టీసీఎస్ లాభం రూ.13,884 కోట్లు
ABN , Publish Date - Oct 09 , 2026 | 01:51 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాల సీజన్ బోణీ బాగుంది.
క్యూ2లో 15శాతం పెరుగుదల 8రూ.73,188 కోట్లకు ఆదాయం
ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్
4,258 మంది ఉద్యోగుల నికర పెరుగుదల
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసిక (క్యూ2) ఆర్థిక ఫలితాల సీజన్ బోణీ బాగుంది. ఈ సీజన్ తొలి రోజున ఆర్థిక ఫలితాలు ప్రకటించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ వర్గాల అంచనాలను మించిన పనితీరును కనబరిచింది. ఈ క్యూ2లో టీసీఎస్ రూ.13,884 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ఇదే కాలానికి గడించిన రూ.12,075 కోట్ల లాభంతో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1)లో నమోదైన రూ.13,349 కోట్ల లాభంతో పోల్చినా 4 శాతం వృద్ధిని కనబరిచింది. కాగా, ఈ క్యూ2లో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 11.22 శాతం పెరిగి రూ.73,188 కోట్లకు చేరిం ది. 2025-26లో ఇదే కాలానికి ఆదాయం రూ.65,799 కోట్లుగా ఉంది. ఇక ఈ క్యూ1లో నమోదైన రూ.72,275 కోట్ల రెవెన్యూతో పోలిస్తే క్యూ2లో 1.3 శాతం వృద్ధి నమోదైంది. సెప్టెంబరు త్రైమాసికానికి అన్ని అంతర్జాతీయ మార్కెట్లు, ఇండస్ట్రీ విభాగాలు మెరుగైన వృద్ధి కనబరిచాయని టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ అన్నారు.
మరిన్ని విషయాలు..
క్యూ2లో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సేవల ద్వారా వార్షిక ఆదాయ అంచనా 310 కోట్ల డాలర్లు దాటింది. మొత్తం రెవెన్యూలో ఏఐ ఆదాయ వాటా 10 శాతానికి చేరుకుందని సంస్థ తెలిపింది. జూన్ క్వార్టర్‌లో ఇది 260 కోట్ల డాలర్లుగా ఉంది.
జూలై-సెప్టెంబరులో కంపెనీ 960 కోట్ల డాలర్ల విలువైన కొత్త కాంట్రాక్టులను దక్కించుకుంది. జూన్‌తో ముగిసిన తొలి క్వార్టర్‌లో లభించిన 950 కోట్ల డాలర్ల ఆర్డర్లతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి.
సెప్టెంబరు 30తో ముగిసిన మూడు నెలల్లో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య నికరంగా 4,258 పెరుగుదలతో మొత్తం 5,98,056కు చేరుకుంది. కంపెనీ ఉద్యోగులు పెరగడం వరుసగా ఇది మూడో త్రైమాసికం. కాగా, క్యూ2లో ఉద్యోగుల వలసల రేటు కూడా 13.3 శాతానికి తగ్గింది. క్యూ1లో ఇది 13.6 శాతంగా ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ తన వాటాదారులకు ఒక్కో షేరుకు రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
10,000 మంది ఫ్రెషర్ల నియామకం
సెప్టెంబరు త్రైమాసికంలో 10,000 మంది ఫ్రెషర్లను ఉద్యోగంలో చేర్చుకున్నట్లు టీసీఎస్ తెలిపింది. క్యూ1లో 14,000 మంది ఫ్రెషర్లను చేర్చుకుంది.