Share News

కొత్త కనిష్ఠానికి రూపీ

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:04 AM

ముడి చమురు మంటల్లో మన కరెన్సీ రూపాయి కర్పూరంలా కరిగిపోతోంది. అమెరికన్‌ డాలర్‌ రూ.95కు చేరువైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌-రూపీ మారకం విలువ శుక్రవారం 89 పైసలు క్షీణించి సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయి రూ.94.85 వద్ద ముగిసింది.

కొత్త కనిష్ఠానికి రూపీ

  • ఒక్కరోజులో 89 పైసలు పతనం

  • రూ.95కు చేరువైన డాలర్‌- రూపాయి మారకం రేటు

ముంబై: ముడి చమురు మంటల్లో మన కరెన్సీ రూపాయి కర్పూరంలా కరిగిపోతోంది. అమెరికన్‌ డాలర్‌ రూ.95కు చేరువైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌-రూపీ మారకం విలువ శుక్రవారం 89 పైసలు క్షీణించి సరికొత్త జీవితకాల కనిష్ఠ స్థాయి రూ.94.85 వద్ద ముగిసింది. డాలర్‌-రూపీ మారకం రేటు రూ.94 ఎగువన ముగియడం, ఇంట్రాడే లో రూ.94.50 స్థాయిని దాటడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో యుద్ధంతో క్రూడాయిల్‌ ధర 110 డాలర్లకు ఎగబాకడం, డాలర్‌ బలపడటం, అమెరికాలో బాండ్ల రేట్ల పెరుగుదల, మన ఈక్విటీ మార్కెట్లో భారీ నష్టాలు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెద్దఎత్తున తరలిపోతుండటం రూపాయి క్షీణతకు కారణాలని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి.

రూ.100 దిశగా పయనం: చమురు దిగుమతిదారులు, ఎఫ్‌ఐఐల నుంచి డాలర్‌కు డిమాండ్‌ పెరగడంతో పాటు ఇంధనల ధరల కారణంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరగవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో మన కరెన్సీపై ఒత్తిడి కొనసాగనుందని వారంటున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, డాలర్‌-రూపీ మారకం రేటు వచ్చే వారంలో రూ.95 స్థాయి ని సైతం అధిగమించి ఆపై రూ.100 దిశగా పయనించవచ్చని అభిప్రాయపడ్డారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 11 శాతం పతనం: పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి (ఫిబ్రవరి 28) నుంచి డాలర్‌తో రూపాయి మారకం విలువ దాదాపు 4 శాతం పతనమైంది. ఈ నెలాఖరుతో ముగియనున్న 2025-26 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం తగ్గింది. గడిచిన దశాబ్దానికి పైగా కాలంలో రూపాయికి ఇదే అత్యధిక వార్షిక క్షీణత. 2011-12లో రూపీ విలువ 14 శాతం మేర తరిగిపోయింది.

Updated Date - Mar 28 , 2026 | 04:04 AM