తేనె పూసిన కత్తులు!
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:13 AM
ఆమె ఒక లేడీ డాన్..! పేరు చిన్ని.. అలియాస్ రంగమ్మ..! మహిళలు, యువతులను ఎరగా వేసి హనీట్రాప్ చేయడంలో దిట్ట..! ఈ దందాకు మాస్టర్‌మైండ్ ఆమే..
హనీట్రాప్ మాస్టర్ మైండ్ లేడీ డాన్ చిన్ని మహిళలు, యువతులను ప్రయోగించి ట్రాప్
వలలో చిక్కినవారి నగ్న ఫొటోలు, వీడియోలు చిత్రీకరణ
అనంతలో వందమందికి పైగా బాధితులు
అధికారులు, సిబ్బంది పాత్రపైనా ఆధారాలు
అనంతపురం క్రైం, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఆమె ఒక లేడీ డాన్..! పేరు చిన్ని.. అలియాస్ రంగమ్మ..! మహిళలు, యువతులను ఎరగా వేసి హనీట్రాప్ చేయడంలో దిట్ట..! ఈ దందాకు మాస్టర్‌మైండ్ ఆమే..! డబ్బున్న వాళ్లు, వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలు చేసే ప్రముఖులకు యువతులను ఎరగా వేసి తియ్యటి మాటలతో ముగ్గులోకి దించుతుంది. వారిని ఇళ్లకు పిలిపించి.. యువతులతో ఏకాంతంగా ఉన్న సమయంలో నగ్న ఫొటోలు, వీడియోలు తీయిస్తుంది. ఆపై వారిని బ్లాక్ మెయిల్ చేసి లక్షలు గుంజేస్తుంది. కొందరు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులతో ఉన్న పరిచయాలతో ఆమె కొన్నేళ్ల నుంచి ఈ దందాను యథేచ్ఛగా నడిపిస్తోందని తేలింది. అనంతపురం సిటీ, అనంతపురం రూరల్ ఏరియాలు, రుద్రంపేట, గార్లదిన్నె, కూడేరు మండలాల పరిధిలో ఆమె బాధితులు ఉన్నారు. దీంతో ఆమె వ్యవహారాలను పూర్తిస్థాయిలో గుర్తించేందుకు అనంతపురం జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా ఎస్పీ జగదీశ్ నేరుగా రంగంలోకి దిగి కేసును పర్యవేక్షిస్తుండడంతో హనీట్రాప్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో హనీట్రాప్ గ్యాంగ్‌లో కిలాడి లేడీలు చాలామందే ఉన్నారని గుర్తించారు. రంగమ్మ ద్వారా ఈ దందాలోకి వచ్చిన కొందరు యువతులు, మహిళలు సొంతంగా హనీట్రాప్ చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వారు రెండు గ్రూప్‌లుగా విడిపోయారు. అయితే వ్యవహారం చెడి.. పంపకాల్లో తేడాలు రావడం, ఆధిపత్య పోరుగా మారడంతో పోలీస్ స్టేషన్లలో పంచాయితీలు పెట్టారని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది.
ఎందరో బాధితులు
రంగమ్మతోపాటు మరికొందరు కిలేడీల హనీట్రా్‌పలో చాలామంది చిక్కుకుని విలవిలలాడినట్టు సమాచారం. ఈ నెల 18న గార్లదిన్నెకు చెందిన ఓ బాధితుడు తన నుంచి రూ.4.50 లక్షలు గుంజేశారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చిన్ని అలియాస్ రంగమ్మ, ఆమె మనుషులు తనపై దాడి చేశారని పేర్కొన్నారు. తాజాగా మరో గ్యాంగ్‌లోని జయ (35) అనే మహిళపై కూడా పాపంపేటకు చెందిన 70 ఏళ్ల వ్యక్తి అనంతపురం 4వ పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెటర్నరీ శాఖలో పనిచేసి రిటైరైన తనను జయ అనే మహిళ.. గేదెకు బాగాలేదని ఇంటికి పిలిపించిందని, ఇంటికి వెళ్లాక నగ్నంగా మార్చి ఫొటోలు, వీడియోలు తీసుకుందని చెప్పారు. ఆ తర్వాత రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారని, తాను భయపడిపోయి రూ.3 లక్షలు ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నారు. హనీట్రాప్ ముఠా అనంతపురం నగరానికి చెందిన మరో బాధితుడి నుంచి రూ.28 లక్షలు లాక్కున్నట్టు తెలుస్తోంది. కూడేరు, అనంతపురం నగరం, రూరల్ ఏరియాలో కూడా చాలా మంది బాధితులు డబ్బులు సమర్పించారు.
పోలీసుల సహకారంతోనే...
హనీట్రాప్ వ్యవహారంలో గార్లదిన్నె, అనంతపురం రూరల్, అనంతపురం 3వ, 4వ పట్టణ, రాప్తాడు పోలీస్‌స్టేషన్ల పరిధిలో బాధితులు ఉన్నారు. లేడీ డాన్ చిన్ని, మరో వర్గంలోని కిలేడీలకు మూడు స్టేషన్ల పరిధిలోని కొందరు పోలీసు సిబ్బంది, పోలీసు అధికారులతో కూడా పరిచయాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు పోలీసు సిబ్బందితోపాటు బీట్ కానిస్టేబుళ్లతో కూడా వారికి పరిచయాలున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. కిలేడీ డాన్ వద్ద రాత్రికి బీట్ కానిస్టేబుళ్లు ఎవరు వస్తారో చెప్పే ఆడియోలు, పోలీసులతో మాట్లాడిన కాల్ రికార్డులు బయటపడ్డాయి. దీంతో హనీట్రాప్ వ్యవహారం పోలీసుల సహకారంతోనే జరిగినట్లు స్పష్టమౌతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే అనంతపురం రూరల్, 4వ పట్టణ పోలీస్‌స్టేషన్ల పరిధిలో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. కొందరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొందరు కిలేడీలకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వారు హనీట్రాప్ బాగోతాలను ఒక్కటొక్కటిగా బయటకు కక్కినట్లు సమాచారం. చిన్ని అలియాస్ రంగమ్మను రిమాండ్‌కు పంపినట్లు తెలిసింది. కానీ ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.
ఇద్దరు సీఐలపై వేటు
హనీట్రాప్ వ్యవహారం అనంతపురం జిల్లా పోలీసు శాఖను కుదిపేస్తోంది. దీంతో ఈ అంశాన్ని ఎస్పీ జగదీశ్ సీరియ్‌సగా తీసుకున్నారు. లోతైన విచారణ అనంతరం రాప్తాడు సీఐ హర్ష, అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను కర్నూలు రేంజ్ వీఆర్‌కు పంపించారు. హనీట్రాప్ కేసు నిందితులతో పరిచయాలు ఉన్నందుకు హర్షపై చర్యలు తీసుకున్నారు. ఆయనపై వచ్చిన అభియోగాలు నిజమేనని జిల్లా పోలీస్‌శాఖ నిర్ధారణకు వచ్చింది. బాధితులు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో అనంతపురం ట్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌పై వేటు పడింది. బాధితులు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ఆయన సరిగా స్పందించలేదు. దీంతో ఇద్దరు సీఐలను డీఐజీ వద్ద రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరినీ బుధవారం రిలీవ్ చేశారు. పోలీసుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో మరికొందరిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.