కన్నపేగుపై అంత కర్కశమా?
ABN , Publish Date - May 19 , 2026 | 05:40 AM
దేవుని ప్రతిరూపాలుగా భావించే ముక్కుపచ్చలారని చిన్నారులకు చిన్న ఇబ్బంది కలిగితేనే ఏ సంబంధం లేనివారికి కూడా బాధ కలుగుతుంది.
ప్రియుడి మోజులో పడి.. కన్నతల్లి ఘాతుకం
ఆరేళ్ల కూతురును నీటి ట్యాంకులో పడేసి.. మూతపెట్టి నీటితో నింపి హత్య
కూతురు కనిపించడంలేదని నాటకం
పోలీసుల విచారణలో వెలుగులోకి దారుణం
అల్వాల్‌లో ఘటన..
అల్వాల్/హైదరాబాద్ సిటీ, మే 18 (ఆంధ్రజ్యోతి): దేవుని ప్రతిరూపాలుగా భావించే ముక్కుపచ్చలారని చిన్నారులకు చిన్న ఇబ్బంది కలిగితేనే ఏ సంబంధం లేనివారికి కూడా బాధ కలుగుతుంది. కనిపెంచిన పిల్లలకు కష్టమొస్తే తల్లిదండ్రులకు కలిగే బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కానీ, ఓ కన్నతల్లి ఆ పదానికే తలవంపులు తెచ్చింది. ప్రియుడి మోజులో పడి.. ఆరేళ్ల కన్న కూతురును నీటి ట్యాంకులో పడేసి హత్య చేసింది. పాప ఆర్తనాదాలు ఎవరికీ వినిపించకుండా ట్యాంకు మూతపెట్టి, దానిని నీటితో నింపింది. ప్రాణాల కోసం ఆ పాప నీళ్లలో గిలగిలా కొట్టుకుంటున్నా కనికరించలేదు. ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆమె.. ఏమీ తెలియనట్లు తన కూతురు కనిపించటం లేదని కుటుంబ సభ్యుల వద్ద నాటకమాడింది. చివరకు పోలీసుల రంగం ప్రవేశంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అల్వాల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగు చూసింది. ఎస్‌ఐ ఎస్ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ అల్వాల్ అంబేద్కర్‌నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కూతురు రేఖ (27)ను 2020లో రాజు అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అయితే, రేఖ అప్పటికే 7 నెలల గర్భవతి. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె పాపకు జన్మనిచ్చింది. రేఖ గర్భవతి అనే విషయం దాచిపెట్టి వివాహం చేయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దాంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. యాదగిరి కుటుంబం ఓల్డ్ అల్వాల్ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోకి మారటంతో వారితోపాటే ఉంటున్న రేఖకు అక్కడ కిరణా షాపులో పనిచేసే సాయి (21) అనే వ్యకితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబందానికి దారితీసింది.
ప్రియుడితో పెళ్లి కోసం కూతురి..
తనను వివాహం చేసుకోవాలని సాయిపై రేఖ ఒత్తిడి పెంచగా, సాయి కుటుంబ సభ్యులు అందుకు నిరాకరించారు. ఇప్పటికే వివాహమై కూతరు కూడా ఉన్నందున వివాహం చేసుకోలేనని ఆమెకు సాయి తెగేసి చెప్పాడు. రేఖ ఫోన్ నంబర్‌ను కూడా బ్లాక్‌లో పెట్టారు. అయితే, ఎలాగైనా అతడిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె.. అందుకు తన కూతురు తన్విక (6) మాత్రమే అడ్డుగా ఉందని భావించింది. దీంతో కూతురును చంపాలని నిర్ణయించుకుంది. ఈ నెల 16న ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో తన్వికను ఇంటిపైకితీసుకెళ్లి, నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టింది. ట్యాంకును నీటితో పూర్తిగా నింపింది. పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తన్విక కనిపించటం లేదని కుటుంబసభ్యులకు తెలిపింది. అనుమానం వచ్చిన ఆమె సోదరి శ్వేత.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీ ఫుటేజీని పరిశీలించగా రేఖ టెర్ర్‌సపైకి తన్వికను తీసుకెళ్లటం, ఆమె తిరిగి కిందికి వచ్చేటప్పుడు కూతురు లేకపోవడాన్ని గుర్తించారు. అనుమానం వచ్చి ఆమెను గట్టిగా ప్రశ్నించటంతో తానే తన్వికను నీటి ట్యాంకులో పడేసి హత్య చేసినట్లు ఒప్పుకుంది. ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికే ఈ పని చేసినట్లు తెలిపింది. దీంతో పోలీసులు రేఖపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆమె ప్రియుడిపైనా కేసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.