వాహన బీమాలో ఇవి ముఖ్యం..
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:04 AM
కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం ఇంటిల్లి పాదికి సంతోషాన్ని కలిగిస్తుంది. వాహనం ఇంటికి రాగానే దాని ధర, అందులో ఉన్న సదుపాయాలు తదితరాల గురించి తెలుసుకోవడం పట్ల అంతా ఆసక్తి చూపుతుంటారు....
కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం ఇంటిల్లి పాదికి సంతోషాన్ని కలిగిస్తుంది. వాహనం ఇంటికి రాగానే దాని ధర, అందులో ఉన్న సదుపాయాలు తదితరాల గురించి తెలుసుకోవడం పట్ల అంతా ఆసక్తి చూపుతుంటారు. అయితే వాహన బీమా విషయాన్ని మాత్రం అంతగా పట్టించుకోరు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భంలో క్లెయిమ్ చేయవలసి వచ్చినప్పుడు మాత్రం దాని ప్రాధాన్యం ఏమిటో తెలిసివస్తుంది. ఇలాంటి సమయంలో ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. అవేమిటంటే...
బీమా కవరేజ్
మోటార్ ఇన్సూరెన్స్‌లో ప్రధానంగా రెరడు రకాలుంటాయి. ఇందులో ఒకటైన థర్డ్ పార్టీ లయబిలిటీ బీమా అనేది చట్టపరంగా వాహనానికి తప్పనిసరిగా ఉండాలి. ప్రమాదం జరిగిన సందర్భంలో ఇతరులకు కలిగే నష్టాలు లేదా గాయాలకు ఇది కవరేజీని అందిస్తుంది. మరొకటి కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్. ఇది విస్తృత రక్షణను కల్పిస్తుంది. ఇది థర్డ్ పార్టీ లయబిలిటీతోపాటు మీ సొంత వాహనానికి కలిగే నష్టాన్ని కవర్ చేస్తుంది. ఓన్ డ్యామేజ్ (ఓడీ) కవర్‌తోపాటు కాంప్రిహెన్సివ్ ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల ప్రశాంతంగా ఉండవచ్చు.
సరైన ఐడీవీ ఎంపిక..
ఐడీవీ అంటే ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ. వాహనం దొంగతనానికి గురైన లేదా పూర్తిగా నష్టపోయిన సందర్భంలో మీరు బీమా కంపెనీ నుంచి పొందే గరిష్ఠ మొత్తం. కొత్త వాహనాలకు అయితే ఎక్స్‌షోరూమ్ ధరలో 5 శాతం తీసివేసి ఐడీవీని లెక్కిస్తారు. అయితే మీ కారు పాతదవుతున్న కొద్దీ బీమా రెన్యూవల్ చేసే సమయంలో ఐడీవీ సరిగ్గా నిర్ణయించడం ముఖ్యం. ఐడీవీని పెంచితే మీరు చెల్లించాల్సిన ప్రీమియం ఎక్కువ అవుతుంది. ఐడీవీని తగ్గిస్తే చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది కానీ క్లెయిమ్ సమయంలో తక్కువ డబ్బులు వస్తాయి. అందుకే ఐడీవీని సరిగ్గా నిర్ణయించడం వల్ల సరైన పరిహారాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక జీరో డిప్రిసియేషన్ కవర్ వంటి యాడ్ ఆన్స్ ఉంటే.. తరుగుదలను లెక్కించకుండా క్లెయిమ్‌ను అందిస్తారు. ఇంజన్ ప్రొటెక్షర్ కవర్ కూడా చాలా ముఖ్యమైనది. వరదలు వచ్చినప్పుడు వాహనం ఇంజన్‌లోకి నీరు వేళ్తే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. ఇక రిటర్ను టు ఇన్వాయిస్ కవర్ విషయానికి వస్తే.. కారుకు పూర్తిగా నష్టం జరిగిన సందర్భంలో కారు కొనేటప్పుడు షోరూమ్‌లో ఎంత బిల్లు అయిందో ఆ పూర్తి మొత్తాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కొత్త కార్లకు ఇది చాలా విలువైన రక్షణ కవచం లాంటిది. కొన్ని బీమా కంపెనీలు ‘నో క్వశ్చన్స్ ఆస్క్‌డ్’ కవరేజీని కూడా అందిస్తున్నాయి. క్లెయిమ్ సందర్భంలో ప్రశ్నలు అడగకుండా క్లెయిమ్ ప్రక్రియలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసే అవకాశం ఉంటుంది. ఇక పే యాజ్ యూ డ్రైవ్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీ డ్రైవింగ్ అలవాట్లను బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుంది. మీరు వాహనాన్ని తక్కువగా వాడితే తక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాహనదారులకు సౌకర్యవంతమైనదే కాకుండా పొదుపునకు దోహదపడుతుంది. వాహనాన్ని తక్కువగా వినియోగించే వారికి ఇది లాభదాయకం.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
మీ పాలసీని అంతిమంగా ఖరారు చేసే ముందు మీ వాహన నంబరు నుంచి మీ వివరాలు, చిరునామా వరకు అన్నింటినీ ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. చిన్న పొరపాట్లు ఉన్నా మీ క్లెయిమ్‌ల చెల్లింపుల్లో జాప్యం జరగవచ్చు.. కొన్ని సందర్భాల్లో తిరస్కరణకు గురికావొచ్చు. ఇక మీ వాహనం ఎప్పుడైనా వరదనీటిలో చిక్కుకుంటే ఇంజన్‌ను స్టార్ట్ చేయకండి. అలా చేస్తే ఇంజన్ మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా చేయకుండా వాహనాన్ని సమీపంలోని గ్యారేజీకి తరలించి మీ బీమా కంపెనీకి సమాచారమివ్వండి. మనకు ప్రియమైన వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో కారుకు కూడా అంతే రక్షణ అవసరం. వాహనానికి సమగ్ర బీమా అనేది ఆ వాహనానికి మనమిచ్చే ప్రాధాన్యానికి నిదర్శనం.