రూ.48 లక్షల కోట్లు
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:34 AM
దేశ, విదేశాల్లో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న భారత యువ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ‘అవెండస్ వెల్త్- హురున్ ఇండి యా అండర్ 35’ జాబితా విడుదలైంది.
దేశంలో యువ పారిశ్రామికవేత్తల వ్యాపారాల మొత్తం విలువ ఇది..
‘అవెండస్ వెల్త్- హురున్ ఇండియా అండర్ 35’ జాబితా విడుదల
మొత్తం 180 మందికి చోటు.. హైదరాబాద్ నుంచి ఐదుగురికి స్థానం
న్యూఢిల్లీ: దేశ, విదేశాల్లో వ్యాపార రంగంలో దూసుకెళ్తున్న భారత యువ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ‘అవెండస్ వెల్త్- హురున్ ఇండి యా అండర్ 35’ జాబితా విడుదలైంది. ఈ ఏడాదికి గాను రూపొందించిన ఈ లిస్ట్లో మొత్తం 180 మందికి చోటు దక్కింది. 2025 జాబితాలోని 155 మందితో పోలిస్తే, వీరి సంఖ్య 16 శాతం పెరిగింది. అంతేకాదు, ఈసారి జాబితాలోని యంగ్ ఆంత్రప్రెన్యూర్స్ ప్రాతినిథ్యం వహిస్తున్న కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.48 లక్షల కోట్లుగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే 23 శాతం అధికం. మరిన్ని విషయాలు..
ఈ 180 మంది యువ పారిశ్రామివేత్తల కంపెనీలు మొత్తం 5.88 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
వీరికి చెందిన 37 కంపెనీలు ఒక్కోటీ 100 కోట్ల డాలర్లకు (సుమారు రూ.9,500 కోట్లు) పైగా విలువ చేసేవని తెలిపింది.
ఈ ఏడాది జాబితాలో 71 శాతం (127 మంది) తొలి తరం యువ పారిశ్రామికవేత్తలే. మిగతా 53 మంది వ్యాపారాన్ని వారసత్వంగా అందుకున్నవారు. అందులో 16 శాతం రెండో తరం, 9 శాతం మూడో తరం, 4 శాతం నాలుగో తరానికి చెందిన వారు.
ఈసారి లిస్ట్లో 23 మంది మహిళలకు చోటు లభించింది. అంటే వీరి వాటా 12.8 శాతం.
నగరాల వారీగా చూస్తే, బెంగళూరు నుంచి అత్యధికంగా 52 మందికి చోటు దక్కగా.. 30 మందితో ముంబై రెండో స్థానంలో, 25 మందితో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. గురుగ్రామ్ నుంచి 14 మంది, శాన్ఫ్రాన్సిస్కో, అహ్మదాబాద్ నుంచి 10 చొప్పున, నోయిడా నుంచి 7 మంది, హైదరాబాద్ నుంచి ఐదు మంది ఈ జాబితాలో ఉన్నారు.
హైదరాబాద్ ఆంత్రప్రెన్యూర్ల జాబితా
పేరు | వయసు | కంపెనీ |
వెంకట సంజీవ్ అల్లూరి | 35 | అవంతీ ఫీడ్స్ |
కేశవ్ రెడ్డి | 31 | ఈక్వల్ ఏఐ |
అనుపమ్ పెదరాల | 32 | నెక్ట్స్వేవ్ |
రాహుల్ అత్తలూరి | 35 | నెక్ట్స్వేవ్ |
హర్ష రెడ్డి పొంగులేటి | 32 | రాఘవ కన్స్ట్రక్షన్స్ |