Share News

ముందస్తు ప్రణాళికతోమలి వయసుకు భరోసా

ABN , Publish Date - Apr 12 , 2026 | 03:01 AM

ఆరు పదుల వయసు నిండేసరికి.. చాలా మందికి సంపాదన ఉండదు. అప్పుడు పని చేసి సంపాదించాలన్నా ఓపిక ఉండదు. శరీరమూ సహకరించక పోవచ్చు.

ముందస్తు ప్రణాళికతోమలి వయసుకు భరోసా

ఆరు పదుల వయసు నిండేసరికి.. చాలా మందికి సంపాదన ఉండదు. అప్పుడు పని చేసి సంపాదించాలన్నా ఓపిక ఉండదు. శరీరమూ సహకరించక పోవచ్చు. కాబట్టి రిటైరయ్యే సరికి, ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వాతంత్య్రం తప్పనిసరి. లేకపోతే మలి వయసులో అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు తప్పవు. అయితే బాగా సంపాదించే 35 ఏళ్ల వయసు నుంచే కొద్దిగా ముందు జాగ్రత్తతో వ్యవహరిస్తే మలి వయసులో ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు.

రు పదుల వయసు వచ్చే సరికి బాధ్యతలన్నీ పూర్తి చేసి.. పూర్తి ఆర్థిక స్వాతంత్య్రంతో బతకాలని చాలా మంది ఆశపడుతుంటారు. అందరికీ ఇది అంత తేలికైన విషయం కాదు. అయితే నాలుగు రాళ్లు సంపాదించే వయసులోనే ముందు జాగ్రత్త పడితే ఇదేమంత పెద్ద కష్టమైన విషయం కాదు. పాతికేళ్ల వయసులోనే జాబ్‌లో చేరి ఎంజాయ్‌ చేసినా, కనీసం 35 ఏళ్ల వయసు నుంచైనా రిటైర్మెంట్‌ ఆర్థిక భద్రతపై దృష్టి పెట్టడం అవసరం. అప్పటి నుంచి పాతికేళ్ల పాటు నెలనెలా రిటైర్మెంట్‌ అవసరాల కోసం జాగ్రత్త పడితే మలి వయసులో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా బయట పడవచ్చు. ఇందుకోసం ఈ కింది సప్త సూత్రాలు పాటించడం మేలు. అవేంటంటే?

స్పష్టమైన రిటైర్మెంట్‌ లక్ష్యాలు

పదవీ విరమణ తర్వాత మన జీవన శైలి ఎలా ఉండాలి? కుటుంబం, పిల్లల చదువులు, పెళ్లిళ్లు పూర్తవుతాయా? లేదా? అని ఆలోచించాలి. అందుకు అనుగుణంగా 35వ ఏట నుంచే నాలుగు రాళ్లు పొదుపు చేస్తూ ఆ మొత్తాన్ని చక్కటి రాబడులు ఇచ్చే పెట్టుబడుల్లో పెట్టాలి. ఇక్కడ ‘ఖర్చు చేయగా మిగిలింది పొదుపు చేయడం కాదు, పొదుపు చేయగా మిగిలిందే ఖర్చు చేయాలి’ అనే వారెన్‌ బఫెట్‌ సూత్రాన్ని పాటించడం మంచిది. ఈ పొదుపు, పెట్టుబడుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మధ్యలో సరిదిద్దుకునేందుకూ అవకాశం ఉంటుంది. దీనివల్ల 60 ఏళ్ల వయసు వచ్చేసరికి కుటుంబ బాధ్యతలు పూర్తయి హాయిగా మనశ్శాంతితో మలి వయసు జీవితం గడిపేయవచ్చు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై అంచనా

మూడు పదుల వయసు వచ్చే సరికి ప్రతి వ్యక్తికీ తన ఆస్తులు, సంపాదన, నెలవారీ ఖర్చులు, ఈఎంఐలు, ఆర్థిక బాధ్యతలపై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఈ అంశాల ఆధారంగా రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక అవసరాలను అంచనా వేసుకోవాలి. ఈ లెక్కల కోసం అనేక ఆర్థిక సంస్థలు తమ వెబ్‌సైట్లలో కాలిక్యులేటర్లను కూడా అందుబాటులో ఉంచాయి. ఈ లెక్కలతో పాటు పొదుపు, పెట్టుబడులు, రాబడులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా ప్రతి వ్యక్తి 35 ఏళ్ల వయసు నుంచి పెంచుకోవాలి. బిజినెస్‌ న్యూస్‌ పేపర్లు, టీవీ చానళ్లు, వెబ్‌సైట్లు ఇందుకు ఎంతగానో ఉపయోగపడతాయి.


అత్యవసర నిధి

జీవితం అనుకున్నట్టు సాగదు. కొన్నిసార్లు అనుకోకుండా లేదా ఊహించకుండా కొన్ని ఖర్చులు ఎదురవుతాయి. అవి ఆరోగ్య సమస్యలు కావచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి వ్యక్తి తప్పనిసరిగా కుటుంబ సభ్యులు అందరికీ వర్తించేలా టర్మ్‌ ఇన్సూరెన్స్‌, తగినంత కవరేజీతో ఆరోగ్య బీమా పాలసీలు కలిగి ఉండాలి. ఇవి లేకపోతే రిటైర్మెంట్‌ ప్లానింగ్‌ కూడా తలకిందులవుతుంది.

కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదా ఏదైనా అనుకోని పరిణామం జరిగినా అప్పటి వరకు పొదుపు చేసినదంతా ఆ ఖర్చులకే సరిపోతుంది. అవి కూడా సరిపోక ఒక్కోసారి అప్పులు కూడా చేయాల్సి వస్తుంది.

