Share News

పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి

ABN , Publish Date - Jun 11 , 2026 | 04:45 AM

గంజాయి ముఠా బరితెగించింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లతో దాడిచేసి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది.

పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి

  • గాలిలోకి కాల్పులు, నలుగురి అరెస్టు

  • మరో నలుగురు పరారీ

  • 209 కిలోల గంజాయి స్వాధీనం

చింతపల్లి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): గంజాయి ముఠా బరితెగించింది. వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్లతో దాడిచేసి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేసింది. అప్రమత్తమైన పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి ముఠాలోని నలుగురిని పట్టుకున్నారు. మరో నలుగురు పరారయ్యారు. గంజాయి రవాణా జరుగుతున్నట్టు సమాచారం మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నవరం పోలీసులు బలపం-లోతుగెడ్డ రహదారిలో రామారావుపాలెం జంక్షన్‌ వద్ద బుధవారం వేకువజామున వాహన తనిఖీలు చేపట్టారు. ఉదయం ఐదు గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు, వెనుక ఒక కారు బలపం వైపు నుంచి రావడం కనిపించాయి. వాహనాలను ఆపాలని కోరినా ఢీకొని వెళ్లిపోయేంత వేగంగా దూసుకొచ్చారు. పోలీసులు చాకచక్యంగా వాహనాలను అడ్డగించి తనిఖీ చేస్తుండగా, గంజాయి రవాణా ముఠా సభ్యులు రాళ్లతో దాడి చేశారు. లొంగిపోవాలని హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. నలుగురు నిందితులు పోలీసులకు సరెండర్‌ కాగా, మరో నలుగురు పారిపోయారు. నిందితుల నుంచి 209.04 కిలోల గంజాయి, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్‌ తీసుకువెళుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

Updated Date - Jun 11 , 2026 | 04:46 AM