డేటా సెంటర్ పాలసీల్లో తెలంగాణ భేష్!
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:56 AM
దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత ఆకర్షణీయ పాలసీ ప్యాకేజీని ఆఫర్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తాజా నివేదిక వెల్లడించింది.
అత్యంత ఆకర్షణీయ పాలసీ ప్యాకేజీని ఆఫర్ చేస్తున్న రాష్ట్రం..
ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, యూపీ : ఎస్ అండ్ పీ
న్యూఢిల్లీ: దేశంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అత్యంత ఆకర్షణీయ పాలసీ ప్యాకేజీని ఆఫర్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ తాజా నివేదిక వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రం భారీగా విద్యుత్, నియంత్రణ ప్రోత్సాహకాలను అందిస్తోందని నివేదిక పేర్కొంది. డేటా సెంటర్లకు సానుకూల పాలసీలు ఆఫర్ చేస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయని.. విద్యుత్, మౌలిక వసతులు, మూలధనం, నియంత్రణ వ్యవస్థతో కూడిన సమగ్ర ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయరి తెలిపింది. విద్యుత్, సులభతర వ్యాపారం విషయంలో గుజరాత్ ఆకర్షణీయంగా ఉందని.. ఈ రాష్ట్రం హైపర్‌స్కేలర్స్‌పై దృష్టి సారించిందని తెలిపింది. ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ డేటా సెంటర్ పాలసీ అట్రాక్టివ్‌నెస్ ఇండియా (డీసీపీఏఐ) ఇండెక్స్‌లో ఈ నాలుగు రాష్ట్రాలకు 100కు గాను దాదాపు 50 స్కోర్ లభించింది. ఈ నివేదికలోని మరిన్ని విషయాలు..
2016 నుంచి 11 రాష్ట్రాలు అమలు చేస్తున్న ఐటీ, ఐటీఈఎస్, డేటా సెంటర్లు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) సహా 19 రాష్ట్ర పాలసీలను డీసీపీఏఐ సూచీ పరిశీలించింది. ప్రధానంగా నాలుగు ప్రోత్సాహక విభాగాల (విద్యుత్ లభ్యత, భూమి -మూలధనం, నిర్వహణ, సాంకేతిక మద్దతు, నియంత్రణ, సులభతర వ్యాపార నిర్వహణ నిబంధనలు) మదింపు ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకింగ్‌లు కేటాయించింది.
డీసీపీఏఐ సూచీలో 100కు గాను 42-45 స్కోర్ సాధించిన రెండో విభాగ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా, కర్ణాటక ఉన్నా యి. ఇందులో ఏపీ భూమి, మూలధన మద్దతు ప్రయోజనాలు కల్పించడంలో ముందంజలో ఉంది. సులభతర వ్యాపార నిర్వహణ విషయంలో కర్ణాటక అధిక ప్రయోజనాలు కల్పిస్తోంది. ఒడిశా, హరియాణా డేటా సెంటర్ల పూర్తి ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్‌కు ప్రోత్సాహకాలు కల్పించడంపై దృష్టి పెట్టాయి.
సూచీలో 30-40 శ్రేణిలో స్కోర్ సాధించిన మూడో విభాగ రాష్ట్రాల్లో రాజస్థాన్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
భారత్‌లో ప్రస్తుతం 1.5 గిగావాట్ల సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు నిర్వహణలో ఉన్నాయి. 2031-32 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ సామర్థ్యం 26.3 గిగావాట్లకు పెరగవచ్చని అంచనా.
డేటా సెంటర్ల కారణంగా దేశంలో మొత్తం విద్యుత్ డిమాండ్ 2025-35 మధ్య కాలంలో ఏటా 18ు చొప్పున పెరుగుతూ పోవచ్చని నివేదిక అంచనా వేసింది.