రూ.10 లక్షల కోట్లు ఫట్
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:57 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,045.46 పాయింట్లు (1.44 శాతం) క్షీణించి రెండున్నరేళ్లకు పైగా (2024 ఫిబ్రవరి 13 నాటి) కనిష్ఠ స్థాయి 71,593.24 వద్దకు జారుకుంది.
చమురు సెగలు, వడ్డీ పోటుకు మార్కెట్ సూచీలు విలవిల
రెండున్నరేళ్ల కనిష్ఠానికి సెన్సెక్స్.. 1,045 పాయింట్లు పతనం
21 నెలల కనిష్ఠానికి జారిన నిఫ్టీ 8 105 డాలర్లకు చమురు
రూ.97కు చేరువైన డాలర్‌తో రూపాయి మారకం విలువ
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు గురువారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,045.46 పాయింట్లు (1.44 శాతం) క్షీణించి రెండున్నరేళ్లకు పైగా (2024 ఫిబ్రవరి 13 నాటి) కనిష్ఠ స్థాయి 71,593.24 వద్దకు జారుకుంది. ఒక దశలో సూచీ 1,311 పాయింట్ల మేర పతనమైనప్పటికీ, మళ్లీ కాస్త కోలుకుంది. నిఫ్టీ విషయానికొస్తే, 371.25 పాయింట్లు (1.64 శాతం) కోల్పోయి 21 నెలల కనిష్ఠ స్థాయి 22,231.90 వద్ద ముగిసింది. ఒక దశలో సూచీ 423.15 పాయింట్ల నష్టంతో 22,179.90 వద్ద సరికొత్త ఏడాది కనిష్ఠాన్ని సైతం నమోదు చేసింది. సూచీలు నష్టపోవడం వరుసగా ఇది రెండో రోజు. కాగా, ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.10.02 లక్షల కోట్లు తగ్గి రూ.460.97 లక్షల కోట్లకు (4.76 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
మార్కెట్ పతనానికి కారణాలివీ..
మున్ముందు వారాల్లో ఇరాన్‌పై అమెరికా పెద్దఎత్తున మిలిటరీ దాడులు జరిపే ఆలోచనలో ఉందన్న వార్తలు, సౌదీ అరేబియాలోని ఎయిర్‌పోర్ట్‌లపై హౌతీల దాడుల నేపథ్యంలో బ్రెంట్ రకం ముడి చమురు ధర ఒక దశలో 5.2 శాతం ఎగబాకి 105.36 డాలర్లకు చేరింది. అలాగే, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ, యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌తో పాటు ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు ప్రామాణిక వడ్డీ రేట్లను మున్ముందు సమీక్షల్లో మరింత పెంచవచ్చన్న భయాందోళనలు పెరిగాయి.
అమెరికాలో 10 ఏళ్ల బాండ్ల వడ్డీ రేటు 5.3 శాతాన్ని దాటడం, రూపాయి విలువ మరో 13 పైసలు క్షీణించి రూ.96.88 వద్దకు చేరడం మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల ప్రభావిత కంపెనీల షేర్లు, కమోడిటీలు, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌లో అమ్మకాలకు దిగారు.
రిలయన్స్‌కు రూ.40,000 కోట్ల గండి
భారత్‌లో స్టార్‌లింక్‌కు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల అనుమతులు రాకుండా ముకేశ్ అంబానీయే అడ్డుకుంటున్నాడని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆరోపణలు చేయడంతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 2.43 శాతం క్షీణించి రూ.1,177.30 వద్దకు పడిపోయింది. దాంతో కంపెనీ మార్కెట్ విలువ దాదాపు రూ.40,000 కోట్ల మేర తరిగిపోయి రూ.15.93 లక్షల కోట్లకు పరిమితమైంది.