ఈ ఏడాది 25,000 మంది ఫ్రెషర్ల నియామకం
ABN , Publish Date - Apr 13 , 2026 | 04:58 AM
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్..) 2026-27ఆర్థిక సంవత్సరానికి గాను 25,000 మంది ఫ్రెషర్లకు ఆఫర్ పత్రాలు జారీ చేసింది.....
డిమాండ్ ఆధారంగా రిక్రూట్‌మెంట్ పెంచుతాం
టీసీఎస్ ఎండీ కృతివాసన్
ముంబై: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్..) 2026-27ఆర్థిక సంవత్సరానికి గాను 25,000 మంది ఫ్రెషర్లకు ఆఫర్ పత్రాలు జారీ చేసింది. డిమాండ్ ఆధారంగా మరిన్ని నియామకాలు చేపట్టే విషయం పరిశీలించనున్నట్టు తెలిపింది. పలు ప్రతికూలతలు ఎదుర్కొంటున్న స్థితిలో కూడా 2025 -26 ఆర్థిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగాల్లోకి తీసుకుంది. దేశంలో ఒక ప్రైవేట్ రంగ సంస్థ చేపట్టిన గరిష్ఠ స్థాయి నియామకాలివే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తాము 25,000 మంది ఫ్రెషర్స్‌కు ఆఫర్ లెటర్లు ఇచ్చామని, డిమాండ్‌పై స్పష్టత వస్తే మరింత మందిని నియమించుకునే విష యం పరిశీలిస్తామని టీసీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ కె కృతివాసన్ చెప్పారు. మిడ్, సీనియర్ స్థాయి నిపుణులపై ఆధారనీయత తగ్గించుకుంటారా అన్న ప్రశ్నకు ఆయన లేదు అని సమాధానం ఇచ్చారు. ఒక ఫ్రెషర్ పనిలోకి రావాలంటే 9 నెలల శిక్షణ అవసరమని, అదే అనుభవం ఉన్న వారైతే తక్షణం ఉపయోగపడతారని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా వ్యాపార అవసరాలే నియామక వ్యూహాలను ప్రభావితం చేస్తాయని ఆయన చెప్పారు. వరుసగా మూడు సంవత్సరాలుగా తాము ప్రతి ఏటా 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటున్న విషయం గుర్తు చేశారు. 12,000 మందికి ఉద్వాసన చెప్పడంపై ప్రశ్నకు నేరుగా సమాధానం చెప్పకుండా ఉద్యోగుల పని తీరు బాగున్నంత వరకు కంపెనీలో వారి కెరీర్ ఉజ్వలంగానే ఉంటుందన్నారు.
వ్యాపారం బాగున్నట్టే..
దేశంలో వ్యాపార వాతావరణం ‘‘స్థిరంగా’’ ఉన్నదని చెబుతూ ‘‘స్థిరంగా ఉండడం అంటే బాగున్నట్టే కదా’’ అని వ్యాఖ్యానించారు. విచక్షణాపూర్వకమైన డిమాండ్ కూడా మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని కృతివాసన్ తెలిపారు. విభిన్న భౌగోళిక ప్రాంతాల్లో విభిన్న రంగాల్లో అవకాశాలు ఏర్పడుతున్నాయని...దానికి తోడు పూర్తి స్థాయి వినియోగం, పరివర్తిత డీల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4,000 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు కుదుర్చుకున్నట్లు తెలిపారు. కస్టమర్లు మెగా డీల్స్‌తో పాటు అధిక పనికి, అధిక ఆదాయం తెచ్చే విభాగాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. తమ సామర్థ్యాలకు బలం చేకూర్చే సంస్థలు అందుబాటులోకి వస్తే వాటిని కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ఏఎండీతో ఇటీవల కుదుర్చుకున్న భాగస్వామ్యం వంటి డీల్స్ పట్ల కూడా కృతివాసన్ సుముఖత ప్రకటించారు.