ఆగస్టులో అన్నీ ప్రియం!
ABN , Publish Date - Jul 29 , 2026 | 03:18 AM
పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో కంపెనీలు మరోసారి వస్తువుల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పండగల సీజన్‌కు ముందే మార్కెట్లో ఉత్పత్తులు మరింత ప్రియం కానున్నాయి...
టీ పొడి నుంచి టీవీల వరకు..
ఫోన్ల నుంచి కార్ల వరకు..
ఇప్పటికే ప్రకటించిన మారుతి సుజుకీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో కంపెనీలు మరోసారి వస్తువుల ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పండగల సీజన్‌కు ముందే మార్కెట్లో ఉత్పత్తులు మరింత ప్రియం కానున్నాయి. ఈ ఆగస్టు నుంచి మార్కెట్‌లో టీ పొడి, హెయిర్ ఆయిల్‌తోపాటు టీవీలు, కార్లు, దుస్తులు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌ఫోన్ల ధరలు 6 నుంచి 8 శాతం వరకు పెరిగే అవకాశాలున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో ముడి సరుకుల ధరలు, రవాణా ఖర్చులు పెరిగిపోవడం, రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి.
మూడోసారి..
ఫిబ్రవరి 28న గల్ఫ్‌లో ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి దేశీయ కంపెనీలు ఇప్పటికే రెండుసార్లు ఉత్పత్తుల ధరలు పెంచాయి. వచ్చే నెలలో మూడో పెంపునకూ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ‘పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా డాలర్‌తో రూపాయి మారకం రేటు తీవ్ర ఆటు పోట్లకు లోనవుతోంది. ముడి చమురు, ఇతర కమోడిటీల ధరలూ భారీగా పెరిగాయి. ఈ నేపథ్యలో మా ఉత్పత్తుల ధరలు పెంచక తప్పడం లేదు’ అని ఓ కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ గూడ్స్ కంపెనీ సీఈఓ చెప్పారు.
పండగ సీజన్‌కు ముందే బాదుడు
ఆగస్టు నుంచి కార్ల ధరలూ పెరగనున్నాయి. మోడల్‌ను బట్టి తమ కార్ల రేటును రూ.30,000 వరకు పెంచబోతున్నట్టు మార్కెట్ లీడర్ మారుతి సుజుకీ ఇప్పటికే ప్రకటించింది. పెరిగిన ఉత్పత్తి వ్యయంలో కొంతైనా రాబట్టుకోవాలంటే ఈ పెంపు తప్పదని కంపెనీ ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం మారుతి సుజుకీ ధరలు పెంచడం ఇది రెండోసారి. హోండా కూడా ఆగస్టు 1 నుంచే వాహన రేట్లను పెంచుతున్నట్టు తెలిపింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రానైతే ఈ నెల ప్రారంభంలోనే పెంచేశాయి. లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఇప్పటికే కార్ల ధరలను 4 శాతం పెంచింది. మరోమారు పెంచేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ విడత ఎంత అనేది డాలర్-రూపాయి మారకం రేటును బట్టి ఉంటుందని కంపెనీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఎఫ్‌ఎంసీజీ
గల్ఫ్ యుద్ధ ప్రభావం మిగతా పరిశ్రమలపై కంటే ఎఫ్‌ఎంసీజీపై మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెట్రోలియం ముడి పదార్ధాలపై ఆధారపడిన కంపెనీలు కుంగిపోతున్నాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ కన్స్యూమర్ కేర్ కంపెనీల ఉన్నతాధికారులు ఇదే విషయాన్ని చెప్పారు. తమ ఉత్పత్తుల ధరలు పెంచకపోతే సెప్టెంబరు త్రైమాసిక లాభాలకు భారీగా గండిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముడి చమురుతో పాటు ఆవ నూనె, బాదం నూనెల ధరలు కొండెక్కడమూ ఈ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. ఆగస్టులో ధరలను మరింత పెంచాల్సి రావచ్చని కంపెనీలు చెబుతున్నాయి. జూన్ త్రైమాసికంలో తన ఉత్పత్తుల ధరలను 2-5 శాతం శ్రేణిలో పెంచిన ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్.. సెప్టెంబరు క్వార్టర్‌లో మరింత పెంచక తప్పదని మంగళవారం త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా స్పష్టమైన సంకేతాలిచ్చింది. ‘‘ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మా లాభాలు కొంత తగ్గాయి. ఆ లోటును ఈ త్రైమాసికంలో భర్తీ చేసుకుంటాం. ఇందుకోసం అన్ని ఉత్పత్తుల ధరలు ఎంతో కొంత పెంచక తప్పదు’’ అని హెచ్‌యూఎల్ ఎండీ, సీఈఓ ప్రియా నాయర్ అన్నారు.
శాతం వరకు పెరగనున్న ధరలు
కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్‌పై 4-6 శాతం పెంపు
కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ ధరలు ఆగస్టులో నాలుగు నుంచి ఆరు శాతం పెరిగే అవకాశాలున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు ఈ సంవత్సరంలో ఇప్పటికే 10 శాతానికి పైగా పెరిగాయి. స్మార్ట్ టీవీలూ 15 శాతానికిపైగా పెరిగాయి. మెమొరీ చిప్‌ల కొరత ఇందుకు ప్రఽధాన కారణం. గత 8-9 నెలల్లో చిప్‌ల ధర మూడింతలకుపైగా పెరిగింది. దీంతో పండగల సీజన్‌కు ముందే స్మార్ట్‌ఫోన్ల ధరలూ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దుస్తుల కంపెనీలదీ ఇదే పరిస్థితి.
ఇవి కూడా చదవండి..
ఏదో మంచి జరిగే అవకాశం ఉంది.. ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఆశాభావం..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..