రజాకార్లతో పోరాడి.. కుమారుల చేతిలో ఓడి
ABN , Publish Date - Mar 09 , 2026 | 04:08 AM
ఆయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. సాయుధ పోరాటంలో నేనున్నానంటూ అడుగువేసిన మహోన్నతుడు.
50 ఎకరాలు రాయించుకుని కన్న తండ్రిని గెంటేసిన కుమారులు
దిక్కులేని వాడిగా అనాథాశ్రమంలో చేరిన శతాధిక వృద్ధుడు
చాదర్‌ఘాట్, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ఆయన ఓ స్వాతంత్య్ర సమరయోధుడు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడు. సాయుధ పోరాటంలో నేనున్నానంటూ అడుగువేసిన మహోన్నతుడు. ఆయనే నల్లగొండ జిల్లాకు చెందిన 110 ఏళ్ల కురువృద్ధుడు ఉంగరాల యాదగిరి. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ ఉద్యమించి, మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తనకిక కష్టాలుండవనుకున్నారు. తన పేరిట ఉన్న 50 ఎకరాల భూమిని నలుగురు కుమారులకు పదేసి ఎకరాల చొప్పున పంచారాయన. మిగతా పది ఎకరాలను ఇద్దరు కూతుర్లకు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం కోసం కుమారులకు రూ.25 లక్షలు ఇచ్చారు. ఇంత చేసిన ఆయన్ను కుమారులు తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఆయన అనాథాశ్రమంలో చేరారు. నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామం కేశిపల్లికి చెందిన ఉంగరాల యాదగిరి(110) అదే గ్రామంలో 50 ఎకరాల భూస్వామి. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. భార్య లక్ష్మమ్మ 2008లో చనిపోవడంతో కుమారులు ఆయన్ను పట్టించుకోలేదు. ఆయన ఒంటిపై ఉన్న బంగారు నగలను కూడా లాగేసుకుని, విచక్షణారహితంగా కొట్టి బయటికి గెంటేశారు. కూతుర్లు, కొంత మంది బంధువుల సహాయంతో యాదగిరి కొంత కాలంగా ఉప్పల్‌లోని ఓ వద్ధాశ్రమంలో ఉంటున్నారు. జీవితం చరమాంకంలో ఉన్న కురవృద్ధుడు తనను పట్టించుకోకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్న నలుగురు కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే వారు కరువయ్యారంటూ రోదిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తన పరిస్థితిని అర్థం చేసుకుని కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తన నుంచి తీసుకున్న 40 ఎకరాల భూమి తాను బతికి ఉన్నంత వరకు తనకే చెందేలా చూడాలని కోరుతున్నారు.