Share News

భారత కుబేరుల్లో ముకేశ్‌ నం.1

ABN , Publish Date - Mar 07 , 2026 | 03:25 AM

ఈ ఏడాదికి గాను హురున్‌ విడుదల చేసిన భారత కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో కొనసాగారు....

భారత కుబేరుల్లో ముకేశ్‌ నం.1

న్యూఢిల్లీ: ఈ ఏడాదికి గాను హురున్‌ విడుదల చేసిన భారత కుబేరుల జాబితాలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ అగ్రస్థానంలో కొనసాగారు. అంబానీ కుటుంబ సంపద గడిచిన ఏడాది కాలంలో 9 శాతం పెరిగి రూ.9.8 లక్షల కోట్లకు పెరిగిందని హురున్‌ రిపోర్టు వెల్లడించింది. భారత్‌తో పాటు ఆసియా సంపన్నుడు కూడా ముకేశే. ప్రపంచ రిచ్‌ లిస్ట్‌లో మాత్రం 17వ స్థానంలో ఉన్నారు. కాగా, భారత జాబితాలో రూ.7.5 లక్షల కోట్ల ఆస్తితో గౌతమ్‌ అదానీ ఫ్యామిలీ, రూ.3.2 లక్షల కోట్ల నెట్‌వర్త్‌తో హెచ్‌సీఎల్‌ టెక్‌ చైర్మన్‌ రోష్నీ నాడార్‌ కుటుంబం వరుసగా 2,3 స్థానాల్లో నిలిచారు. రోష్నీ నాడార్‌ మన టాప్‌-10 బిలియనీర్లలోని ఏకైక మహిళ కూడా. అయితే, గడిచిన ఏడాది కాలంలో అదానీ ఆస్తి 14 శాతం, నాడార్‌ సంపద 10 శాతం తగ్గింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సైరస్‌ పూనావాలా (రూ.3 లక్షల కోట్లు), ఆదిత్య బిర్లా గ్రూప్‌ అధిపతి కుమార మంగళం బిర్లా (రూ.2.5 లక్షల కోట్లు) వరుసగా 4,5 స్థానాల్లో ఉన్నారు. సన్‌ఫార్మాకు చెందిన దిలీప్‌ సంఘ్వీ, విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీ, నీరజ్‌ బజాజ్‌ కుటుంబం, ఆశోక్‌ హిందుజా ఫ్యామిలీ, డీమార్ట్‌ వ్యవస్థాపకులు రాధాకిషన్‌ దమానీ వరుసగా 6 నుంచి 10 వరకు స్థానాలను దక్కించుకున్నారు. జూఈ ఏడాది భారత్‌లోని మొత్తం బిలియనీర్ల సంఖ్య 308కు చేరుకుంది. 2025 జాబితాతో పోలిస్తే 24 మంది పెరిగారు. వీరి మొత్తం సంపద వార్షిక ప్రాతిపదికన 10 శాతం పెరిగి రూ.112.6 లక్షల కోట్లకు చేరుకుంది.


  • అత్యధిక మంది బిలియనీర్లు ఉన్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది. 1,110 మంది కుబేరులతో చైనా అమెరికాను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి ఎగబాకగా.. 1,000 మంది బిలియనీర్లతో యూఎస్‌ రెండో స్థానానికి పరిమితమైంది.

  • ఈ ఏడాది ఇండియా లిస్ట్‌లో కొత్తగా 57 మందికి చోటు దక్కగా.. గత ఏడాది జాబితాలోని 27 మంది ఈసారి స్థానం కోల్పోయారు. ముంబైలో అత్యధికంగా 95 మంది బిలియనీర్లు నివసిస్తుండగా.. ఢిల్లీ (64 మంది), బెంగళూరు (30 మంది) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

  • మన బిలియనీర్లలో 23 మంది (7 శాతం) మహిళలు. వారి మొత్తం సంపద రూ.9.8 లక్షల కోట్లు.

  • భారత కుబేరుల సగటు సంపద రూ.36,570 కోట్లు. సగటు వయసు 67. కాగా, ఓయో వ్యవస్థాపకుడైన 32 ఏళ్ల రితేష్‌ అగర్వాల్‌ రూ.14,440 కోట్ల నెట్‌వర్త్‌తో దేశంలోని అత్యంత పిన్న వయస్కుడైన బిలియనీర్‌గా నిలిచారు.

  • ఈసారి పదికి పైగా తెలుగు వారికి జాబితాలో చోటు దక్కింది. అందులో దివీస్‌ లేబొరేటరీస్‌ చైర్మన్‌ మురళీ దివి అగ్రస్థానంలో ఉన్నారు.

ప్రపంచ సంపన్నుడు మస్క్‌

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ 79,200 కోట్ల డాలర్ల ఆస్తితో ఈ ఏడాది కూడా ప్రపంచ సంపన్నుల జాబితాలో నం.1 స్థానాన్ని కొనసాగించారు. ఈ ఏడాది కాలంలో ఆయన సంపద ఏకంగా 89 శాతం పెరిగింది. అంతేకాదు, ప్రపంచ నం.2గా ఉన్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ నెట్‌వర్త్‌ రూ.30,000 కోట్ల డాలర్లతో పోలిస్తే రెట్టింపు కంటే అధికం. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ ప్రమోటర్లైన ల్యారీ పేజ్‌, సెర్గే బ్రిన్‌తో పాటు ఒరాకిల్‌ వ్యవస్థాపకులు ల్యారీ ఎల్లిసన్‌ టాప్‌-5లోని మిగతా స్థానాల్లో ఉన్నారు. ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా సీఈఓ మార్క్‌ జుకెర్‌బర్గ్‌ 23,400 కోట్ల డాలర్ల నెట్‌వర్త్‌తో 6వ స్థానానికి జారుకున్నారు.

4,000 దాటిన ప్రపంచ బిలియనీర్లు

ప్రపంచ బిలియనీర్ల సంఖ్య తొలిసారిగా 4,000 దాటింది. ఈ ఏడాది 4,020కు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే వీరి సంఖ్య ఏకంగా 578 లేదా 17 శాతం పెరిగింది. అంటే, గడిచిన ఏడాది కాలంలో సగటున రోజుకు ఇద్దరు బిలియనీర్లుగా ఎదిగారన్నమాట. ప్రపంచ బిలియనీర్లలో కృత్రిమ మేధ (ఏఐ) కంపెనీలకు చెందిన వారు 114 మంది. అందులో 46 మందికి తొలిసారిగా చోటు దక్కడం గమనార్హం.

Updated Date - Mar 07 , 2026 | 03:25 AM