సైబర్ భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి..
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:44 AM
సెబీతో పాటు దేశీయ ఆర్థిక సేవల రంగ నియంత్రణ సంస్థలన్నీ సైబర్ భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక.....
ఆర్థిక మంత్రి సీతారామన్
ముంబై: సెబీతో పాటు దేశీయ ఆర్థిక సేవల రంగ నియంత్రణ సంస్థలన్నీ సైబర్ భద్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అమెరికాకు చెందిన కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ఏఐ మోడల్ ‘క్లాడ్ మిథోస్’పై ప్రపంచ ఆర్థిక రంగం లో ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మిథోస్ పేరును ప్రస్తావించకుండానే, కొన్ని ఏఐ సాధనాలు సైబర్ దాడులను వేగవంతం చేశాయని, అనుకూలంగా మార్చాయని మంత్రి అన్నారు. గుర్తించడానికి సాధ్యం కాని వ్యూహాలతో దాడి చేసే సామర్థ్యాలను అవి కలిగి ఉన్నాయన్నారు. దాడులకు ఉపయోగించే సాంకేతిక సాధనాలు వేగంగా పుట్టుకొస్తున్న నేపథ్యంలో వాటిని అడ్డుకోగలిగే టూల్స్‌ను మరింత వేగంగా సృష్టించాల్సిన అవసరం ఉందని ముంబైలో శనివారం జరిగిన సెబీ 38వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి అన్నారు.
ఏంటీ క్లాడ్ మిథోస్: ఇది అత్యాధునిక హ్యాకింగ్ సామర్థ్యాలు కలిగిన ఏఐ మోడల్. దీన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురాబోమని.. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యాపిల్, ఎన్‌విడియా, జేపీ మోర్గాన్ వంటి ఎంపిక చేసిన 40 దిగ్గజ సంస్థలు తమ సైబర్ భద్రత స్థాయిని పరీక్షించుకునేందుకు మాత్రమే యాక్సెస్ కల్పిస్తామని ఆంథ్రోపిక్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, కొందరు అనధికార వ్యక్తులు మిథోస్ యాక్సెస్ పొందినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగ సంస్థ లు తమపై సైబర్ దాడి జరగవచ్చేమోనని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశీయ బ్యాంకిం గ్ రంగ ప్రతినిధులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసింది. మిథోస్‌తో ముప్పును అంచనా వేసేందుకు ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.