Share News

19 ఏళ్లుగా పగ... ప్రతీకారంతోనే మధు హత్య

ABN , Publish Date - May 26 , 2026 | 05:05 AM

సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు చింతలపాటి మధు హత్యకు దారితీసింది ప్రతీకారమేనని పోలీసులు తెలిపారు..

19 ఏళ్లుగా పగ... ప్రతీకారంతోనే మధు హత్య

  • ఐదుగురు నిందితుల అరెస్టు

సూర్యాపేట క్రైం, మే 25 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు చింతలపాటి మధు హత్యకు దారితీసింది ప్రతీకారమేనని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నర్సింహా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. 2007లో జరిగిన మాజీ సర్పంచ్‌ మిద్దె రవీందర్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మధును ఏనాటికైనా అంతమొందించాలని రవీందర్‌ కుమారుడు మిద్దె జీవన్‌ పగ పెంచుకున్నాడు. ఇందుకోసం రామన్నగూడెం గ్రామానికి చెందిన లారీడ్రైవర్‌ చింత సైదులు, అర్వపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన జిమ్‌ ట్రైనర్‌ మేదరి ప్రసాద్‌, ఎర్కారం గ్రామానికి చెందిన, మిద్దె ఆనంద్‌ల సహాయం తీసుకున్నాడు. నిందితులు స్నేహం ముసుగులో మధుతో పరిచయం పెంచుకుని మద్యం మత్తులో ఉండగా దారుణానికి ఒడిగట్టారు. సోమవారం ఉదయం సూర్యాపేట మండలం టేకుమట్ల వద్ద కారులో జీవన్‌(ఏ1), ఆనంద్‌(ఏ4) వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింత సైదులు(ఏ2), మేదరి ప్రసాద్‌(ఏ3), కక్కిరేణి భరత్‌చంద్రలను(ఏ6) సూర్యాపేటలోని రాజీవ్‌పార్క్‌వద్ద అరెస్టు చేశారు.

Updated Date - May 26 , 2026 | 05:05 AM