Share News

Financial Planning: కాలం మారింది..మీరూ మారాలి..

ABN , Publish Date - Jan 18 , 2026 | 03:02 AM

డబ్బు ఖర్చు, నిర్వహణ, పొదుపు లాంటి విషయాలను ప్రధానంగా మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ తర్వాత బంధువులు, స్నేహితులు...

Financial Planning: కాలం మారింది..మీరూ మారాలి..

ఆర్థిక విషయాల్లో అధిక భద్రత అభివృద్ధికి అవరోధంగా మారిందా..? మీ పెద్దల ఆర్థిక సలహాలు వారిని నష్టాల నుంచి రక్షించి ఉండవచ్చు. కానీ వేగంగా మారుతున్న పరిస్థితుల్లో అందులో కొన్ని మీ ఆర్థిక ప్రగతిని పరిమితం చేసే అవకాశం ఉంది. కాబట్టి, నాటి ఆర్థిక నియమాల్లో ఇప్పటికీ మీకు ఉపయోగ పడుతున్నవేంటి..? మీ పురోగతికి అడ్డుపడుతున్నవేంటి..? అని బేరీజు వేసుకోండి.

డబ్బు ఖర్చు, నిర్వహణ, పొదుపు లాంటి విషయాలను ప్రధానంగా మన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆ తర్వాత బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి నేర్చుకుంటుంటాం. సామాజిక ఆమోదంతో పాటు భద్రమైనవి కాబట్టి వారి సలహాలు, నియమాలనే మనమూ అనుసరిస్తుంటాం. కానీ, కాలంతో పాటు మన జీవనశైలితో సహా మార్కెట్లో పరిస్థితులు, ఆర్థిక అవసరాలూ వేగంగా మారుతూ వస్తున్నాయి. కాబట్టి, పొదుపు-పెట్టుబడులకు సంబంధించి నాటి ఆర్థిక నియమాలు నేడూ ఆచరణీయమా కాదా అని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ ఆర్థిక పురోగమనం, లక్ష్యాల సాధనకు అవరోధంగా మారిన నియమమైనా, సలహానైనా పక్కన పెట్టి.. నేటి కాలంలో ఉత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవడంపై దృష్టి సారించండి. ప్రస్తుత తరం వారు సమీక్షించుకోవాల్సిన పెద్దల ఆర్థిక సలహాలు, నియమాల్లో కొన్ని మీకోసం..

ఎఫ్‌డీతో భద్రత సరే.. సొమ్ము వృద్ధి మాటేమిటి?

సొమ్ము భద్రంగా ఉండాలంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) లేదా సేవింగ్‌ ఖాతాలో జమ చేయాలన్నది పెద్దలిచ్చే సలహా. ఇప్పటికీ వీటిల్లో జమ చేసిన సొమ్ముకు భద్రతకు ఢోకా లేదు. కానీ, ధరాఘాతం ప్రభావంతో వాటిల్లో దాచుకున్న డబ్బు విలువ పెరుగుదలకు అవకాశాలు పూర్తిగా సన్నగిల్లిపోయాయి. ఎందుకంటే, ఏటేటా ధరలు వేగంగా పెరుగుతూ పోతుండగా.. గడిచిన కొన్నేళ్లలో సేవింగ్‌ అకౌంట్‌ లేదా ఎఫ్‌డీపై బ్యాంక్‌లు చెల్లించే వార్షిక వడ్డీ గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత ధరల వార్షిక పెరుగుదల 6-7 శాతంగా ఉండగా.. ఎఫ్‌డీపైనా బ్యాంక్‌లు కాలపరిమితి బట్టి గరిష్ఠంగా 7 శాతం వరకు (సీనియర్‌ సిటిజన్లు మినహాయించి) వడ్డీ చెల్లిస్తున్నాయి. ధరాఘాతం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు మీ ఎఫ్‌డీ సొమ్ము వృద్ధి దాదాపు సున్నా. నేటి కాలంలో సంపద పెరగాలంటే, పెట్టుబడికి భద్రతతో పాటు విలువ వృద్ధికీ సమ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.


అప్పులకు ఆమడ దూరం అక్కర్లేదు..

అప్పుకు ఆమడ దూరంగా ఉండాలన్నది పెద్దల మాట. అనాలోచితంగా, అవసరం లేకపోయినా అధిక వడ్డీకి అప్పు తీసుకోవడం ముమ్మాటికీ తప్పే. కానీ, వ్యాపారం లేదా ఉన్నత విద్య లేదా భవిష్యత్‌ వృద్ధికి బాటలు వేయగలిగే ఏ పని కోసమైనా రుణం తీసుకోవడం తెలివైన నిర్ణయం. అయితే, తిరిగి చెల్లించగలిగే సామర్థ్యానికి అనుగుణంగా, వీలైనంత తక్కువ వడ్డీకి రుణం పొందడం ఉత్తమం.

షేర్లలో పెట్టుబడి జూదమేమీ కాదు..

