Share News

మార్కెట్లోకి సెమాగ్లుటైడ్‌ ఔషధాల వెల్లువ

ABN , Publish Date - Mar 21 , 2026 | 03:39 AM

ఊబకాయాన్ని తగ్గించి, మధుమేహ వ్యాధిని నియంత్రించే ఔషఽధాల రంగంలో బహుళ జాతి కంపెనీల (ఎంఎన్‌సీ) గుత్తాధిత్యానికి తెరపడుతోంది.

మార్కెట్లోకి సెమాగ్లుటైడ్‌ ఔషధాల వెల్లువ

  • నోవో నార్డిస్క్‌, ఎలీ లిల్లీ ఔషధాలకు ముగిసిన పేటెంట్‌

  • నాట్కో, ఎరిస్‌ ఫార్మా నుంచి జెనరిక్‌ వెర్షన్స్‌ విడుదల

  • సగానికి పైగా తగ్గనున్న ధరలు

  • రూ.1,290 ధరతో ప్రారంభం

  • రేసులో మరిన్ని ఫార్మా సంస్థలు

న్యూఢిల్లీ: ఊబకాయాన్ని తగ్గించి, మధుమేహ వ్యాధిని నియంత్రించే ఔషఽధాల రంగంలో బహుళ జాతి కంపెనీల (ఎంఎన్‌సీ) గుత్తాధిత్యానికి తెరపడుతోంది. నోవో నార్డిస్క్‌, ఎలీ లిల్లీ సంస్థలు.. ఒజెంపిక్‌, వెగోవి, మొంజారో పేరుతో మార్కెట్‌ చేస్తున్న బ్రాండెడ్‌ ‘సెమాగ్లుటైడ్‌’ ఔషధానికి మన దేశంలో శుక్రవారంతో పేటెంట్‌ గడువు ముగిసింది. దీంతో ఎరిస్‌ లైఫ్‌సైన్సెస్‌, నాట్కో ఫార్మా సంస్థలు.. దేశీయ మార్కెట్లోకి జెనరిక్‌ వెర్షన్‌ సెమాగ్లుటైడ్‌ ఔషధాన్ని విడుదల చేశాయి. ఎరిస్‌ లైఫ్‌ ‘సండే’ పేరుతో, నాట్కో సెమానాట్‌, సెమాఫుల్‌ పేర్లతో ఈ ఔషధాన్ని తీసుకువచ్చాయి. ఇప్పటి వరకు పేటెంట్‌ హక్కులున్న నోవో నార్డిస్క్‌, ఎలీ లిల్లీ కంపెనీలు ఈ ఔషధాన్ని డోసును బట్టి నెలకు రూ.8,800 నుంచి రూ.26,000 వరకు విక్రయిస్తున్నాయి. తాజాగా ఎరిస్‌ లైఫ్‌ జెనరిక్‌ వెర్షన్‌ సండే ఔషధాన్ని 2 ఎంజీ/1.5 ఎంఎల్‌, 4 ఎంజీ/3 ఎంఎల్‌ సామర్థ్యాలతో నెలకు రూ.1,290 ప్రారంభ ధరతో విడుదల చేసింది. వచ్చే నెలలో రూ.4,000, రూ.4,200, రూ.4,500 ధరలతో పెన్‌ డివైస్‌ వెర్షన్‌లో 3 వేరియంట్స్‌ను విడుదల చేయనున్నట్లు ఎరిస్‌ లైఫ్‌ వెల్లడించింది.

నేడు ‘నాట్కో’ ఔషధం

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న నాట్కో ఫార్మా శనివారం తన జెనరిక్‌ వెర్షన్‌ సెమాగ్లుటైట్‌ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మల్టీ డోస్‌ వయల్స్‌లో ‘సెమానాట్‌, సెమాఫుల్‌’ పేర్లతో విడుదల చేస్తోంది. గత నెల 26న సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్‌సీఓ) ఈ ఔషధానికి ఆమోదం తెలిపింది. 2ఎంజీ/1.5ఎంఎల్‌, 4ఎంజీ/3ఎంఎల్‌ వెర్షన్‌కు రూ.1,290, 8ఎంజీ/3ఎంఎల్‌ డోసేజీకి రూ.1,750 ధరలను ఖరారు చేసినట్లు ప్రకటించింది. వచ్చే నెలలో 2ఎంజీ/1.5 ఎంఎల్‌, 4ఎంజీ/3 ఎంఎల్‌, 8ఎంజీ/3ఎంఎల్‌ డోసేజీతో కూడిన పెన్‌ డివైజ్‌ వెర్షన్‌లోనూ నాట్కో ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. వీటి ధర కూడా డోసేజీని బట్టి నెలకు రూ.4,000, రూ.4,200, రూ.4,500గా నిర్ణయించినట్టు తెలిపింది.


రంగంలో 40 కంపెనీలు?

సెమాగ్లుటైడ్‌ పేటెంట్‌ గడువు ముగియడంతో దాదాపు 40 భారత ఫార్మా కంపెనీలు తమ జెనరిక్‌ వెర్షన్లు మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవతున్నాయి. ఇందులో హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే డాక్టర్‌ రెడ్డీస్‌, ఎంఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌ కూడా ఉన్నాయి.

రూ.5,000 కోట్లకు మార్కెట్‌

ప్రస్తుతం మన దేశంలోని డయాబెటిస్‌, ఊబకాయుల్లో కేవలం 5 శాతం మందికి మాత్రమే అది కూడా నగరాలు, పట్టణాల్లోని వారికి మాత్రమే సెమాగ్లుటైడ్‌ ఔషదం అందుబాటులో ఉంది. అధిక ధరతో చాలా మంది ఈ ఔషధాన్ని కొనలేకపోతున్నారు. ఇప్పుడు చౌకగా జెనరిక్‌ రూపంలో అందుబాటులోకి వస్తోంది. దీంతో వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో దాదాపు 20 శాతం మందికి ఈ ఔషధం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం రూ.1,500 కోట్ల వరకు ఉన్న మార్కెట్‌ కూడా వచ్చే ఏడాది, ఏడాదిన్నరలో రూ.4,000 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు, 2030 నాటికి రూ.8,000 కోట్లకు చేరుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. పేటెంట్‌ గడువు తీరిన దేశాలకూ ఈ జెనరిక్‌ ఔషధాన్ని ఎగుమతి చేసే అవకాశాలు భారత ఫార్మా కంపెనీలకు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - Mar 21 , 2026 | 03:39 AM