ఆటుపోట్ల మార్కెట్లోపెట్టుబడి వ్యూహాలు ఎలా..?
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:47 AM
కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27)లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ ఊగిసలాడుతోంది. ఈ ఊగిసలాటతో గత రెండేళ్లుగా రేసుగుర్రాల్లా పరుగెత్తిన సూచీలు ఇప్పుడు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి....
కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27)లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ ఊగిసలాడుతోంది. ఈ ఊగిసలాటతో గత రెండేళ్లుగా రేసుగుర్రాల్లా పరుగెత్తిన సూచీలు ఇప్పుడు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం ఈక్విటీ మార్కెట్లతో పాటు ఇతర పెట్టుబడుల మార్కెట్లపైనా కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధంతో ఇది మరింత తీవ్రమైంది. అయితే కొన్ని పెట్టుబడుల వ్యూహాల ద్వారా మదుపరులు ఈ ఆటుపోట్ల నుంచి బయటపడవచ్చు. అవేమిటంటే..
లక్ష్యాలు సరిదిద్దుకోవడం
చాలా మంది మదుపరులు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికే కట్టుబడి ఉంటారు. పెట్టుబడుల మార్కెట్లో ఇది సరైన వ్యూహం కాదు. మారుతున్న మార్కెట్ పరిస్థితులు, ఆదాయాలు, వ్యక్తిగత బాధ్యతలకు అనుగుణంగా ఈ లక్ష్యాలనూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సరిదిద్దుకోవాలి. ఇందుకు ఈ ఆర్థిక సంవత్సరం సరైన సమయం. ఉదాహరణకు మీ ఆర్థిక లక్ష్యం రెండేళ్ల దూరంలో ఉందనుకుందాం. ప్రస్తుత ఆటుపోట్ల నేపథ్యంలో ఈక్విటీలో భారీ పెట్టుబడులు ఏ మాత్రం సరైంది కాదు. అదే రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలైతే, ప్రస్తుత ఆటుపోట్లలో మంచి కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం మంచిది. ఇది సంపద సృష్టికి దోహదం చేస్తుంది. అంటే సమయం, సందర్భాన్ని బట్టి ఎప్పటికప్పుడు పెట్టుబడుల లక్ష్యానికి అనుగుణంగా పెట్టుబడుల వ్యూహం మార్చుకోవాలి.
పెట్టుబడుల కేటాయింపు
ఆర్థిక లక్ష్యాల సాధనలో పెట్టుబడుల కేటాయింపుదీ కీలక పాత్ర. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క ఆస్తులపైనా ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్లో అధిక పెట్టుబడులు ఏ మాత్రం మంచిది కాదు. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఈ సంవత్సరం మార్కెట్లు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో తెలియని స్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు తమ పెట్టుబడులను ఒకే ఆస్తుల్లో మదుపు చేయకుండా ఈక్విటీ, రుణ పత్రాలు, బులియన్ వంటి ఆస్తుల్లోనూ పెట్టడం మంచిది. దీనివల్ల ఒక పెట్టుబడి నిరాశ పరిచినా.. ఇంకో పెట్టుబడి ఆదుకుంటుంది. దీంతో పెట్టుబడుల ‘అసలు’కూ పెద్దగా ఢోకా ఉండదు.
ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నప్పుడు రుణ పత్రాల మార్కెట్ స్థిరమైన రాబడులు అందిస్తుంది. అదే అంతర్జాతీయ ఆటుపోట్లు ఎదురైతే బంగారం, వెండిలో పెట్టుబడులు ‘అసలు’కు శ్రీరామ రక్ష. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలూ నెరవేరతాయి.
రుణ పత్రాల్లో పెట్టుబడులు
ఈక్విటీ మార్కెట్లు జోరు మీద ఉన్నప్పుడు చాలా మంది రుణ పత్రాల పెట్టుబడులను పెద్దగా పట్టించుకోరు. వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నప్పుడు, ఈక్విటీ పెట్టుబడులపై రాబడులు అంతంత మాత్రంగా ఉన్నప్పుడు రుణ పత్రాల్లో పెట్టుబడుల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. రుణ పత్రాల రాబడులపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఆటుపోట్ల ప్రభావం పెట్టుబడులపై ఉండదు. స్వల్ప, మధ్యకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈ పథకాల్లో మదుపు చేయవచ్చు. డెట్ పథకాల్లో పెట్టుబడులతో ‘అసలు’కు పెద్దగా ఢోకా కూడా ఉండదు.
