మళ్లీ 23,000 పైకి నిఫ్టీ
ABN , Publish Date - Oct 31 , 2026 | 01:29 AM
భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 591.55 పాయింట్ల వరకు ఎగబాకినప్పటికీ..
సెన్సెక్స్ 308 పాయింట్లు అప్
ముంబై: భారత స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒక దశలో 591.55 పాయింట్ల వరకు ఎగబాకినప్పటికీ, చివరికి 308.49 పాయింట్ల లాభంతో 74,459.53 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 116.35 పాయింట్ల వృద్ధితో 23,053.10 వద్ద ముగిసింది. ఐటీ రంగ షేర్లతో పాటు ఆశాజనక త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన ట్రెంట్ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. చిన్న, మధ్య స్థాయి షేర్లలో ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా బీఎ్‌సఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ సూచీ 2.09 శాతం, మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 0.63 శాతం నష్టపోయాయి. దాంతో బీఎ్‌సఈ మార్కెట్ క్యాప్ రూ.3.06 లక్షల కోట్లు తగ్గి రూ.474.37 లక్షల కోట్లకు (4.98 లక్షల కోట్ల డాలర్లు) పడిపోయింది.
సిల్వర్ రూ.8,300 డౌన్: దేశీయంగా వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.8,300 తగ్గుదలతో దాదాపు 11 నెలల కనిష్ఠ స్థాయి రూ.1,90,200కు జారుకుంది. 99.9 శాతం స్వచ్ఛత బంగా రం 10 గ్రాములు ధర రూ.1,300 తగ్గి రూ.1,45,200కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఒక దశలో 53.15 డాలర్ల (1.32 శాతం) మేర తగ్గి మూడున్నర నెలల కనిష్ఠ స్థాయి 3,968.24 డాలర్లకు జారుకుంది. వెండి ధర 4 శాతం క్షీణించి 50.12 డాలర్లకు పడిపోయింది.
రత్నదీప్ ఐపీఓకు సెబీ ఆమోదం: హైదరాబాద్‌కు చెందిన సూపర్ మార్కెట్ల నిర్వహణ సంస్థ రత్నదీప్ రిటైల్‌తో పాటు గృహోపకరణాల తయారీ సంస్థ ఆటంబర్గ్ టెక్నాలజీస్ ఐపీఓలకు సెబీ ఆమోదం తెలిపింది. ఐపీఓలో భాగంగా రత్నదీప్ రిటైల్ రూ.400 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు ప్రమోటర్ల వాటాకు చెందిన 1.49 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. ఆటంబర్గ్ రూ.450 కోట్ల తాజా ఈక్విటీ జారీతో పాటు 7.65 కోట్ల ఈక్విటీ షేర్లను ఓఎఫ్‌ఎస్ ద్వారా విక్రయించనుంది.
సీడీఎస్ఎల్‌పై రూ.కోటి జరిమానా: పలు నిబంధనలను అతిక్రమించినందుకు గాను సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సీడీఎ్‌సఎల్)పై సెబీ రూ.కోటి జరిమానా విధించింది. 45 రోజుల్లోగా ఈ పెనాల్టీని చెల్లించాలని, లేని పక్షంలో రికవరీ చర్యలు చేపడతామని నియంత్రణ మండలి స్పష్టం చేసింది.