స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టి బాగా నష్టపోయారు లేదా దివాలా తీశారని అడపాదడపా వింటూనే ఉంటాం. వారంతా సరైన వ్యూహం, మార్గ నిర్దేశం లేకుండా పెట్టుబడులు పెట్టినవారే. అర్హులైన ఆర్థిక సలహాదారుల పర్యవేక్షణలో, దీర్ఘకాలిక వ్యూహంతో, క్రమశిక్షణతో మార్కెట్‌ డేటా ఆధారంగా షేర్లలో పెట్టుబడులు మీకు ఆకర్షణీయ ప్రతిఫలాలు అందించగలవు. స్టాక్‌ మార్కెట్‌పై పూర్తి అవగాహన లేని పక్షంలో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోనూ ఇన్వెస్ట్‌ చేయవచ్చు. క్రమానుగత పెట్టుబడి పథకాలైతే (సిప్‌) మరింత మేలు.

అద్దె.. వ్యర్థమంటే ఎలా..?

సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. చిన్నదో పెద్దదో మనకంటూ ఓ ఇళ్లు ఉంటే జీవితానికి స్థిరత్వం. భద్రత కూడా. పైగా, ఆ సంతృప్తే వేరు. కానీ, మార్కెట్లో ఇళ్లు, ఫ్లాట్స్‌, ప్లాట్ల ధరలు సగటు జీవి భరించలేనంత భారీగా పెరిగాయి. హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లోనైతే అపార్ట్‌మెంట్ల ఎత్తుతో పాటు వాటి రేట్లూ ఆకాశాన్నంటుతున్నాయి. కాబట్టి, గృహం కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేనప్పుడు, అద్దె ఇంట్లో జీవించడమే మంచి ప్రత్యామ్నాయం. అద్దె ఇళ్లు మీకు వెసులుబాటుతో పాటు నిర్వహణ భారాన్నీ తగ్గిస్తుంది. పైగా, జీవితంలోని ఇతర అవసరాలకూ ఆదా చేసే అవకాశమూ కల్పిస్తుంది.


బీమాతో జీవితానికి ధీమా.. సంపద వృద్ధికి కాదు..

అందరికీ బీమా అవసరమే. బీమాతో మీ జీవితం, ఆరోగ్యానికి ధీమా లభిస్తుంది. అయితే, చాలా మంది ఏజెంట్లు ఎండోమెంట్‌, మనీబ్యాక్‌ పాలసీలను భద్రమైన పెట్టుబడి సాధనాలంటూ నమ్మబలికి అవసరం లేనివారికీ అంటగడుతుంటారు. కానీ, వీటిల్లో పెట్టుబడులపై లభించే వార్షిక రిటర్ను కేవలం 4-5 శాతమే. ధరాఘాత ప్రభావాన్ని (ఏటేటా 6-7 శాతం ధరల పెరుగుదల) పరిగణలోకి తీసుకుంటే, పాలసీ గడువు తీరాక లభించే ప్రతిఫలం మైనస్‌ 1-2 శాతం. కాబట్టి, బీమా అవసరాన్ని పెట్టుబడితో ముడిపెట్టకుండా ఉండటం మేలు.

ఆనక ఆదా.. వద్దబ్బా!

సాధారణంగా భారతీయులు పెళ్లి, విద్య, ఇంటి కోసం అధికంగా వెచ్చిస్తారు. వీటి కోసం కొందరు పొదుపును కూడా త్యాగం చేస్తారు. కానీ, రిటైర్మెంట్‌ అనంతరం అవసరమైన డబ్బును యవ్వనం నుంచే ఆదా చేయడం ప్రారంభించాలి. ఏదో ఒక అవసరం కోసం రిటైర్మెంట్‌ పొదుపును విస్మరించడం లేదా ఆలస్యం చేయవద్దు. ఆర్జించడం ఆరంభించినప్పటి నుంచే ఇందుకోసం ఎంతో కొంత సొమ్మును క్రమానుగుత పెట్టుబడి పథకాల్లో (సిప్‌) పెడితే, 20-30 ఏళ్లకు భారీ రిటర్నులు అందుకునే అవకాశాలుంటాయి.

కేవలం ఆదా చేస్తే సరిపోదు..

వృధా ఖర్చులు తగ్గించి వీలైనంత ఆదా చేయాలని చెప్తుంటారు పెద్దలు. ఇది ముమ్మాటికీ నిజమే. కానీ, నేటి కాలంలో కేవలం ఆదా చేస్తే సరిపోదు. మీ ఆదాయాన్ని వీలైనంత పెంచుకునేందుకూ కృషి చేయాలి. మిత వ్యయం- అధికాదాయంతో మరింతగా కూడబెట్టవచ్చు. అది మాత్రమే సరిపోదు. ఆదా సొమ్మును తెలివిగా పెట్టుబడి పెడితేనే సంపద వృద్ధిని చూడగలం. భవిష్యత్‌ అవసరాలకు సిద్ధం కాగలం.

Updated Date - Jan 18 , 2026 | 03:02 AM