Share News

పొంచి ఉన్న ఉద్యోగాల సంక్షోభం

ABN , Publish Date - Apr 15 , 2026 | 03:36 AM

ప్రపంచం అతిపెద్ద ఉద్యోగాల సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ బంగా హెచ్చరించారు. వచ్చే 10-15 సంవత్సరాల్లో వర్థమాన దేశాల్లో ...

పొంచి ఉన్న ఉద్యోగాల సంక్షోభం

  • 80 కోట్ల మందికి ఉద్యోగాలు ఉండవు

  • ప్రభుత్వాలూ జర జాగ్రత్త

  • ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ బంగా

న్యూయార్క్‌: ప్రపంచం అతిపెద్ద ఉద్యోగాల సంక్షోభాన్ని ఎదుర్కోబోతోందని ప్రపంచ బ్యాంక్‌ ప్రెసిడెంట్‌ అజయ్‌ బంగా హెచ్చరించారు. వచ్చే 10-15 సంవత్సరాల్లో వర్థమాన దేశాల్లో 120 కోట్ల మందికి కొత్తగా ఉద్యోగాలు అవసరమైతే అందు లో 40 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయన్నారు. మిగతా 80 కోట్ల మంది సరైన ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వంటి స్వల్పకాలిక సంక్షోభాలు ముగిసినా ఈ నిరుద్యోగ సంక్షోభం తప్పదని బంగా హెచ్చరించారు.

దీర్ఘకాలిక వ్యూహం అవసరం: ఈ పరిస్థితిని అధిగమించాలంటే ప్రభుత్వాలు వెంటనే ఉద్యోగాల కల్పన, ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం, విద్యుదీకరణ వంటి దీర్ఘకాలిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని బంగా స్పష్టం చేశారు. ఈ నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు వెంటనే చర్యలు చేపట్టకపోతే అక్రమ వలసలు పెరిగిపోయి అస్థిరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అస్థిరతతో గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా 11.7 కోట్ల మంది నిరాశ్రయులైన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రమాదాలను అధిగమించేందుకు వర్థమాన దేశాల్లో సులభతర వాణిజ్య విధానాల ద్వారా పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రపంచ బ్యాంక్‌ ప్రయత్నిస్తున్నట్టు బంగా చెప్పారు.

Updated Date - Apr 15 , 2026 | 03:36 AM