Share News

‘ఏటీఎం’ల్లో నిండుకుంటున్న నగదు

ABN , Publish Date - Jul 08 , 2026 | 06:00 AM

ఏటీఎంలు రావటంతో బ్యాంకు శాఖలకు వెళ్లి నగదు తీసుకునే శ్రమ తప్పింది. అయితే ఇప్పుడు కొన్ని నగరాల్లోని ఏటీఎంల్లో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోని ఏటీఎంల్లో...

‘ఏటీఎం’ల్లో నిండుకుంటున్న నగదు

బ్యాంకులను వివరణ కోరిన ఆర్‌బీఐ

ద్వితీయ, చిన్న నగరాల్లో ఇక్కట్లు

ఏపీ, తెలంగాణల్లో మరింత ఎక్కువ

ముంబై: ఏటీఎంలు రావటంతో బ్యాంకు శాఖలకు వెళ్లి నగదు తీసుకునే శ్రమ తప్పింది. అయితే ఇప్పుడు కొన్ని నగరాల్లోని ఏటీఎంల్లో ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న పట్టణాల్లోని ఏటీఎంల్లో బ్యాంకులు వెంటనే, సరిపడా నగదు నిల్వలు ఉంచడం లేదంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గత మూడు నెలలుగా ఈ సమస్య మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లోని ద్వితీయ శ్రేణి నగరాలు, చిన్న నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో ఈ నగరాల్లోని బ్యాంకు ఖాతాదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ)కు కూడా చేరింది. దీంతో ఏటీఎంలలో నగదు నింపే బ్యాంకుల శాఖల్లో నగదు నిల్వలపై నివేదిక ఇవ్వాలని ఆర్‌బీఐ.. బ్యాంకులను కోరినట్టు సమాచారం.

‘సీఏటీఎంఐ’ అదే మాట

ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో ఏటీఎంల్లో నగదు కొరత మరింత తీవ్రంగా కనిపించింది. కొన్ని నగరాల్లోని ఏటీఎంలలో నగదు నిల్వలు, వాటి సగటు సామర్థ్యంలో 57 నుంచి 64 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఏటీఎం ఇండస్ట్రీ (సీఏటీఎంఐ) కూడా గత నెలలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ)కు ఫిర్యాదు చేసింది. దీనిపైనా ఆర్‌బీఐ దృష్టి పెట్టింది. ఈ ఫిర్యాదులు నిజమని తేలితే బ్యాంకులపై ఆర్‌బీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ నగదు కొరత నగదు నిర్వహణ కంపెనీల వ్యాపారాన్నీ దెబ్బతీస్తోంది. ఏటీఎంల్లో నింపడానికి బ్యాంకుల నుంచి తమకు సరిపడా నగదు అందక నష్టపోతున్నట్టు ఈ కంపెనీలు చెబుతున్నాయి.


మా కష్టాలు మావి..

ఈ ఫిర్యాదుల నేపథ్యంలో బ్యాంకులు తమ కష్టాలను వెళ్లగక్కుతున్నాయి. బ్రాంచీల్లో ఉండే నగదు నిల్వలన్నీ ఏటీఎంల్లో నింపేందుకు పనికి రావని స్పష్టం చేస్తున్నాయి. అందులో చినిగిపోయిన నోట్లు, చలామణికి పనికి రాని నోట్లు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఈ రెండు విషయాలను పరిగణనలోకి తీసుకుంటే తమ బ్రాంచీల్లో ఏటీఎంలలో నింపేందుకు అవసరమైన నగదు నిల్వలు చాలా తక్కువగా ఉంటాయని బ్యాంకింగ్‌ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు ఖర్చులు పెరిగిపోవడంతో ఏటీఎంల సంఖ్య పెంచడం కూడా పెద్ద సమస్యగా మారిందంటున్నారు.

ఇవి కూడా చదవండి..

రాణిస్తున్న బ్యాంకింగ్ షేర్లు.. స్వల్ప లాభాల్లో దేశీయ సూచీలు

Updated Date - Jul 08 , 2026 | 06:00 AM