కొండపైకి తీసుకెళ్లి.. బండరాళ్లతో బాది!
ABN , Publish Date - Mar 27 , 2026 | 05:13 AM
నమ్మిన బంధమే యమపాశమై ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఏడేళ్ల చిన్నారి చిరునవ్వును శాశ్వతంగా చిదిమేసింది. తన జల్సాలకు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఇంటి అల్లుడే ...
కిడ్నాప్ అయిన బాలుడి దారుణ హత్య.. ఏడేళ్ల పసివాడిని కొండ ప్రాంతంలో చంపేసిన సొంత బావ
జల్సాలకు అత్తమామలు డబ్బులు ఇవ్వలేదని దారుణం
అనంతపురం జిల్లా కోనుప్పలపాడులో విషాదం
యాడికి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): నమ్మిన బంధమే యమపాశమై ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసింది. ఏడేళ్ల చిన్నారి చిరునవ్వును శాశ్వతంగా చిదిమేసింది. తన జల్సాలకు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో ఇంటి అల్లుడే ఏడేళ్ల బావమరిదిని కిడ్నాప్ చేసి.. అతి కిరాతకంగా హత్య చేసిన ఈ అమానుష ఘటన అనంతపురం జిల్లా యాడికిలో చోటుచేసుకుంది. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామంలో బుధవారం కిడ్నాపైన హేమచంద్ర(7) హత్యకు గురయ్యాడు. ఇదే మండలంలోని చింతలాయపల్లి-కుందనకోట ఘాట్‌రోడ్డు సమీప కొండపై అతని మృతదేహం గురువారం లభ్యమైంది. బాలుడిని అతని సొంత బావ సర్వేశ్ కిడ్నాప్ చేసి చంపేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
బైక్‌పై ఎక్కించుకుని..
కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. కోనుప్పలపాడుకు చెందిన బోయ గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు హేమచంద్ర ఉన్నారు. పెద్ద కూతురు లలితను నిట్టూరు గ్రామానికి చెందిన సర్వేశ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడి, డబ్బుల కోసం అత్తమామలను, భార్యను నిత్యం వేధించేవాడు. ఈ నేపథ్యంలో యూకేజీ చదువుతున్న లలిత తమ్ముడు హేమచంద్ర యాడికిలోని ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రాగానే సర్వేశ్, బాలుడిని బైక్‌పై తీసుకెళ్లాడు. సర్వేశ్ ముఖానికి జేబు రుమాలు కట్టుకోవడంతో గుర్తుతెలియని వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేశాడని అందరూ భావించి యాడికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో హేమచంద్ర కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి సర్వేశ్ కూడా ఏమీ ఎరగనట్టు పోలీస్‌స్టేషన్‌కు రావడం గమనార్హం. బాలుడి ఆచూకీ లభించకపోవడంతో సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులకు సర్వేశ్‌పై అనుమానం కలిగింది. దీంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించడంతో హేమచంద్రను తానే చంపేశానని అంగీకరించాడు. అతనిచ్చిన సమాచారంతో చింతలాయపల్లి-కుందనకోట ఘాట్‌రోడ్డు సమీప కొండపై బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. హేమచంద్రను రాళ్లతో కొట్టి చంపిన సర్వేశ్, మృతదేహం కనిపించకుండా పెద్దపెద్ద బండరాళ్లతో కప్పేశాడు. బాలుడి తండ్రి గోవిందు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా, తాడిపత్రి రూరల్ మండలం అయ్యవారిపల్లిలో జరిగిన గొర్రెలకాపరి హత్య కేసులో సర్వేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అతనిపై రౌడీ షీట్ ఉంది.
నా భర్తను చంపేయండి: లలిత
తన తమ్ముడిని చంపిన సర్వేశ్‌ను కూడా అలాగే చంపేయాలని అతడి భార్య లలిత మీడియాతో అన్నారు. డబ్బులివ్వకపోతే ఒక్కొక్కరిని చంపేస్తానని అనేవాడని, అన్నంత పనిచేశాడనీ ఆమె కన్నీరు మున్నీరయ్యారు. తమ కొడుకును చంపినచోటే అతన్ని కూడా చంపేయాలని తల్లిదండ్రులు ఆక్రోశించారు.