Share News

డాలర్‌ = రూ.95

ABN , Publish Date - Mar 31 , 2026 | 01:35 AM

భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి జారుకుంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఒక దశలో రూ.95.22 వద్దకు చేరుకుంది.

డాలర్‌ = రూ.95

  • సరికొత్త ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి భారత కరెన్సీ

  • ఇంట్రాడేలో ఒక దశలో రూ.95.22 స్థాయికి ..

  • చివరికి 15 పైసల లాభంతో రూ.94.70 వద్ద ముగింపు

  • పశ్చిమాసియా యుద్ధంతో 4.1 శాతం నష్టపోయిన రూపాయి

  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10 శాతం పతనం

  • 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక క్షీణత

ముంబై: భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్ఠానికి జారుకుంది. ఫారెక్స్‌ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం ఒక దశలో రూ.95.22 వద్దకు చేరుకుంది. డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.95 స్థాయిని దాటడం ఇదే తొలిసారి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా బ్రెంట్‌ ముడి చమురు పీపా ధర ఒక దశలో 115 డాలర్లకు ఎగబాకడంతో పాటు డాలర్‌ బలపడటం, మన ఈక్విటీ మార్కెట్లో నష్టాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు ఇందుకు ప్రధాన కారణమని ఫారెక్స్‌ వర్గాలు తెలిపాయి. ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగితే డాలర్‌-రూపీ ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.100 దిశగా పయనించనుందని వారన్నారు.

ఆరంభంలో లాభాలు: క్రితం వారాంతంలో 89 పైసలు క్షీణించి రూ.94.85 వద్ద ముగిసిన డాలర్‌-రూపాయి మారకం విలువ.. సోమవారం ట్రేడింగ్‌లో రూ.93.62 వద్ద ప్రారంభమైంది. మరింత బలపడి రూ.93.57 వద్దకు చేరుకుంది. అంటే, గత శుక్రవారం ముగింపుతో పోలిస్తే 128 పైసలు బలపడింది. బ్యాంకుల అమెరికన్‌ కరెన్సీ ఓవర్‌నైట్‌ నెట్‌ ఓపెన్‌ పొజిషన్స్‌ను 10 కోట్ల డాలర్లకు తగ్గిస్తూ ఈ నెల 27న ఆర్‌బీఐ సర్క్యులర్‌ జారీ చేయడం ఇందుకు దోహదపడింది. అయితే, ఆర్‌బీఐ చర్య రూపాయిని ఎంతోసేపు ఆదుకోలేకపోయింది. కార్పొరేట్‌ సంస్థలు భారీగా డాలర్లను కొనుగోలు చేయడంతో మన కరెన్సీ మళ్లీ జారుకోవడం మొదలు పెట్టింది. ఒక దశలో ఎక్స్ఛేంజ్‌ రేటు రూ.95.22 వద్దకు చేరుకుంది. చివర్లో మళ్లీ తేరుకుంది. క్రితం క్లోజింగ్‌తో పోలిస్తే, 15 పైసల లాభంతో రూ.94.70 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూపాయి మారకం విలువ 165 పైసల శ్రేణిలో ఊగిసలాడింది.

గత నెల 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయి మారకం విలువ 4.1 శాతం మేర క్షీణించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో 9.88 శాతం పతనమైంది. గత 14 ఏళ్లలో మన కరెన్సీకిదే అతిపెద్ద వార్షిక క్షీణత. అంతేకాదు, వర్ధమాన దేశాల్లోకెల్లా అత్యధికంగా నష్టపోయిన కరెన్సీ కూడా మనదే. 2011-12 ఆర్థిక సంవత్సరంలో డాలర్‌తో రూపీ మారకం విలువ 12.4 శాతం తగ్గింది.

Updated Date - Mar 31 , 2026 | 01:35 AM