‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ దారుణ హత్య
ABN , Publish Date - Apr 29 , 2026 | 04:27 AM
చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రౌడీషీటర్ తమీమ్ ఆయన్ను కత్తితో నరికి చంపి బైక్‌పై పారిపోయాడు.
ఉదయం వాకింగ్ చేస్తుండగా మాటేసి ఘాతుకం
వెంటాడి కత్తితో నరికి చంపిన రౌడీషీటర్ తమీమ్
అడ్డుకోబోయిన మరో విలేకరిపైనా దాష్టీకం
రక్తంతో తడిసిన కత్తిని ప్రదర్శిస్తూ బైక్‌పై పరార్
చిత్తూరు జిల్లా వి.కోటలో దారుణం
నిందితుడిపై 30 ఎర్రచందనం, 3 మత ఘర్షణల కేసులు.. ఊరి నుంచి బహిష్కరణ
చిత్తూరు, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా వి.కోట మండల ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ జగన్మోహన్‌రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రౌడీషీటర్ తమీమ్ ఆయన్ను కత్తితో నరికి చంపి బైక్‌పై పారిపోయాడు. పోలీసుల కథనం మేరకు... వి.కోట ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ వారణాసి జగన్మోహన్‌రెడ్డి (47), మరో పత్రిక రిపోర్టర్ సుబ్రహ్మణ్యంతో కలసి రోజూ ఉదయం పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ చుట్టూ వీధుల్లో వాకింగ్ చేస్తారు. మంగళవారం ఉదయం వీరిద్దరూ వాకింగ్ చేస్తూ.. దన్నుపురం ప్రాంతంలోకి ప్రవేశించారు. జగన్‌ను హత్య చేయడానికి రెండు రోజులుగా రెక్కీ నిర్వహించిన తమీమ్ (37) అక్కడ తన బావమరిదితో కాపు కాశాడు. వీరు రాగానే ముందుగా జగన్ కాలుపై కత్తితో నరికాడు. అడ్డుకోబోయిన సుబ్రహ్మణ్యంను తోసేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. దాడి నుంచి తప్పించుకునేందుకు జగన్ సుమారు 40 మీటర్ల మేర పరిగెత్తారు. అయితే తమీమ్ వెంటబడి మరీ మెడపైనా, చేతుల మీద ఇష్టానుసారంగా నరికాడు. అక్కడే ఉన్న వృద్ధులు గట్టిగా కేకలు వేస్తున్నా, కత్తి చూపించి బెదిరించాడు. విషయం తెలుసుకుని పరిగెత్తుకెళ్లిన మిత్రుడు ఆరీఫ్ ఒడిలోనే జగన్ ప్రాణాలు కోల్పోయారు. హత్య చేసిన అనంతరం రక్తంతో తడిసిన పొడవాటి కత్తిని చేతిలో పట్టుకుని తమీమ్ బైకుపై పారిపోయాడు. పలమనేరు రోడ్డులోని ఖాజీపేట మీదుగా ప్రయాణిస్తూ.. రక్తసిక్తమైన కత్తిని ప్రదర్శిస్తూ... ‘జగన్‌ను నరికేశాను’ అని కేకలు వేసుకుంటూ వెళ్లాడు. కాగా, జగన్‌కు భార్య అంజలి, కుమార్తె భావన, కుమారు డు నితిన్‌రెడ్డి ఉన్నారు. జగన్ సుమారు 15 ఏళ్లుగా ‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు.
సీరియ్‌సగా తీసుకున్న పోలీసులు
‘ఆంధ్రజ్యోతి’ రిపోర్టర్ హత్యను చిత్తూరు పోలీసులు సీరియ్‌సగా తీసుకున్నారు. ఎస్పీ తుషార్ డూ డీ వి.కోటపోలీసు స్టేషన్‌కు చేరుకొని సీసీ పుటేజీల ను పరిశీలించారు. అనంతరం ఘటనా స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును సీఐ, ఎస్‌ఐల ద్వారా తెలుసుకొన్నారు. హత్యకు గల కారణాలను లోతుగా విచారిస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు. మత విద్వేషాలను రెచ్చగొట్టొద్దని, సమాజంలో అశాంతి కలిగించే ప్రచారాలకు దూరంగా ఉండాలని కోరారు. నిందితుడిని ప ట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. కర్ణాటక, తమిళనాడు పోలీసుల్ని అప్రమత్తం చేశారు.
