Share News

25,000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

ABN , Publish Date - Jan 26 , 2026 | 05:01 AM

గత వారం నిఫ్టీ 25,000 వద్ద మైనర్‌ రికవరీ సాధించినా నిలదొక్కుకోలేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరికి ముందు వారంతో పోల్చితే 645 పాయింట్ల నష్టంతో.....

25,000 వద్ద నిలదొక్కుకోవడం కీలకం

గత వారం నిఫ్టీ 25,000 వద్ద మైనర్‌ రికవరీ సాధించినా నిలదొక్కుకోలేక ఆటుపోట్లు ఎదుర్కొని చివరికి ముందు వారంతో పోల్చితే 645 పాయింట్ల నష్టంతో వారం కనిష్ఠ స్థాయిలో క్లోజయింది. గత కొద్ది రోజులుగా మార్కెట్‌ నిట్టనిలువుగా దిగజారినందు వల్ల తక్షణ అప్‌ట్రెండ్‌కు విరామం ఇచ్చినట్టే కనిపిస్తోంది. గత కొద్ది రోజుల్లో నిఫ్టీ 1,300 పాయింట్లు నష్టపోయింది. సానుకూలత కోసం 25,000 స్థాయిలో మద్దతు తీసుకుని కన్సాలిడేట్‌ కావలసి ఉంది. కాగా గత వారంలో మిడ్‌క్యాప్‌-100 సూచీ 2,720 పాయింట్లు, స్మాల్‌క్యాప్‌-100 సూచీ 1,000 పాయింట్లు నష్టపోయాయి. గత కొద్ది నెలల్లో ఏర్పడిన భారీ నష్టం ఇదే కావడం వల్ల మార్కెట్‌ ఏ స్థాయి లో మద్దతు తీసుకుంటుందో వేచి చూడాలి.

బుల్లిష్‌ స్థాయిలు: నిఫ్టీ పాజిటివ్‌ ట్రెండ్‌లో ట్రేడయినట్టయితే మైనర్‌ నిరోధ స్థాయిలు 25,150, 25,300. మరింత అప్‌ట్రెండ్‌ కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. ఆ పైన నిరోధ స్థాయి 25,500.

బేరిష్‌ స్థాయిలు: మార్కెట్‌ ప్రస్తుతం ప్రధాన మానసిక అవధి 25,000 సమీపంలో ఉంది. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకుని తీరాలి. విఫలమైతే స్వల్పకాలిక బలహీనత మరింతగా కొనసాగుతుంది. అప్రమత్తం కావాలి. ప్రధాన మద్దతు స్థాయులు 24,400, 24,300.

బ్యాంక్‌ నిఫ్టీ: ఈ సూచీ సైతం గత వారంలో 1,620 పాయింట్ల మేరకు దిగజారి 58,470 వద్ద బలహీనంగా ముగిసింది. కీలక స్థాయి 60,000 వద్ద సుదీర్ఘ పరీక్ష అనంతరం పోరాటాన్ని విరమించినట్టు కనిపిస్తోంది. ఇది స్వల్పకాలిక బలహీనత సంకేతం. టెక్నికల్‌ రికవరీ సాధించినట్టయితే ప్రధాన నిరోధం 59,000 వద్ద నిలదొక్కుకోవడం తప్పనిసరి. దిగువన మద్దతు స్థాయి 58,000.

పాటర్న్‌: మార్కెట్‌ ప్రస్తుతం 200 డిఎంఏ వద్ద పరీక్షకు సిద్ధం అవుతోంది. స్వల్పకాలిక ఓవర్‌సోల్డ్‌ పొజిషన్‌లోకి అడుగు పెడుతున్నందు వల్ల రికవరీకి ఆస్కారం ఉంది. మార్కెట్‌ ప్రస్తుతం 25,000 వద్ద ‘‘అడ్డంగా ఏర్పడిన సపోర్ట్‌ ట్రెండ్‌లైన్‌’’ వద్ద నిలిచి ఉంది. ట్రెండ్‌లో సానుకూలత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి.

టైమ్‌: ఈ సూచీ ప్రకారం గురువారం తదుపరి మైనర్‌ రివర్సల్స్‌ ఉండవచ్చు.

Updated Date - Jan 26 , 2026 | 05:01 AM