Share News

ఇక ప్రీ-ఐపీఓ ఎక్స్ఛేంజ్‌!

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:44 AM

తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)కు సిద్ధమవుతున్న కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ కోసం ప్రత్యేక ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయాలని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ భావిస్తోంది.

ఇక ప్రీ-ఐపీఓ ఎక్స్ఛేంజ్‌!

  • సెబీ సన్నాహాలు

ముంబై: తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌(ఐపీఓ)కు సిద్ధమవుతున్న కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ కోసం ప్రత్యేక ఎక్స్ఛేంజ్‌ను ఏర్పాటు చేయాలని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన పరిగణలో ఉందని, చర్చా పత్రంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని ‘సీఎన్‌బీసీ ఆవాజ్‌’ ఛానెల్‌ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. ప్రీ-ఐపీఓ ఎక్స్ఛేంజ్‌ ఏర్పాటు ద్వారా పబ్లిక్‌ ఇష్యూకు రావాలనుకుంటున్న కంపెనీల షేర్లను స్టాక్‌ మార్కెట్లో నమోదుకు ముందే నియంత్రిత వేదికపైకి తెచ్చేందుకు వీలవుతుంది. అలాగే, అనధికారిక గ్రే మార్కెట్‌ కార్యకలాపాలకూ అడ్డుకట్ట పడుతుంది. గడిచిన 3-4 ఏళ్లలో భారత్‌లో ఐపీఓలు జోరందుకున్నాయి. తత్ఫలితంగా గ్రే మార్కెట్లో ప్రీ-ఐపీఓ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌ కూడా ఊపందుకుంది. ఏదైనా కంపెనీ ఐపీఓకు ముందు గ్రే మార్కెట్లో ఆ సంస్థ షేరుకు చెల్లిస్తున్న ప్రీమియం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు, లిస్టింగ్‌ రోజున ఆ షేరు పంచగలిగే లాభాలకు సంకేతంగా మారింది. ఇది ఐపీఓల్లో మదుపరుల పెట్టుబడి నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తోంది. అందుకే ప్రీ-ఐపీఓ కంపెనీల షేర్లను సెబీ లిస్టింగ్‌కు ముందే నియంత్రిత ట్రేడింగ్‌ వేదికపైకి తీసుకురావాలనుకుంటోంది.

Updated Date - Nov 29 , 2026 | 03:45 AM