రిలయన్స్ రికార్డు లాభం
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:48 AM
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. కంపెనీ ఆల్‌టైం రికార్డు స్థాయి త్రైమాసిక లాభం, ఆదాయాన్ని ప్రకటించింది.
ఆదాయంలో 28 శాతం వృద్ధి.. రూ.3.62 లక్షల కోట్లకు చేరిక
కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక లాభం, రాబడి
కలిసొచ్చిన చమురు శుద్ధి, టెలికాం సేవల వ్యాపారాలు
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. కంపెనీ ఆల్‌టైం రికార్డు స్థాయి త్రైమాసిక లాభం, ఆదాయాన్ని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) ఆర్‌ఐఎల్ ఏకీకృత నికర లాభం వార్షిక ప్రాతిపదికన 33.8 శాతం వృద్ధి చెంది రూ.29,550 కోట్లకు చేరుకుంది. కంపెనీ చమురు శుద్ధి మార్జిన్లు భారీగా పుంజుకోవడంతో పాటు జియో వ్యాపారంలో మెరుగైన వృద్ధి ఇందుకు ప్రధానంగా దోహదపడ్డాయి. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి కంపెనీ రూ.22,092 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో (క్యూ1) లాభం రూ.20,946 కోట్లుగా ఉంది. కాగా, ఈ క్యూ2లో కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ (ఈపీఎస్) వార్షిక ప్రాతిపదికన రూ.13.42 నుంచి రూ.18.88కు చేరుకుంది. ఇకపోతే, క్యూ2లో కంపెనీ ఏకీకృత ఆదాయం దాదాపు 28 శాతం ఎగబాకి రూ.3,62,268 కోట్లకు పెరిగింది. ఎబిటా 23.9 శాతం వృద్ధితో రూ.62,409 కోట్లుగా నమోదైంది. సెప్టెంబరుతో ముగిసిన ప్రథమార్ధానికి ఆర్‌ఐఎల్ ఏకీకృత నికర లాభం రూ.52,746 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి లాభం రూ.43,951 కోట్లుగా ఉంది. జాన్ చివరి నాటికి రూ.1,22,914 కోట్లుగా ఉన్న కంపెనీ నికర రుణ భారం.. సెప్టెంబరు 30 నాటికి రూ.1,17,140 కోట్లకు తగ్గింది.
ఓ2సీ ఆదాయం జూమ్
రిలయన్స్ ప్రధాన వ్యాపార విభాగమైన ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) పనితీరు భారీగా పుంజుకుంది. ఈ క్యూ2లో ఓ2సీ ఎబిటా ఏకంగా 67.9 శాతం ఎగబాకి రూ.25,203 కోట్లకు చేరగా.. ఆదాయం 44.2 శాతం పెరిగి రూ.2,31,601 కోట్లుగా నమోదైంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అసాధారణంగా పెరిగినప్పటికీ, చమురు సేకరణలో వివిధీకరణ వ్యూహాలతో రిఫైనింగ్ ప్రక్రియలో తమ మార్జిన్లను గణనీయంగా పెంచుకోవటం ఈ విభాగం రికార్డు పనితీరుకు దోహదపడిందని కంపెనీ పేర్కొంది.
రిలయన్స్ రిటైల్ నిరాశాజనకం
రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్) పనితీరు మాత్రం నిరాశపరిచింది. ఈ క్యూ2లో కంపెనీ మొత్తం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 6.4 శాతం పెరిగి రూ.91,716 కోట్లకు చేరుకున్నప్పటికీ, నికర లాభం మాత్రం 24.5 శాతం తగ్గి రూ.2,619 కోట్లకు పరిమితమైంది. సెప్టెంబరు 30 నాటికి కంపెనీ మొత్తం స్టోర్ల సంఖ్య 19,947గా ఉంది.
ఆయిల్ అండ్ గ్యాస్
కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి వ్యాపార విభాగ ఆదాయం క్యూ2లో 0.6 శాతం తగ్గి రూ.6,020 కోట్లకు పరిమితమైంది. ఎబిటా 2 శాతం తగ్గుదలతో రూ.4,901 కోట్లుగా నమోదైంది. కేజీ బేసిన్‌లో గ్యాస్ ఉత్పత్తి తగ్గడంతో పాటు మార్కెట్లో దానికి లభించే ధర తగ్గడం, ప్రభుత్వ పన్నులు ఇందుకు కారణమయ్యాయి.
జియోస్టార్
రిలయన్స్ మీడియా వ్యాపార విభాగమైన జియోస్టార్ స్థూల ఆదాయం ఈ క్యూ2లో 9.8 శాతం పెరిగి రూ.7,944 కోట్లకు ఎగబాకినప్పటికీ, ఎబిటా మాత్రం వార్షిక ప్రాతిపదికన 13.6 శాతం తగ్గి రూ.1,502 కోట్లకు పరిమితమైంది. ప్రకటనల ఆదాయం బలహీనపడటం ఇందుకు కారణం.
రూ.15,000 కోట్ల సమీకరణ
ఒకేసారి లేదా విడతల వారీగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) జారీ ద్వారా రూ.15,000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ఆర్‌ఐఎల్ వెల్ల డించింది. ఈ ప్రతిపాదనను బోర్డు ఆమోదించిందని తెలిపింది. ఈ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలోనూ కంపెనీ ఎన్‌సీడీల జారీ ద్వారా రూ.12,000 కోట్లు సమీకరించింది.
క్యూ2లో 34 శాతం వృద్ధితో రూ.29,550 కోట్లుగా నమోదు
జియో లాభం రూ.8,389 కోట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ సేవల అనుబంధ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్).. సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో రూ.8,389 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.7,379 కోట్ల లాభంతో పోలిస్తే 13.7 శాతం వృద్ధిని కనబరిచింది. ఈ క్యూ2లో కంపెనీ ఏకీకృత ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.4 శాతం పెరిగి రూ.40,475 కోట్లకు చేరింది. ఈ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంతో పోలిస్తే, సంస్థ లాభం 8 శాతం, ఆదాయం 3.3 శాతం పెరిగింది. కంపెనీ తన షేర్లను బుధవారమే స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల్లో నమోదు చేసింది. మార్కెట్ లిస్టింగ్ తర్వాత సంస్థ విడుదల చేసిన తొలి ఆర్థిక ఫలితాలివే. గడిచిన మూడు నెలల్లో జియో నెట్‌వర్క్‌లోని కస్టమర్ల సంఖ్య మరో 91 లక్షల పెరుగుదలతో మొత్తం 54.24 కోట్లకు చేరుకుంది. అందులో 5జీ యూజర్ల సంఖ్య 30 కోట్లకు చేరింది. కాగా, కంపెనీకి ఒక్కో వినియోగదారు నుంచి లభించిన నెలవారీ ఆదాయ సగటు (ఆర్పూ) రూ.218.8కి పెరిగింది. ఈ క్యూ1లో ఇది రూ.215.6గా నమోదైంది. కంపెనీ యూజర్ల తలసరి డేటా వినియోగం నెలకు 44.2 జీబీకి చేరగా.. క్యూ2లో మొత్తం డేటా రద్దీ వార్షిక ప్రాతిపదికన 21 శాతం పెరిగి 71.3 బిలియన్ జీబీలుగా నమోదైంది.