Share News

బిహార్‌ నుంచి తమిళనాడుకు..25 మంది బాలల అక్రమ రవాణా

ABN , Publish Date - Jun 25 , 2026 | 04:05 AM

బాలల అక్రమ రవాణాను రైల్వే పోలీసులు సకాలంలో గుర్తించడంతో 25 మంది చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఉదంతంలో బాలలను తరలిస్తున్న ...

బిహార్‌ నుంచి తమిళనాడుకు..25 మంది బాలల అక్రమ రవాణా

  • స్వచ్ఛంద సంస్థ సమాచారంతో పట్టుకున్న రైల్వే పోలీసులు

  • అదుపులో 15 మంది సహాయకులు

ఒంగోలుక్రైం, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): బాలల అక్రమ రవాణాను రైల్వే పోలీసులు సకాలంలో గుర్తించడంతో 25 మంది చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఉదంతంలో బాలలను తరలిస్తున్న 15 మంది సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే సీఐ ఎస్‌కే షరీఫ్‌ కథనం ప్రకారం.. సార్డ్స్‌ సంస్థ అందించిన సమాచారంతో మంగళవారం రాత్రి రెండు వేర్వేరు రైళ్లలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. జోగబాని-ఈరోడ్‌ ఎక్స్‌ప్రెస్‌లో బిహార్‌ నుంచి తమిళనాడుకు 11 మంది బాలలను తరలిస్తుండగా గుర్తించారు. వారిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ఆదేశాల మేరకు గూడూరు-నాయుడుపేట మధ్యలో అమృత్‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు నిర్వహించారు. బిహార్‌ నుంచి తమిళనాడు వెళ్తున్న 14మంది బాలలను రక్షించి, 8మంది సహాయకులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 8-18 ఏళ్ల లోపువారే. మొత్తం 25 మంది బాలలను ఒంగోలులోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుపరిచి పునరావాస చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jun 25 , 2026 | 04:05 AM