Share News

ఆరోగ్య బీమాలో ఏ పాలసీ బెటర్‌?

ABN , Publish Date - Mar 01 , 2026 | 05:09 AM

వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ కింద.. ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి ఆరోగ్య సమస్యలకు మాత్రమే బీమా కవరేజీ లభిస్తుంది. ఉదాహరణకు ముగ్గురు కుటుంబ సభ్యులు ఎవరికి

ఆరోగ్య బీమాలో ఏ పాలసీ బెటర్‌?

ఫ్లోటర్‌ లేదా వ్యక్తిగత పాలసీనా..

వైద్య ఖర్చులు ఏటికేటికి పెరిగి పోతున్నాయి. ఈ ఖర్చులు తట్టుకోవడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. దీంతో ఆరోగ్య బీమా పాలసీలకు గిరాకీ పెరుగుతోంది. అయితే చాలా మందికి ఆరోగ్య బీమా పాలసీని ఎలా ఎంచుకోవాలనే దానిపై స్పష్టత లేదు. బీమా కంపెనీ ఏజెంట్లు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మి పాలసీలు తీసుకుంటారు. తీరా అవసరం వచ్చే సరికి ఆరోగ్య బీమా పాలసీ ఉన్నా సరైన కవరేజీ లభించలేదని నెత్తీ నోరు బాదుకుంటారు. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే పాలసీ తీసుకునే ముందే ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీ తీసుకోవాలా? లేక వ్యక్తిగత ఆరోగ్య పాలసీ తీసుకోవాలా? అని ఆలోచించుకోవాలి.

వ్యక్తిగత పాలసీలు

వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ కింద.. ఆ పాలసీ తీసుకున్న వ్యక్తి ఆరోగ్య సమస్యలకు మాత్రమే బీమా కవరేజీ లభిస్తుంది. ఉదాహరణకు ముగ్గురు కుటుంబ సభ్యులు ఎవరికి వారు రూ.10 లక్షలకు వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నారు అనుకుందాం. ఆ ముగ్గురిలో ఎవరికి అనారోగ్య సమస్య వచ్చినా, పాలసీ షరతులకు లోబడి ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు బీమా రక్షణ లభిస్తుంది.


ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీలు

ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీల ద్వారా కుటుంబ సభ్యులు అందరికీ ఒకే పాలసీ ద్వారా ఆరోగ్య బీమా రక్షణ కవరేజీ లభిస్తుంది. కుటుంబ సభ్యుల వయసు, ఆరోగ్య సమస్యలను బట్టి ప్రీమియం మారుతుంది. ఉదాహరణకు నలుగురు సభ్యుల కుటుంబం ఒక సంవత్సరానికి వర్తించేలా రూ.10 లక్షల కవరేజీ కోసం ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. వీరిలో ఎవరైనా ఒకరు రోగాల బారిన పడి రూ.6 లక్షలు ఖర్చయ్యాయి. ఆ మొత్తాన్ని బీమా కంపెనీ చెల్లించింది. ఇక మిగిలేది రూ.4 లక్షలు మాత్రమే. అప్పుడు మిగతా ముగ్గురు కుటుంబ సభ్యుల కవరేజీ రూ.4 లక్షలకు పడిపోతుంది. ఇక్కడ కుటుంబమంటే భార్య, భర్త, వారి పిల్లలు, తల్లిదండ్రులు అని అర్థం చేసుకోవాలి. ఫ్లోటింగ్‌ పాలసీల ద్వారా కుటుంబ సభ్యులు అందరికీ, వ్యక్తిగత పాలసీల ద్వారా ఆయా వ్యక్తుల ఆరోగ్య సమస్యలకు మాత్రమే బీమా కవరేజీ లభిస్తుంది.

ప్రీమియం

ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం 35 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు పెద్దలు, మూడు నుంచి ఐదేళ్ల వయసు ఉన్న ఇద్దరు పిల్లలు ఉండే కుటుంబానికి ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీ తీసుకోవాలి అనుకుందాం. బీమా కంపెనీల నిబంధనల ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలకు వ్యక్తిగత ఆరోగ్య పాలసీలు ఇవ్వరు. కాబట్టి ఈ కుటుంబం తప్పనిసరిగా ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాల్సిందే. అందుకోసం ఏటా రూ.10 లక్షల కవరేజీ కోసం రూ.20,000, రూ.15 లక్షల కవరేజీ కావాలంటే రూ.23,000, రూ.20 లక్షల కవరేజి కోసం రూ.25,000 ప్రీమియంగా చెల్లించాలి.


ఏ పాలసీ ఎవరికి అనుకూలం?

కుటుంబ సభ్యులు, వారి వయసు, ఆరోగ్య సమస్యల ఆధారంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలా? లేక ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీ తీసుకోవాలా? అనే విషయం నిర్ణయించుకోవాలి. కుటుంబ సభ్యులు అందరూ తక్కువ వయసులో ఉండి, ఆరోగ్య సమస్యలు లేకపోతే ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీ తీసుకోవటం మంచిది. అయితే కుటుంబంలో బీపీ, షుగర్‌ లాంటి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆరు పదుల వయసు నిండిన తల్లిదండ్రులు ఉంటే, వారి కోసం ప్రత్యేకంగా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోవడమే మంచిది. మూడు పదుల వయసులో ఉన్న దంపతులు, 18 ఏళ్ల వయసులోపు పిల్లలు ఉన్న కుటుంబాలు మాత్రం ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీనే ఎంచుకోవాలి.

ఎవరికి మేలు

సీనియర్‌ సిటిజన్లు లేకుండా 18 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలు, 30 ఏళ్ల లోపు దంపతులు ఫ్లోటింగ్‌ పాలసీ తీసుకుంటే ప్రీమియం కూడా తక్కువగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీరంతా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారై ఉండాలి. దీనివల్ల వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలతో పోలిస్తే.. ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీల ప్రీమియం చెల్లింపులు 35 నుంచి 60 శాతం తక్కువగా ఉంటాయి.


చూడాల్సిన అంశాలు

  • ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి ఈ అంశాలను గుర్తుంచుకోవాలి.

  • కుటుంబ సభ్యుల సంఖ్య, వారి వయసు జూ సభ్యుల ఆరోగ్య సమస్యలు

  • వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీల మధ్య ప్రీమియం వ్యత్యాసం

ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీతో చిక్కులు

ఉదాహరణకు ఒక కుటుంబం రూ.10 లక్షల కవరేజీకి ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీ తీసుకుంది. ఆ కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి కవరేజీ పరిమితి మొత్తం ఖర్చయి పోయింది. అదే సమయంలో కుటుంబంలోని ఇంకొకరికి అనారోగ్య సమస్య వస్తే, ఆ పాలసీ కింద ఎలాంటి కవరేజీ లభించదు. మిగతా కుటుంబ సభ్యులకు అయ్యే వైద్య ఖర్చులు మొత్తాన్ని జేబులోంచే ఖర్చు పెట్టుకోవాలి. దీనికి తోడు ఫ్యామిలీ ఫ్లోటింగ్‌ పాలసీల ప్రీమియం కుటుంబ సభ్యుల వయసుతో పాటు ఏటా పెరుగుతుంది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య బీమా పాలసీలను ఎంచుకోవాలి. దీనిపై అవగాహన లేకపోతే మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న బీమా సలహాదారులను సంప్రదించడం మంచిది.

Updated Date - Mar 01 , 2026 | 06:59 AM