Share News

విప్రో రూ.15,000 కోట్ల బైబ్యాక్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:32 AM

శీయ ఐటీ కంపెనీ విప్రో తన షేర్‌హోల్డర్లకు భారీ బొనాంజా ప్రకటించింది. రూ.15,000 కోట్ల విలువైన సొంత షేర్ల తిరిగి కొనుగోలుకు (బైబ్యాక్‌) బోర్డు ఆమోదం తెలిపిందని గురువారం త్రైమాసిక ...

విప్రో రూ.15,000 కోట్ల బైబ్యాక్‌

  • ఒక్కో షేరుకు రూ.250 చెల్లింపు

  • కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద సొంత షేర్ల తిరిగి కొనుగోలు

క్యూ4 లాభం రూ.3,502 కోట్లు

న్యూఢిల్లీ: దేశీయ ఐటీ కంపెనీ విప్రో తన షేర్‌హోల్డర్లకు భారీ బొనాంజా ప్రకటించింది. రూ.15,000 కోట్ల విలువైన సొంత షేర్ల తిరిగి కొనుగోలుకు (బైబ్యాక్‌) బోర్డు ఆమోదం తెలిపిందని గురువారం త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా విప్రో వెల్లడించింది. కంపెనీ చర్రితలో ఇప్పటివరకిదే అతిపెద్ద బైబ్యాక్‌. ఈ ప్రక్రియలో భాగంగా సంస్థ 5.7 శాతం వాటాకు సమానమైన 60 కోట్ల వరకు షేర్లను కొనుగోలు చేయనుంది. ఒక్కో షేరుకు రూ.250 చొప్పున చెల్లించనుంది. బీఎ్‌సఈలో కంపెనీ షేరు గురువారం ముగింపు ధర రూ.210.20తో పోలిస్తే 19 శాతం అధికమిది. ఈ ప్రక్రియకు కంపెనీ వాటాదారులు ఆమోదం తెలుపాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగియనున్న మొదటి త్రైమాసికంలో బైబ్యాక్‌ పూర్తి కావచ్చని విప్రో చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎ్‌ఫఓ) అపర్ణ అయ్యర్‌ తెలిపారు. బైబ్యాక్‌లో భాగంగా ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ కూడా తమ వాటా నుంచి కొన్ని షేర్లను విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. 2025 డిసెంబరు 31 నాటికి కంపెనీలో ప్రమోటర్లు, ప్రమోటర్‌ గ్రూప్‌ మొత్తం 72.63 శాతం వాటా కలిగి ఉన్నారు.

మూడేళ్ల తర్వాత మళ్లీ : విప్రో షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడం మూడేళ్ల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. చివరిసారి 2023 జూన్‌లో రూ.12,000 కోట్ల విలువైన 26.96 కోట్ల సొంత షేర్లను (4.91 శాతం వాటాకు సమానమైన) తిరిగి కొనుగోలు చేసింది. ఒక్కో షేరుకురూ.445 చొప్పున చెల్లించింది.


గత ఆర్థిక సంవత్సరం (2025-26) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (క్యూ4) విప్రో ఏకీకృత నికర లాభం రూ.3,501.8 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2024- 25)లో ఇదే కాలానికి కంపెనీ ఆర్జించిన రూ.3,569.6 కోట్ల లాభంతో పోలిస్తే 1.89 శాతం తగ్గింది. క్యూ4లో సంస్థ ఆదాయం రూ.24,236.3 కోట్లకు పెరిగింది. 2024-25లో ఇదే కాలానికి నమోదైన రూ.22,504.2 కోట్ల రెవెన్యూతో పోలిస్తే 7.6 శాతం వృద్ధి కనబరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంతో పోలిస్తే, లాభం 12.2 శాతం, ఆదాయం 2.8 శాతం పెరిగింది. మరిన్ని ముఖ్యాంశాలు..

  • క్యూ4లో కంపెనీ ఐటీ సేవల విభాగ ఆదాయం 265.1 కోట్ల డాలర్లుగా నమోదైంది. క్యూ3తో పోలిస్తే 0.6 శాతం, 2024 -25 క్యూ4తో పోలిస్తే 2.1 శాతం వృద్ధి కనబరించింది.

  • గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి విప్రో నికర లాభం కేవలం 0.47 శాతం వృద్ధితో రూ.13,197.4 కోట్లకు చేరగా.. ఆదాయం 3.96 శాతం పెరుగుదలతో రూ.92,624 కోట్లుగా నమోదైంది.

  • గడిచిన ఆర్థిక సంవత్సరంలో విప్రో సిబ్బంది సంఖ్య 8,810 పెరుగుదలతో మొత్తం 2,42,156కు చేరింది. 2025-26లో 7,500 మంది ఫ్రెషర్లను నియమించుకోవడం జరిగిందని, అందులో 3,000 మందిని క్యూ4లో చేర్చుకున్నట్లు విప్రో చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫీసర్‌ (సీహెచ్‌ఆర్‌ఓ) సౌరభ్‌ గోవిల్‌ తెలిపారు. ఐటీ సేవల గిరాకీలో ఒడుదుడుకుల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత మంది ఫ్రెషర్లను నియమించుకునే విషయాన్ని వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

  • కంపెనీలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్‌) మరింత తగ్గింది. క్యూ4లో 13.8 శాతానికి పరిమితమైంది. క్యూ1లో 15.1 శాతం, క్యూ2లో 14.9 శాతం, క్యూ3లో 14.2 శాతంగా నమోదైంది.

  • 2025 జూలైలో వాటాదారులకు ప్రకటించిన రూ.11 మధ్యంతర డివిడెండ్‌నే 2025-26 ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌గా పరిగణనలోకి తీసుకోనున్నట్లు విప్రో తెలిపింది.


భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, విధానపరమైన అవాంతరాలు సాధారణమయ్యాయి.. వాణిజ్య నిబంధనలు మారుతున్నాయి. కఠినతర వీసా నిబంధనలు, యుద్ధాలు పారిశ్రామిక రంగంలో, ఆర్థిక వ్యవస్థల్లో అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. ప్రతికూలతల్లోనూ క్లయింట్లు ఐటీ వ్యయాల్లో స్థితిస్థాపకతను కనబరుస్తున్నారు. భవిష్యత్‌ వృద్ధికి మౌలిక వసతులైన క్లౌడ్‌, డేటా, కృత్రిమ మేధ (ఏఐ) పెట్టుబడుల ను ఆకర్షించగలుగుతున్నాయి. క్లయింట్ల ప్రాధాన్యాలు మారుతున్నాయి. భవిష్యత్‌ ప్రతిఫలాల అంచనా ఆధారంగా ఐటీ వ్యయాలపై నిర్ణయాలు తీసుకుంటున్నారు.

శ్రీనివాస్‌ పల్లియా, విప్రో ఎండీ, సీఈఓ

విప్రో గత బైబ్యాక్‌లు

సంవత్సరం విలువ (రూ.కోట్లలో)

2023 12,000

2020 9,500

2019 10,500

2017 11,000

2016 2,500

ఇవి కూడా చదవండి

వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?

'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..

Updated Date - Apr 17 , 2026 | 03:32 AM