పోర్ట్‌ఫోలియోనే ముఖ్యం
చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో మంచి రాబడులకు పథకాల ఎంపికే కీలకమని భావిస్తుంటారు. ఇందుకోసం చాలా సమయం వెచ్చిస్తూ కుస్తీ పడుతుంటారు. నిజానికి దీర్ఘకాలిక రాబడులు క్రమశిక్షణతో కూడిన నిలకడైన పెట్టుబడుల కేటాయింపులతోనే సాధ్యమవుతాయి. ఇటీవలి రాబడులను చూసి తరచూ ఒక మ్యూచువల్ ఫండ్ పథకం నుంచి ఇంకో మ్యూచువల్ ఫండ్ పథకానికి మారడం ఏ మాత్రం సరైన పద్దతి కాదు. దీనివల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే ప్రమాదమూ ఉంది. అధిక ధరల వద్ద కొని, తాత్కాలికంగా ఆ పథకం పనితీరు బాగోలేదని ఇంకో పథకానికి మారడం ఏ మాత్రం మంచిది కాదు. మంచి ఫండ్ మేనేజర్ నిర్వహణలోని పథకాల యూనిట్లను కొనుగోలు చేసి, ఎప్పటికప్పుడువాటి పనితీరుని సమీక్షించుకోవడంలో మాత్రం ఎలాంటి తప్పులేదు. అంతే తప్ప మార్కెట్ ఆటుపోట్లకు అనుగుణంగా పథకాలను మారుస్తుంటే, చివరికి నష్టాలే మిగిలే ప్రమాదం ఉంది.
పై పెట్టుబడి వ్యూహాల ద్వారా ప్రస్తుత ఆటుపోట్ల మార్కెట్లోనూ మదుపరులు తమ పెట్టుబడులపై స్థిరమైన రాబడులు పొందే అవకాశం ఉంది.
నిజమైన వివిధీకరణ
చాలా మంది మదుపరులు అనేక మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో మదుపు చేయడమే పెట్టుబడుల వివిధీకరణ అనుకుంటారు. ఈ భావన పూర్తిగా తప్పు. మార్కెట్ ఆటుపోట్లు అన్ని రంగాలు, అన్ని పథకాల పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తమ పెట్టుబడుల విధానం మార్చుకోవాలి. ప్రాంతాలు, రంగాల వారీగా పెట్టుబడుల వ్యూహాన్ని అనుసరించాలి. ఈక్విటీ మార్కెట్లోనే ఉండాలి అనుకుంటే స్థిరమైన రాబడుల కోసం లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో మదుపు చేయాలి. రుణ పత్రాలు, గోల్డ్‌ని కూడా జోడిస్తే మరింత ఉపయుక్తంగా ఉంటుంది. కొద్దో గొప్పో అంతర్జాతీయ మార్కెట్లలోనూ మదుపు చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల దేశీయ మార్కెట్ ఆటుప్టోట్లకు లోనైనా అంతర్జాతీయ మార్కెట్లలో పెట్టుబడులు మీ పెట్టుబడులకు అదనపు రక్షణ ఇస్తాయి.
ప్రతికూలతలు అవకాశమే
ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశీయ స్టాక్ మార్కెట్ ఈ ఆర్థిక సంవత్సరం అంతా ఆటుపోట్లకు లోనయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. మదుపరులు దీన్ని పెద్ద రిస్క్‌గా చూడకుండా ఒక అవకాశంగా మలుచుకోవాలి. మార్కెట్ ఆటుపోట్లకు భయపడి తమ సిప్ పెట్టుబడులను ఆపకుండా కొనసాగించాలి. దీనివల్ల యూనిట్ల సగటు కొనుగోలు ధర తగ్గుతుంది. ఇంకా డబ్బులు ఉంటే, ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్న మంచి కంపెనీల షేర్లను నేరుగా కొని పెట్టుకోవడం మరీ మంచిది. కాకపోతే ఒకేసారి పెద్దమొత్తంగా కాకుండా మార్కెట్ భారీ కుదుపునకు లోనైప్పుడల్లా కొద్దికొద్దిగా కొనుగోలు చేయాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. ఇక్కడ భావోద్వేగాల కంటే పెట్టుబడుల క్రమశిక్షణే ముఖ్యం అనే విషయం మర్చిపోవద్దు.
కొన్ని నిధులు ఉంచుకోండి
ఇది అసలే గడ్డు కాలం. ఎప్పుడు ఏ ఆపద, అవసరం వస్తుందో తెలియదు. కాబట్టి చేతిలో ఉన్న నాలుగు డబ్బులూ పెట్టుబడుల కోసం ఖర్చు చేయవద్దు. అత్యవసర ఖర్చుల కోసమని కొంత నగదు దగ్గర ఉంచుకోవాలి. ఈ మొత్తం కనీసం ఆరు నెలల అవసరాలకు సరిపోయేలా ఉండాలి. ఇలా జాగ్రత్త పడితే ఏదైనా అనుకోని ఉపద్రవం ఎదురైతే, ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులను కదిలించకుండా సమస్యల నుంచి బయట పడవచ్చు.