నిరంతర సమీక్ష, సర్దుబాటు

జీవితం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. రిటైర్మెంట్‌ పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది. 35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభించినా ఏటా ఆ పెట్టుబడుల పనితీరుని సమీక్షించుకోవాలి. మంచి రాబడులు అందిస్తున్న పెట్టుబడులను కొనసాగిస్తూ నష్టాలు తెచ్చిపెట్టే పెట్టుబడులను వదిలించుకోవాలి. లేకపోతే అసలు లక్ష్య సాధన సాధ్యం కాదు.

అప్పులు తగ్గించుకోవడం

రిటైర్మెంట్‌ ఆర్థిక భద్రత కోసం ప్లాన్‌ చేసే ప్రతి వ్యక్తీ.. 35 ఏళ్ల వయసు వచ్చేసరికి అప్పులు, ఈఎంఐల వంటి చెల్లింపులను గణనీయంగా తగ్గించుకోవాలి. ముఖ్యంగా క్రెడిట్‌ కార్డులపై చేసిన రుణ కొనుగోళ్లు, వ్యక్తిగత రుణాల ఈఎంఐలు. లేకపోతే సంపాదించేదంతా ఈఎంఐలు, వడ్డీల చెల్లింపులకే పోతుంది. రిటైర్మెంట్‌ ప్లానింగ్‌కు అంటూ ఏమీ ఉండదు.

తెలివిగా పెట్టుబడులు

రిటైర్మెంట్‌ పెట్టుబడులు కూడా తెలివిగా ఉండాలి. మార్కెట్లో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా స్మాల్‌ క్యాప్‌ లేదా ఫ్లెక్సీ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు దీర్ఘకాలంలో మదుపరులకు మంచి రాబడులు పంచుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మంచి ఇన్వె్‌స్టమెంట్‌ అడ్వైజర్‌ సలహాతో క్రమానుగత పెట్టుబడి (సిప్‌) పద్దతిలో ఈ పథకాల్లో 35 ఏళ్ల వయసు నుంచే పెట్టుబడులు ప్రారంభించడం మంచిది. స్టాక్‌ మార్కెట్లో ఆటుపోట్లు సహజం. ఈ పథకాలపై రాబడులు మార్కెట్‌ పనితీరును బట్టే ఉంటాయి. కాబట్టి నెల నెలా పొదుపు చేసే మొత్తంలో 60 నుంచి 65 శాతానికి మించకుండా ఈ పథకాల్లో మదుపు చేయడం మంచిది.


రిస్క్‌ కొద్దీ రాబడులు

  • పిండి కొద్దీ రొట్టె అంటారు. రిటైర్మెంట్‌ పొదుపు, పెట్టుబడులకు కూడా ఇది వర్తిస్తుంది. ఎంత ఎక్కువ నష్ట భయానికి (రిస్క్‌) సిద్ధపడితే, అంత రాబడులకు అవకాశం ఉంటుంది.

  • మీ నష్టభయాన్ని బట్టి ఈక్విటీ షేర్లు, బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, వెండి, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో మదుపు చేయండి.

  • ఉద్యోగులైతే స్థిర ఆదాయ పథకాలైన ఈపీఎఫ్‌, పీఎఫ్‌, పీపీఎఫ్‌, ఎన్‌పీఎ్‌స, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) వంటి పథకాల్లో మదుపు చేయవచ్చు. ఈ పథకాల్లో పెట్టే పెట్టుబడులకు పెద్దగా రిస్క్‌ ఉండదు.

  • ఈ పథకాల్లో పెట్టుబడులు బ్యాంకు ఎఫ్‌డీల కంటే కొద్దిగా అధిక రాబడులే ఇస్తాయి. పైగా పాత పన్ను విధానంలో ఈ పథకాల్లో పెట్టే పెట్టుబడులకు పన్ను మినహాయింపు కూడా ఉంది.

  • స్వయం ఉపాధిలో ఉండి రిటైర్మెంట్‌ తర్వాత స్థిర ఆదాయాన్ని ఆశించే వ్యక్తులైతే బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పీపీఎఫ్‌, ఎన్‌పీఎస్‌, ఎస్‌సీఎస్‌ఎస్‌ వంటి పథకాల్లో మదుపు చేయడం మంచిది.

  • మరింత రిస్క్‌ తీసుకునే సామర్ధ్యం ఉంటే నేరుగా మంచి కంపెనీల షేర్లు, చక్కటి పనితీరు కనబరుస్తున్న మ్యూచువల్‌ ఫండ్స్‌ అందించే ఈక్విటీ, డెట్‌, బ్యాలెన్స్‌డ్‌ లేదా మల్టీ అసెట్‌ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అయితే ఈ పథకాలపై రాబడులు మార్కెట్‌ స్థితిగతులను బట్టి ఉంటాయనే విషయం మర్చిపోకూడదు.

  • అన్ని గుడ్లు ఒకే బుట్టలో పెట్టకూడదన్న సామెత రిటైర్మెంట్‌ పెట్టుబడులకూ వర్తిస్తుంది. మూడు పదుల వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తారు కాబట్టి, కొద్దిగా రిస్క్‌ ఉన్నా దీర్ఘకాలంలో అధిక రాబడులకు అవకాశం ఉన్న ఈక్విటీ షేర్లు, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో ముందు ఇన్వెస్ట్‌ చేయాలి. తర్వాత రిటైర్మెంట్‌ దగ్గరపడే కొద్దీ స్థిర ఆదాయ పథకాలపై దృష్టి పెట్టాలి.

Updated Date - Apr 12 , 2026 | 03:01 AM