అన్‌లిస్టెడ్ కంపెనీల లాభాల్లో జెరోధా టాప్
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:30 AM
ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ జెరోధా లాభాల్లో దూసుకుపోతోంది. దేశంలోని అన్‌లిస్టెడ్ కంపెనీల్లో అత్యధిక లాభ శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.
ఐదో స్థానంలో బయోలాజికల్-ఇ జూ జేఎం ఫైనాన్షియల్, హురున్ ఇండియా నివేదిక
ముంబై: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ జెరోధా లాభాల్లో దూసుకుపోతోంది. దేశంలోని అన్‌లిస్టెడ్ కంపెనీల్లో అత్యధిక లాభ శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. జేఎం ఫైనాన్సియల్ హురున్ ఇండియా విడుదల చేసిన ‘అన్‌లిస్టెడ్ జెమ్స్, 2026’ జాబితాలో జెరోధా 48శాతం నికర లాభ శాతంతో అగ్రస్థానం సంపాదించింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ ఫిన్‌టెక్ కంపెనీ గత ఆర్థిక సంవత్సరం రూ.4,235 కోట్ల లాభాలు నమోదు చేసింది. జెరోధా తర్వాత పుణె కేంద్రంగా పనిచేసే సైబేజ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ 38 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అదానీ ప్రాపర్టీస్ (34శాతం), అరిస్టో ఫార్మా (32శాతం) లాభాలతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే వ్యాక్సిన్ల తయారీ కంపెనీ బయోలాజికల్-ఇ 30శాతం లాభాలతో ఐదో స్థానం సంపాదించింది. ముంబైకి చెందిన యూఎ్‌సవీ (29శాతం), ఓరియంటల్ స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ (26శాతం), గుజరాత్‌కు చెందిన మధు సిలికా (26శాతం), మెరి ల్ లైఫ్ సైన్సెస్ (25శాతం), చెన్నై కేంద్రంగా పనిచేసే సన్మార్ షిప్పింగ్ (21శాతం) వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి.
ఆదాయంలో రిలయన్స్ రిటైల్ టాప్ :
ఆదాయపరంగా చూస్తే దేశంలోని అన్‌లిస్టెడ్ కంపెనీల్లో రిలయన్స్ రిటైల్ రూ.2.7 లక్షల కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉంది. ఫ్లిప్‌కార్ట్ (రూ.83,000 కోట్లు), మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ (రూ.66,000 కోట్లు) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఏటా కనీసం రూ.1,000 కోట్ల వార్షికాదాయం ప్రాతిపదికగా తీసుకుని జేఎం ఫైనాన్సియల్ హురున్ ఇండియా 100 అన్‌లిస్టెడ్ కంపెనీలతో ఈ జాబితా విడుదల చేసింది. ఈ కంపెనీల వార్షికాదాయం గత ఏడాది రూ.8.9 లక్షల కోట్ల వరకు ఉంది.
జాబితాలోని తెలుగు కంపెనీలివే..
బయోలాజికల్-ఇ
శిరిడి సాయి ఎలక్ట్రికల్స్
మేధా సర్వో డ్రైవ్స్
గ్రీన్‌కో గ్రూప్
కేఎంవీ ప్రాజెక్ట్స్
రాఘవ కన్‌స్ట్రక్షన్స్
నోవోపోర్ అడ్వాన్స్‌డ్ సైన్స్
దేవీ సీ ఫుడ్స్
సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్
సోనోవిజన్ ఎలకా్ట్రనిక్స్