Share News

1,125 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:44 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 1,125 కిలోల గంజాయిని విశాఖ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) పోలీసులు ఆదివారం తెల్లవారుజామున..

1,125 కిలోల గంజాయి స్వాధీనం

  • ముగ్గురి అరెస్టు

ముంచంగిపుట్టు (అల్లూరి సీతారామరాజు జిల్లా), జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో 1,125 కిలోల గంజాయిని విశాఖ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) పోలీసులు ఆదివారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. ఎన్‌సీబీ ఇంటెలిజెన్స్‌ సీఐ కె.కిరణ్‌బాబు తెలిపిన వివరాలు...ఒడిశా నుంచి ఆంధ్రా మీదుగా గంజాయి తరలిస్తున్నట్టు ఎన్‌సీబీ విశాఖ జోనల్‌ యూనిట్‌కు అందిన సమాచారంతో...శనివారం అర్ధరాత్రి నుంచి బూసిపుట్టు-ముంచంగిపుట్టు మార్గంలో సిబ్బంది మాటువేశారు. ఆదివారం తెల్లవారుజామున పెద్దాపుట్టు సమీపంలో ఒడిశా నుంచి వస్తున్న వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా తవుడు బస్తాల మాటున చిన్న ప్యాకెట్ల రూపంలో గంజాయి బయల్పడింది. గంజాయితో పాటు వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని, ముగ్గురిని స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నిందితులు ముంచంగిపుట్టు మండలం వనుగుమ్మ పంచాయతీ పనస గ్రామానికి చెందిన వంతాల గోపాల్‌, కిల్లో అనంతరామ్‌, ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా గోవిందపల్లి గ్రామానికి చెందిన పురుషోత్తం ఖారాలుగా గుర్తించారు. వీరు ఒడిశా రాష్ట్రం చిత్రకొండ బ్లాక్‌ జనతాబై గ్రామం నుంచి ముంచంగిపుట్టు మీదుగా ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లా జైపూర్‌ సమీపంలోని భరణిపుట్టు గ్రామానికి చెందిన బి.కుమార్‌ అనే గంజాయి స్మగ్లర్‌ వద్దకు సరుకు తరలిస్తున్నట్టు విచారణలో తెలిసిందని సీఐ కె.కిరణ్‌బాబు తెలిపారు. గంజాయి రవాణాకు స్థానికంగా కొంతమంది సహారాన్ని అందించినట్టు గుర్తించామని, వారిని త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

Updated Date - Jun 22 , 2026 | 05:45 AM