సస్పెండ్ అయిన ఎక్సైజ్ సీఐపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:45 AM
మూడు నెలల కిందటే ఏసీబీ కేసు నమోదై ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాముపై గురువారం ...
రూ.88 లక్షల అక్రమాస్తుల గుర్తింపు
హైదరాబాద్ /కరీంనగర్ క్రైం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): మూడు నెలల కిందటే ఏసీబీ కేసు నమోదై ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ గుండేటి రాముపై గురువారం కరీంనగర్ ఏసీబీ అధికారులు అదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. గతంలో వేముల వాడ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా చేసిన గుండేటి రాము అక్రమ బెల్లం వ్యాపారుల నుంచి నెల వారీ మాముళ్లను తన స్నేహితుడైన వేణు యూపీఐ ఖాతాకు, అనంతరం తన తండ్రి శంకర్ ఖాతాలకు బదిలీ చేయించేవాడని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్పట్లో రాము అద్దెకు ఉంటున్న ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టి రూ.20లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా గుండేటి రాముకు చెందిన జగిత్యాల జిల్లా భవానీనగర్‌లోని అద్దె ఇంటిలో జరిపిన సోదాల్లో రాము ఖాతాల్లో రూ.29.88లక్షలు అతని తండ్రి ఖాతాల్లో రూ.16.77లక్షల బ్యాలెన్స్ ఉన్నట్లు గుర్తించి ఆయా ఖాతాలను ఫ్రీజ్ చేయించారు. వీటితో పాటు రూ.11.97లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్‌లో ఒక ఇంటి స్ధలం, సిరిసిల్లలో ఒక కమర్షియల్ ఇంటి స్థలాన్ని ఏసీబీ గుర్తించింది. ప్రాథమిక అంచనాల ప్రకారం రాము అక్రమార్జన విలువ రూ. 87.44 లక్షలుగా అధికారులు తేల్చారు. స్థిరాస్థుల బహిరంగ మార్కెట్ విలువ చాలా రెట్లు అధికంగా ఉంటుందని, ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ విజయ్‌కుమార్ తెలిపారు.