17 కత్తిపోట్లు
జగన్ మృతదేహానికి పలమనేరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి శరీరంపై మొత్తం 17 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని వి.కోటకు తీసుకొచ్చారు. బుధవారం పట్టణంలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించి అంత్యక్రియలు చేయనున్నారు.
ఇదే కారణమా..?
వైసీపీ హయాంలో వి.కోటకు బైపాస్ రోడ్డు మంజూరైంది. ఈ విషయం ముందే తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆ ప్రాంతంలో పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. ఊరి బయటి నుంచి రోడ్డు వెళితే పట్టణానికి విలువ తగ్గిపోతుందని, ఊళ్లో నుంచే రోడ్డు అభివృద్ధి కావాలని అప్పట్లో స్థానికులతో కలిసి జగన్ ధర్నాలు, నిరసనలు చేశారు. ప్రజాప్రతినిధులకు, అధికారులకు అర్జీలు ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దీంతో ఆ రోడ్డు నిర్మాణంలో కదలిక లేదు. ఈ వ్యవహారంలో ఎవరైనా తమీమ్‌కు సుపారీ ఇచ్చి హత్య చేయించారా.. అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అంతకుముందు జగన్‌కు, తమీమ్‌కు మధ్య నేరుగా ఎలాంటి సంబంధం లేదు.
తమీమ్‌ను ఊరి నుంచి బహిష్కరించి..
2024 సెప్టెంబరులో వి.కోటలో జరిగిన మత ఘర్షణల తర్వాత ముస్లిం మతపెద్దల్ని తిడుతూ తమీమ్ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో పోస్టు చేశాడు. అతనిపై పోలీసులు అప్పట్లో 3 కేసులు నమోదు చేశారు. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అవి కాకుండా తమీమ్‌పై కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో 30 ఎర్రచందనం కేసులున్నాయి. దీంతో వి.కోట పోలీసులు గతేడాది మార్చిలో రౌడీషీట్ తెరిచారు. తమీమ్‌ను మసీదులోకి కూడా అనుమతించని మతపెద్దలు.. అతడిని ఊరి నుంచి బహిష్కరించారు. దీంతో కర్ణాటకలో జీవనం సాగిస్తున్నాడు. ప్రేమించి పెళ్లిచేసుకున్న యువతిని నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత వదిలేశాడు. రెండో పెళ్లి చేసుకోగా.. ఆమెకూ ముగ్గురు పిల్లలున్నారు.
జర్నలిస్టుల నిరసన ప్రదర్శనలు
జగన్ హత్య విషయం తెలియగానే ప్రజాసంఘాలు, జర్నలిస్టులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు వేల సంఖ్యలో వి.కోటలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్దఎత్తున ధర్నాలు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందించారు. కాగా, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీయూడబ్ల్యూజే, ఏపీ ఎలక్ర్టానిక్ మీడియా ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మంగళవారం సాయంత్రం జర్నలిస్టులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ ఆధ్వర్యం లో స్థానిక ప్రెస్‌క్లబ్ వద్ద నిరసన చేశారు. ఏపీయూడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ ఆధ్వర్యంలో బందరు రోడ్డులో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశకు వినతిపత్రం అందజేశారు.
పాత్రికేయుడి హత్య దారుణం: ఐజేయూ
జగన్ హత్యను ఐజేయూ (ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బల్వీందర్ సింగ్ జమ్ము, డి.సోమసుందర్ ఖండించారు. ఈ హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని, నిందితులను, సూత్రధారులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పాత్రికేయులపై భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.