Share News

పెట్టుబడుల కేటాయింపే కీలకం

ABN , Publish Date - Oct 12 , 2026 | 05:16 AM

ఈక్విటీ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఈ తరుణంలో మదుపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ, సీఐఓ శంకరన్‌ నరేన్‌ కోరారు.

పెట్టుబడుల కేటాయింపే కీలకం

  • ఐసీఐసీఐ ప్రు ఏఎంసీ ఈడీ నరేన్‌

ఈక్విటీ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. ఈ తరుణంలో మదుపరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ, సీఐఓ శంకరన్‌ నరేన్‌ కోరారు. ఆటుపోట్లు ఉన్నా ఇప్పటికీ మన దేశ ఆర్థిక పునాదులు పటిష్ఠంగానే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత తరుణంలో పెట్టుబడుల కేటాయింపే అత్యంత కీలకమన్నారు. మదుపరులు కేవలం ఈక్విటీ ఫండ్స్‌పై మాత్రమే కాకుండా రుణ పత్రాలు, ఇతర పెట్టుబడి సాధనాలపైనా దృష్టి పెట్టడం మంచిదని సూచించారు. ప్రస్తుతం ఏ ఒక్క పెట్టుబడి సాధనాల్లోనూ అతిగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదన్నారు. దీర్ఘకాలంలో ఆస్తుల కల్పనకు ఈక్విటీ మార్కెట్‌ ఇప్పటికీ అత్యం త అనుకూలంగా ఉందన్నారు. ఈ మార్కెట్లో దీర్ఘకాలిక నష్టభయాలూ ఉంటాయనే విషయాన్ని మదుపరులు గుర్తుంచుకోవాలన్నారు. సరైన పద్ధతిలో ఈక్విటీ, రుణ పత్రాలు, ఇతర పెట్టుబడి సాఽధనాల్లో మదుపు చేయడం ద్వారా ఏ ఒక్క పెట్టుబడి సాధనంలో అతిగా పెట్టుబడి పెట్టకుండా మార్కెట్‌ ఆటుపోట్లను తట్టుకోవచ్చని నరేన్‌ సూచించారు.

రూ. 44,166 కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు వెనక్కి..

భారత ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. అక్టోబరు నెలలో ఇప్పటి వరకు భారత ఈక్విటీల నుంచి ఎఫ్‌పీఐలు రూ.44,166 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఉపసంహరించుకున్న మొత్తం పెట్టుబడుల విలువ రూ.3.04 లక్షల కోట్లకు చేరింది.

Updated Date - Oct 12 , 2026 | 05:17 AM