ఆర్‌బీఐ ఫారెక్స్ ‘రక్షణ’ చర్యలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:15 AM
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తరిగిపోవడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ను భయపెడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు...
పసిడి అమ్మకాలతో డాలర్ల సమీకరణ
ఇప్పటికే రూ.1,14 లక్షల కోట్ల విలువైన బంగారం విక్రయం
ముంబై: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత విదేశీ మారక ద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తరిగిపోవడం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)ను భయపెడుతోంది. దీనికి చెక్ పెట్టేందుకు కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న పసిడి నిల్వల్లో కొంత భాగాన్ని అమ్మి డాలర్లు వెనకేస్తోంది. గత నెల 22తో ముగిసిన రెండు వారాల్లో ఆర్‌బీఐ 1,200 కోట్ల డాలర్ల (సుమారు రూ.1.14 లక్షల కోట్లు) విలువైన బంగారాన్ని విక్రయించింది. ఇందులో 750 కోట్ల డాలర్లను ఫారెక్స్ నిల్వల్లో జమ చేసినట్టు ‘బ్లూంబర్గ్ ఎకనామిక్స్’ వార్తా సంస్థ తెలిపింది.
వెండి దిగుమతులు మరింత కఠినం
ఫారెక్స్ నిల్వల పరిరక్షణలో భాగంగా వెండి దిగుమతులను ప్రభుత్వం మరింత కఠినం చేసింది. ఎవరైనా ఆర్‌బీఐ నామినేట్ చేసిన ఏజెన్సీలు, విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ (డీజీఎ్‌ఫటీ) ఆమోదిత సంస్థలు, ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్ఛేంజీ (ఐఐబీఈ) ద్వారా వెండి దిగుమతి చేసుకోవాలన్నా చెల్లుబాటయ్యే అనుమతి పత్రాలు తప్పనిసరని స్పష్టం చేసింది. ఈ అనుమతి పత్రాలను డీజీఎ్‌ఫటీ మాత్రమే జారీ చేస్తుందని పేర్కొంది. దీంతో దేశంలోకి వెండి దిగుమతులు మరింత కష్టం కానున్నాయి. బంగారం, వెండి దిగుమతులను కట్టడి చేసే వ్యూహంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే ఈ రెండు లోహాల దిగుమతులపై ఉన్న దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 16 శాతానికి పెంచింది.
ఎందుకంటే?
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు భారీగా పెరగటంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. మరోవైపు స్టాక్ మార్కెట్.. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల హోరుతో ‘బేర్’మంటోంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగి పరిశ్రమలూ కుదేలవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరల పెంపుతో రిటైల్ ద్రవ్యోల్బణం పైకి ఎగబాకుతోంది. దీంతో ఫారెక్స్ నిల్వలు రోజురోజుకీ కుదించుకు పోతున్నాయి.
ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న 830 టన్నుల బంగారం నిల్వల్లో కొంత భాగాన్ని అమ్మి ఫారెక్స్ నిల్వలు పెంచుకోవాలని ఆర్‌బీఐ భావిస్తోందని బ్లూంబర్గ్ ఎకనామిక్స్ తెలిపింది. ఇలా చేయడం ద్వారా డాలర్‌తో రూపాయి మారకం రేటు పతనానికి కొంత వరకు చెక్ పెట్టవచ్చని ఆర్‌బీఐ భావిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్‌తో చర్చలు సానుకూలం: ట్రంప్
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..