Share News

అల్యూమినియం ఉత్పత్తిలోకి రిలయన్స్‌!

ABN , Publish Date - Aug 27 , 2026 | 06:35 AM

ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఇక అల్యూమినియం ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

అల్యూమినియం ఉత్పత్తిలోకి రిలయన్స్‌!

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఇక అల్యూమినియం ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ప్రతిపాదన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. అల్యూమినియం తయారీకి అవసరమైన ముడి పదార్థం బాక్సైట్‌. ఒడిశాలోని కర్లాపట్‌ బాక్సైట్‌ గని కోసం జరిగిన వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్‌ రూ.5 లక్షలతో టెండర్‌ డాక్యుమెంట్‌ను సైతం కొనుగోలు చేసింది. అయితే, ఈ బ్లాక్‌ను వేదాంత అల్యూమినియం అనుబంధ విభాగమైన బాల్కో దక్కించుకుంది.


కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుకు అనుబంధంగా: ఆర్‌ఐఎల్‌ ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్‌లో రెండు బొగ్గు గనులను వేలంలో దక్కించుకుంది. అక్కడ కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్లాంట్‌ బొగ్గును సింఽథసిస్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్‌ను విద్యుత్‌ ఉత్పత్తికి లేదా పారిశ్రామిక ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌ను అల్యూమినియం సహా ఇతర లోహాల ఉత్పత్తికి వినియోగించుకోవాలని రిలయన్స్‌ భావిస్తున్నట్లు తెలిసింది.


అదానీతో పోటీ: గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ కొన్ని నెలల క్రితమే ఈ లోహ వ్యాపారంలోకి ప్రవేశించింది. యూఏఈ కంపెనీ భాగస్వామ్యంలో ఒడిశాలో 20 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యంతో కూడిన అల్యూమినియం ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు, ఇందుకోసం 1,150 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.10 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ జూన్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రకటించింది. తాజాగా అదానీకి పోటీగా రిలయన్స్‌ కూడా ఇందులోకి అడుగు పెట్టాలని భావిస్తుండటం గమనార్హం.

Updated Date - Aug 27 , 2026 | 06:47 AM