Share News

ఢమాల్‌ స్ట్రీట్‌!

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:11 AM

పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ముడి చమురు సెగల నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి...

ఢమాల్‌ స్ట్రీట్‌!

  • క్రూడ్‌ భగ్గు.. మరో రూ.10 లక్షల కోట్లు ఉఫ్‌

  • యుద్ధం దెబ్బకు రూ.33.68 లక్షల కోట్ల సంపద ఆవిరి

  • గత నెల 27 నుంచి సెన్సెక్స్‌ 6,723 పాయింట్లు పతనం

  • 75,000 కిందికి జారిన సూచీ

  • వారాంతంలో రూ.10,716 కోట్ల షేర్లు విక్రయించిన విదేశీ ఇన్వెస్టర్లు

ముంబై: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ముడి చమురు సెగల నేపథ్యంలో భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ భారీ నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ, రూపాయి క్షీణత మన మార్కెట్‌పై ఒత్తిడిని మరింత పెంచాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం ఒక దశలో 1,579.82 పాయింట్లు (2 శాతం) పతనమై 74,454.60 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరికి సూచీ 1,470.50 పాయింట్ల (1.93 శాతం) నష్టంతో 74,563.92 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్ఈ ప్రామాణిక సూచీ నిఫ్టీ 488.08 పాయింట్లు (2.06 శాతం) క్షీణించి 23,151.10 వద్ద ముగిసింది. అమ్మకాలు పోటెత్తడంతో ఈక్విటీ ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్క రోజులో రూ.10.24 లక్షల కోట్లు తగ్గి రూ.429.82 లక్షల కోట్లకు (4.65 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది. ఈ వారంలో సెన్సెక్స్‌ 4,354.98 పాయింట్లు (5.51 శాతం), నిఫ్టీ 1,299.35 పాయింట్లు (5.31 శాతం) నష్టపోయాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైనప్పటి (గతనెల 27) నుంచి సెన్సెక్స్‌ 6,723.27 పాయింట్లు (8.27 శాతం) పతనమైంది. రూ.33.68 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైంది.

  • బీఎస్ఈలో 4,421 కంపెనీల షేర్లు ట్రేడవగా.. 3,439 నష్టపోయాయి. అందులో 563 సంస్థల షేర్లు ఏడాది కనిష్ఠానికి జారుకోగా.. 12 లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి.

  • విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.10,716.64 కోట్ల విక్రయాలు జరిపారు. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ) రూ.9,977.42 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.


భారీగా తగ్గిన ఫారెక్స్‌ నిల్వలు

ఈ నెల 6తో ముగిసిన వారంలో విదేశీ మారక (ఫారెక్స్‌) నిల్వలు 1,168.3 కోట్ల డాలర్ల మేర తగ్గి 71,681 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు ఆర్‌బీఐ శుక్రవారం వెల్లడించింది. అంతక్రితం వారంలో ఫారెక్స్‌ నిల్వలు 488 కోట్ల డాలర్ల వృద్ధితో సరికొత్త ఆల్‌టైం రికార్డు స్థాయి 72,849.4 కోట్ల డాలర్లకు చేరాయి.

రూపీ కొత్త ఆల్‌టైం కనిష్ఠం

  • రూ.92.30కు చేరిన డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు

భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి పతనమైంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ మరో 5 పైసలు తగ్గి రూ.92.30 వద్ద ముగిసింది. ఒక దశలో మారకం రేటు 22 పైసల క్షీణతతో 92.47 వద్ద ఆల్‌టైం ఇంట్రాడే కనిష్ఠాన్ని కూడా నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 100 డాలర్లకు ఎగబాకడం, డాలర్‌ బలోపేతం, ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడుల నిరవధిక ఉపసంహరణ ఇందుకు కారణమని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. మున్ముందు సెషన్లలోనూ రూపాయిపై ఒత్తిడి కొనసాగనుందని, డాలర్‌తో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.92.10-92.80 శ్రేణిలో కదలాడవచ్చని మిరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ అనూజ్‌ చౌదరీ అన్నారు.

Updated Date - Mar 14 , 2026 | 04:11 AM