పర్యాటకానికీ యుద్ధ గ్రహణం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:25 AM
భారతదేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా 15-20 శాతం తగ్గింది. ఈ సంక్షోభం ప్రభావంతో విమానయాన పరిశ్రమకు నికరంగా రూ.18,000 కోట్ల...
న్యూఢిల్లీ: భారతదేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా పశ్చిమాసియా సంక్షోభం కారణంగా 15-20 శాతం తగ్గింది. ఈ సంక్షోభం ప్రభావంతో విమానయాన పరిశ్రమకు నికరంగా రూ.18,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని అంచనా. విమానాల నిర్వహణా వ్యయాల్లో 35-40 శాతం వాటా ఇంధన ధరలదే. పశ్చిమాసియా యుద్ధం కారణంగా గగనతలాన్ని విమానాల రాకపోకలకు మూసివేయడంతో పలు ఏవియేషన్ సంస్థలు విమాన సర్వీసులు రద్దు చేశాయి. కొన్ని సంస్థలు తమ విమానాలను మామూలు దారిలో కాకుండా ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా అధిక దూరం ప్రయాణించి ప్రజలను గమ్యాలకు చేర్చుతున్నాయి. ‘‘భారత పర్యాటక, ఏవియేషన్, ఆతిథ్య రంగాలపై యుద్ధం ప్రభావం’’ పేరిట పీహెచ్‌డీసీసీఐ రూపొందించిన నివేదికలో వివరాలు ఇలా ఉన్నాయి.
రెస్టారెంట్లు, ఆహార సర్వీసుల రంగంపై కూడా యుద్ధం ప్రభావం మిశ్రమంగా ఉంది. దీనివల్ల తమపై 10-15 శాతం వ్యయ భారం పడిందని భారత జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్‌ఆర్‌ఏఐ) తెలిపింది.
ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయాల వల్ల రెస్టారెంట్లకు నిర్వహణాపరమైన సంక్షోభం ఏర్పడింది. సుమారు 10 శాతం రెస్టారెంట్లు మూతపడ్డాయి. 60-70 శాతం రెస్టారెంట్లు ఇండక్షన్ కుకింగ్‌కు మారాయి.
రెస్టారెంట్ల రంగం రోజువారీ ఆర్థిక లావాదేవీల పరిమాణం రూ.17,700 కోట్లుంది. ఈ రంగంలో 15-20 శాతం మందగమనం ఏర్పడినా రోజువారీ ఆర్థిక లావాదేవీలు రూ.2,650 కోట్ల మేరకు తగ్గుతాయి. అంటే నెలకి రూ.79,000 కోట్లు.
ఈ రంగం 85 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఆ రంగానికి ఎనలేని మద్దతు అందిస్తోంది. దీర్ఘకాలం పాటు ఈ అస్థిరతలు కొనసాగితే 5-7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇవి కూడా చదవండి
వేగంగా తినే అలవాటు బరువు పెరగడానికి కారణమవుతుందా?
'దోశ, ఇడ్లీ' పాటపై బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు..