Share News

వెండికి భలే గిరాకీ

ABN , Publish Date - Aug 10 , 2026 | 01:07 AM

పసిడి ధర కొండెక్కడంతో వెండి నగలు, వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. పండగలు, పబ్బాలకు చిన్నమెత్తు బంగారం కొనలేక పోయినా, కొన్ని కుటుంబాలు కొద్దిపాటి వెండి వస్తువుల కొనుగోళ్లతో సరిపెడుతున్నాయి.

వెండికి భలే గిరాకీ

  • భగ్గుమంటున్న పసిడి ధరలతో వెండి నగలు, వస్తువులకు డిమాండ్‌

  • ‘హాల్‌మార్క్‌’ కోరుతున్న కొనుగోలుదారులు

  • ల్యాబ్‌లను పెంచనున్న బీఐఎస్‌

న్యూఢిల్లీ: పసిడి ధర కొండెక్కడంతో వెండి నగలు, వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. పండగలు, పబ్బాలకు చిన్నమెత్తు బంగారం కొనలేక పోయినా, కొన్ని కుటుంబాలు కొద్దిపాటి వెండి వస్తువుల కొనుగోళ్లతో సరిపెడుతున్నాయి. ఇదే సమయంలో మార్కెట్‌లో నగల వ్యాపారులు అమ్మే వెండి వస్తువుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పసిడి నగలు, వస్తువుల్లా వెండి నగలు, వస్తువులకు కూడా ‘హాల్‌మార్క్‌’ ఉండాలని కొనుగోలుదారులు కోరుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్‌) గత ఏడాది సెప్టెంబరు నుంచి వెండి నగలు, వస్తువులకూ హాల్‌మార్క్‌ యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ (హెచ్‌యూఐడీ) నంబర్‌ను తప్పనిసరి చేసింది. దీంతో ప్రస్తుతం ఉన్న తన సొంత హాల్‌మార్కింగ్‌ ల్యాబ్స్‌ సామర్థ్యాన్ని వచ్చే రెండేళ్లలో మరింత విస్తరించాలని బీఐఎస్‌ భావిస్తోంది. ‘గత ఏడాది నుంచి వెండి నగలకు కూడా హెచ్‌యూఐడీ అమలు చేస్తున్నాం. దీంతో వెండి నగలు, వస్తువులకు డిమాండ్‌ పెరిగింది. పెరుగుతున్న ఈ గిరాకీకి అనుగుణంగా వచ్చే రెండేళ్లలో మా ల్యాబ్స్‌లో వెండి నగల పరీక్షలను పెద్ద ఎత్తున పెంచేందుకు సిద్ధమవుతున్నాం’ అని బీఐఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ల్యాబ్స్‌) నిషత్‌ ఎస్‌ హుక్‌ చెప్పారు.


అమ్మకాలు రెట్టింపు..

హెచ్‌యూఐడీ నంబర్‌తో తాము కొనే వెండి నగలు, వస్తువుల్లో నిజమైన వెండి శాతం ఎంత? అనే విషయం తెలుసుకునే అవకాశం కొనుగోలుదారులకు ఏర్పడింది. దీంతో ఈ హాల్‌మార్క్‌ ఉన్న వెండి నగలు, వస్తువుల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 32 లక్షల హాల్‌మార్క్‌ వెండి నగలు, వస్తువులు అమ్ముడుపోగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో, వీటి సంఖ్య ఏకంగా 59 లక్షలకు చేరింది. బీఐఎస్‌ ఇప్పుడు తన ల్యాబ్స్‌లో వెండి నగలు, వస్తువుల టెస్టింగ్‌ను విస్తృతం చేయడంతో పసిడి కొనలేని కుటుంబాలు వెండి నగలు, వస్తువుల కొనుగోలుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ మార్పు కనిపిస్తోందని నగల వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే పండగల సీజన్‌లో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో రూ.3 లక్షల మార్కు దాటిన కిలో వెండి ప్రస్తుతం రూ.2.4 లక్షల నుంచి రూ.2.5 లక్షల మధ్య ట్రేడవడమూ ఇందుకు కలిసి రానుంది.


ఈ వారమూ ముందుకే...

గత వారం దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు 6-7ు పెరిగాయి. ఈ ట్రెండ్‌ ఈ వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాల అంచనా. ‘ప్రస్తుతం బంగారం, వెండి ధరల గమనం సానుకూలంగానే కనిపిస్తున్నాయి. స్వల్పకాలికంగా చూస్తే 10 గ్రాముల మేలిమి బంగారం రూ.1.57 లక్షలకు, కిలో వెండి రూ.2.8 లక్షలకు చేరే అవకాశం కనిపిస్తోంది’ అని జేఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (కమొడిటీస్‌ అండ్‌ కరెన్సీస్‌) సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రణవ్‌ మెర్‌ చెప్పారు. ఎంసీఎక్స్‌లో గత వారం అక్టోబరులో డెలివరీ ఇచ్చే 10గ్రాముల మేలిమి బంగారం రూ.8,444 లాభంతో రూ.1.51 లక్షల వద్ద, సెప్టెంబరులో డెలివరీ ఇచ్చే కిలో వెండి రూ.14,268 లాభంతో రూ.2.31 లక్షల వద్ద ముగిశాయి. అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతలు, ఈ వారం వెలువడే అమెరికా, జర్మనీ, జపాన్‌, భారత్‌ల ద్రవ్యోల్బణ వివరాలు, డాలర్‌-రూపాయి మారకం రేటు ఈ విషయంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి.

Updated Date - Aug 10 , 2026 | 01:08 AM