Share News

పాతికేళ్ల ప్రేమ.. పెళ్లయిన కొన్ని గంటలకే వరుడి హత్య

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:27 AM

ప్రేమించుకున్న ఆ జంట తమ దారి తాము చూసుకోలేదు. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి పాతికేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కులాలు వేరనే కారణంగా వధువు కుటుంబం తొలినుంచీ ససేమిరా అంటోంది.

పాతికేళ్ల ప్రేమ.. పెళ్లయిన కొన్ని గంటలకే వరుడి హత్య

  • తిరిగి ఇంటికొచ్చిన కొద్దిసేపటికే ఘోరం

  • పెద్దలను ఒప్పించడానికి పాతికేళ్లుగా ప్రయత్నం

  • కులాలు వేరు కావడంతో ఒప్పుకోని వధువు కుటుంబం?

  • తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడిలో ఘటన

  • వధువు రాయవరం డిప్యూటీ తహశీల్దార్‌

మండపేట, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి) : ప్రేమించుకున్న ఆ జంట తమ దారి తాము చూసుకోలేదు. కుటుంబ సభ్యులను ఒప్పించడానికి పాతికేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. కులాలు వేరనే కారణంగా వధువు కుటుంబం తొలినుంచీ ససేమిరా అంటోంది. ఇక.. చివరకు అన్నవరంలో తాళి కట్టి..ఆమెతో తన ఇంటికి చేరుకున్న వరుడు ఆ తర్వాత కొద్ది సేపటికే వధువు సోదరుల చేతిలో హత్యకు గురయ్యాడు. రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో గురువారం రాత్రి ఈ ఘోరం జరిగింది. ద్వారపూడికి చెందిన పోలిపల్లి సూర్యప్రకాశ్‌, జెడ్‌.మేడపాడుకు చెందిన అయినవిల్లి సంధ్య ఆరో తరగతి చదువుతున్నప్పుడే ప్రేమలో పడ్డారు. వారిద్దరు పదో తరగతి వరకు (1995- 2000) ద్వారపూడిలోనే చదివారు. పెళ్లి చేసుకుందామనుకున్నా కుటుంబ బాధ్యతల కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. సంధ్యకు తండ్రి లేడు. తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. ప్రస్తుతం ఆమె రాయవరం డిప్యూటీ తహశీల్దార్‌గా చేస్తుండగా, సూర్యప్రకాశ్‌ ద్వారపూడిలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇద్దరివీ వేర్వేరు కులాలు. దీంతో వారి వివాహాన్ని సంధ్య కుటుంబీకులు తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. వధూవరులిద్దరికీ సుమారు 40 ఏళ్లు వచ్చేశాయి. ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని, ఇరు కుటుంబాలకు సమాచారం ఇవ్వకుండా గురువారం కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుడి సన్నిధిలో వివాహం చేసుకున్నారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో సూర్యప్రకాశ్‌.. సంధ్యతో కలిసి ద్వారపూడిలోని తన ఇంటికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సంధ్య సోదరులు అయినవిల్లి చంద్రపాల్‌, గిరిబాబు దురుసుగా ప్రకాశ్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ హడావుడి చేశారు. సర్ది చెపుదామని ప్రకాశ్‌ బయటకు రాగా తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో ప్రకాశ్‌ ఇంట్లో కూడా ఎవరూ లేరు. ‘మాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటావా.. ఏం చేస్తామో చూడు’ అంటూ ప్రకాశ్‌పై దాడికి దిగారు. కొట్టవద్దని సంధ్య బతిమలాడినా, వినలేదు. ప్రకాశ్‌పై పిడిగుద్దులు కురిపిస్తూ, రాళ్లతో కొట్టారు. దీంతో రక్తపు మడుగులో కొట్టుకుంటూ ఆ తర్వాతి కొద్దిసేపటికే ప్రాణాలొదిలారు. అది చూసి సంధ్య ఒక్కసారిగా నిశ్చేష్ఠురాలైపోయింది. లే... ప్రకాశ్‌ అంటూ భర్తను పట్టుకుని రోదించింది. స్థానికులు గమనించేసరికే ఘోరం జరిగింది. వెంటనే సంధ్య సోదరులను స్తంభాలకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి సూర్యనారాయణ ఫిర్యాదు మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సీఐ దొర్రాజు తెలిపారు. కాగా, సంధ్య సోదరుల్లో ఒకడు ప్రైవేటు ఉద్యోగి కాగా, మరొకడు ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు.

Updated Date - Feb 28 , 2026 | 05:27 AM