సెన్సెక్స్‌కు చమురు సెగ
ABN , Publish Date - Oct 13 , 2026 | 04:43 AM
చమురు ధరల పెరుగుదల, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి.
సూచీ 548 పాయింట్లు పతనం
107 డాలర్లకు బ్రెంట్ చమురు
రూపీ హైజంప్
ముంబై: చమురు ధరల పెరుగుదల, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లలో అమ్మకాలకు పాల్పడటంతో ప్రామాణిక ఈక్విటీ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 547.65 పాయింట్లు క్షీణించి 71,676.10 వద్దకు జారుకుంది. నిఫ్టీ 157.10 పాయింట్లు తగ్గి 22,363.35 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 23 నష్టపోగా.. ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు 3శాతానికి పైగా పతనమై సూచీ టాప్ లూజర్లుగా మిగిలాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు పీపా ధర ఒక దశలో 2.20 శాతం ఎగబాకి 107.03 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. గత వారాంతంలో ఆర్‌బీఐ చేపట్టిన చర్యలతో భారత కరెన్సీ భారీగా పుంజుకుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ట్రేడింగ్‌లో ఏకంగా 93 పైసలు లాభపడి రూ.95.78 వద్ద ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో రూ.95.61 వద్ద ప్రారంభమైన డాలర్-రూపీ ఎక్స్ఛేంజ్ రేటు.. ఒక దశలో రూ.95.57 స్థాయికి బలపడింది. మళ్లీ రూ.95.96 వద్దకు తగ్గినప్పటికీ.. గత శుక్రవారం ముగింపు స్థాయితో పోలిస్తే 93 పైసల లాభంతో రూ.95.78 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువకు గడిచిన ఆరు నెలలకు పైగా కాలంలో ఇదే అతిపెద్ద ఒక్క రోజు వృద్ధి. ఈ ఏప్రిల్ 2న రూపాయి మారకం విలువ 166 పైసలు బలపడింది.