిల్లా వినుకొండ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చినమల్లయ్యను విధుల నుంచి తొలగించారు.
అత్యాచారం కేసులో చర్యలు.. ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ
సుప్రీం కోర్టులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
నెల రోజులుగా అజ్ఞాతంలోనే
అరెస్టు చేయడంలో పోలీసుల వైఫల్యం
నరసరావుపేట/న్యూఢిల్లీ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): మహిళపై అత్యాచారం సంఘటనలో పల్నాడు జిల్లా వినుకొండ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చినమల్లయ్యను విధుల నుంచి తొలగించారు. బుధవారం గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణలో సీఐ చినమల్లయ్య అరాచకాలు వెలుగులోకి రావడంతో ఆయనను సర్వీస్ నుంచి తొలగిస్తూ ఐజీ చర్యలు తీసుకున్నారు. వినుకొండ పరిధిలోని బ్రాహ్మణపల్లిలో ఫాంహౌస్ ఏర్పాటు చేసుకుని సీఐ రాసలీలలు సాగించారు. తనను అత్యాచారం చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో మల్లయ్యపై వినుకొండ పోలీసు స్టేషన్‌లో ఏప్రిల్ 29న కేసు నమోదైంది. సదరు మహిళ న్యాయస్థానంలో కూడా వాంగ్మూలం ఇచ్చింది. కేసు నమోదైనప్పటి నుంచి మల్లయ్య పరారీలో ఉన్నారు. ఈ కేసు విచారణలో ఉండగానే మరో మహిళతో సీఐ మల్లయ్య రాసలీలల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కారంపూడిలో తుపాకీతో టీడీపీ నేతలను బెదిరించిన ఉదంతంలో ఆయన వీఆర్‌లో ఉన్నారు. అత్యాచారం కేసు నేపథ్యంలో గత నెల 2న మల్లయ్యను సస్పెండ్ చేశారు.
బెయిల్ పిటిషన్ కొట్టివేత
మల్లయ్యకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన ఇప్పటి వరకు దాఖలు చేసిన అన్ని పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టూ పిటిషన్‌ను తిరస్కరించింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పోలీసు అధికారిపై అత్యాచారం కేసు నమోదు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తాడన్న వాదనతో ఏకీభవించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం కోర్టు ధర్మాసనం నిరాకరించింది. బుధవారం జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఈ వ్యవహారానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న మిగిలిన దరఖాస్తులను సైతం పరిష్కరించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నెల రోజులుగా గాలింపు సీఐ చినమల్లయ్యను అరెస్టు చేయడంలో పోలీసు శాఖ ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సహచర పోలీసు అధికారిని అరెస్టు చేయడంలో వెనకడుగు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 4 బృందాలు నెల రోజులుగా గాలిస్తున్నా ఆయన ఆచూకీ దొరకలేదు. అజ్ఞాతంలో ఉన్న సీఐ ఆచూకీ తెలుసుకోవడంలో గాలింపు బృందాలు విఫలమయ్యాయా లేక కావాలనే వదిలేస్తున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టులో ముందస్తు బెయిల్ పొందే అవకాశాన్ని పోలీసు శాఖ కల్పించిందన్న వాదన వినిపిస్తోంది. సుప్రీంకోర్టులో కూడా మల్లయ్య బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఇక పోలీసులు ఆయన్ను అరెస్టు చేయక తప్పేట్టు లేదు. కోర్టులో లొంగిపోయే అవకాశం కూడా ఆయనకు కల్పిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు అధికారులు మాత్రం చినమల్లయ్యను అరెస్టు చేసేందుకు గాలిస్తున్నామని చెబుతున్నారు.