టీసీఎస్ లాభం రూ.13,349 కోట్లు
ABN , Publish Date - Jul 10 , 2026 | 02:36 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ.13,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది....
క్యూ1 ఆదాయం రూ.72,275 కోట్లకు చేరిక
కొత్త డీల్స్ 950 కోట్ల డాలర్లుగా నమోదు
9,200కు పైగా పెరిగిన సిబ్బంది సంఖ్య
ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి (క్యూ1) దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ రూ.13,349 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి గడించిన రూ.12,760 కోట్ల లాభంతో పోలిస్తే 4.61 శాతం వృద్ధి కనబరిచింది.అయితే, మార్చితో ముగిసిన త్రైమాసి కంలో నమోదైన రూ.13,718 కోట్ల లాభంతో పోలిస్తే దాదాపు 3 శాతం తగ్గింది. ఈ క్యూ1లో టీసీఎస్ ఆదాయం రూ.72,275 కోట్లకు పెరిగింది. 2025-26లో క్యూ1లో నమోదైన రూ.63,437 కోట్ల రెవెన్యూతో పోలిస్తే 14 శాతం, ఈ మార్చితో ముగిసిన క్వార్టర్‌లో గడించిన రూ.70,698 కోట్ల ఆదాయంతో పోలిస్తే 2.2 శాతం వృద్ధి కనబరిచింది. కాగా, ఈ మార్చి త్రైమాసికంలో 25.3 శాతంగా నమోదైన టీసీఎస్ నిర్వహణ లాభాల మార్జిన్.. జూన్ క్వార్టర్‌లో 24 శాతానికి తగ్గింది. కంపెనీ కొత్త పెట్టుబడులతో పాటు సిబ్బంది జీతాల పెంపు మార్జిన్లపై ప్రభావం చూపాయి.
260 కోట్ల డాలర్లకు ఏఐ సేవల ఆదాయం
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఉద్రిక్తతలతోపాటు ఏఐ విప్లవం నేపథ్యంలో ఐటీ కంపెనీల పనితీరు ఈ జూన్ త్రైమాసికంలో స్తబ్దుగానే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు ముందుగానే భావించాయి. ఈ నేపథ్యంలో విడుదలైన టీసీఎస్ ఫలితాలు అంత నిరాశాజనకంగా ఏం లేవని విశ్లేషకులు పేర్కొన్నారు. కంపెనీ లాభం మెప్పించకపోయినప్పటికీ, ఆదాయం మార్కెట్ వర్గాల అంచనాలు దాటింది. ముఖ్యంగా ఈ క్యూ1లో కంపెనీకి ఏఐ సేవల ద్వారా ఆదాయం 260 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ మార్చి త్రైమాసికంలో నమోదైన 230 కోట్ల డాలర్ల ఏఐ రెవెన్యూతో పోలిస్తే 13.6 శాతం అధికమిది.
ఈ నెల 31న డివిడెండ్ చెల్లింపులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు టీసీఎస్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు అర్హులైన షేర్‌హోల్డర్ల నమోదుకు ఈ 15ను రికార్డు తేదీగా నిర్ణయించిన కంపెనీ.. 31న డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది.
తగ్గిన కొత్త కాంట్రాక్టులు
గడిచిన మూడు నెలల్లో టీసీఎస్ 950 కోట్ల డాలర్ల విలువైన కొత్త డీల్స్‌ను కుదుర్చుకుంది. 2025-26 క్యూ1లో నమోదైన 940 కోట్ల డాలర్ల కాంట్రాక్టులతో పోలిస్తే కేవలం ఒక శాతం వృద్ధి నమోదైంది. కానీ, ఈ మార్చిలో లభించిన 1,200 కోట్ల డాలర్ల డీల్స్‌తో పోలిస్తే విలువ 21ు తగ్గింది.
అత్యధిక త్రైమాసిక నియామకాలు
గడిచిన మూడు నెలల్లో టీసీఎస్ సిబ్బంది సంఖ్య నికరంగా 9,279 పెరుగుదలతో మొత్తం 5,93,798కు చేరుకుంది. గడిచిన ఏడాదికాలంలో కంపెనీకి అత్యధిక త్రైమాసిక నియామకాలు ఇవి. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలోనూ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,356 మేర పెరిగింది. కాగా, జూన్ త్రైమాసికానికి కంపెనీ ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 13.6 శాతంగా నమోదైంది. మార్చి క్వార్టర్ లో నమోదైన 13.7 శాతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఐటీ సేవల డిమాండ్ స్తబ్దుగా మారింది. కొందరు క్లయింట్లు తమ పనిని వాయిదా కూడా వేసుకున్నారు. అయితే, ఈ జూలైతో మొదలైన రెండో త్రైమాసికంలో డిమాండ్ మళ్లీ పెరగవచ్చని ఆశాభావంగా ఉన్నాం.
కే కృతివాసన్,
టీసీఎస్ సీఈఓ, ఎండీ
ఈ వార్తలనూ చదవండి:
రోజంతా నిలకడగా రాణించి, చివరికి లాభాల్లోనే ముగిసిన సూచీలు
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..